నా రికార్డును నేనే తిరగరాశా

ABN , First Publish Date - 2022-01-13T15:00:35+05:30 IST

ప్రజలకు ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు ఎంత అవసరమో కరోనా మహమ్మారి రుజువు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక రాష్ట్రంలో ఒకే సమయంలో 11 వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చర్రితలోనే ఇదే ప్రథమమని ప్రధానమంత్రి

నా రికార్డును నేనే తిరగరాశా

- Prime minister 

- ఒకేరోజు 11 వైద్య కళాశాలల ప్రారంభం

- సెమ్మొళి భవనం కూడా


చెన్నై: ప్రజలకు ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు ఎంత అవసరమో కరోనా మహమ్మారి రుజువు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒక రాష్ట్రంలో ఒకే సమయంలో 11 వైద్య కళాశాలలు ప్రారంభించడం దేశ చర్రితలోనే ఇదే ప్రథమమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించి తాను రికార్డు సృష్టించానని, ఇప్పుడు తమిళనాడులో ఒకేరోజు 11 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా తన రికార్డును తానే బద్దలు కొట్టానని చమత్కరించారు. రాష్ట్రంలో రూ.4 వేల కోటతో ఏర్పాటైన 11 కొత్త వైద్యకళాశాలలను, సెమ్మొళి తమిళ పరిశోధనా సంస్థ భవన సముదాయాన్ని ఢిల్లీ నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘తై పిరందాల్‌ వళి పిరక్కుమ్‌’ (తైనెల ఆరంభమైతే అందరి సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది) అనే తమిళనానుడిని ఉటంకిస్తూ, ‘తమిళ సోదర సోదరీమణులకు నమస్కారం’ అంటూ తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశం వైద్యరంగంలో సాధిస్తున్న ప్రగతిని చూసి అన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. వైద్య విద్య అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రస్తుతం వైద్యవిద్యపై విద్యార్థుల ఆసక్తి విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. దేశంలో నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని, అందరికీ నాణ్యమైన వైద్యచికిత్స అందుబాటులో రావాలని, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఐదేళ్ళ వైద్య విద్యా పథకం దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానున్నదని మోదీ వెల్లడించారు. ఆరోగ్యం, ఆసుపత్రులు ఎంతటి అవసరమో కరోనా సంక్షోభం ప్రజలందరికీ రుజువుపరచిందన్నారు. దేశ ప్రజలను వైరస్‌ బారి నుండి కాపాడేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని మరీ పాటుపడుతున్నాయన్నారు. విరుదునగర్‌, కళ్లకుర్చి, నీలగిరి, రామనాధపురం, తిరుప్పూరు, నామక్కల్‌, తిరువళ్లూరు, కృష్ణగిరి, దిండుగల్‌, అరియలూరు, నాగపట్టినంలలో ఏర్పాటైన కొత్త వైద్య కళాశాలల వైద్య సేవలను ఆయా జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్యరంగాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచలేదని ఆయన విమర్శించారు. ఆ తర్వాత ఆయన నగరంలోని పెరుంబాక్కంలో రూ.24 కోట్లతో నిర్మించిన సెమ్మొళి తమిళ పరిశోధనా సంస్థ నూతన భవనసముదాయాన్ని కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా మోదీ క్లుప్తంగా మాట్లాడుతూ.. అమెరికాలో ప్రాచీనమైన తమిళ భాషలో కొన్నినిముషాలపాటు ప్రసంగించే అరుదైన భాగ్యం తనకు లభించిందని చెప్పారు. 


ప్రతి జిల్లాకు ఓ వైద్యకళాశాల - అదే మా లక్ష్యం: సీఎం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ప్రతిజిల్లాలో ఓ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలన్నదే డీఎంకే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్తగా 11 వైద్యకళాశాలల ఏర్పాటుకు అన్ని విధాలా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ వైద్య కళాశాలల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. వైద్యరంగంలో రాష్ట్రం ముందంజలో ఉందని నిరుపేదలకు వైద్యసేవలందించటంలోనూ, కరోనా బాధితులకు అంతర్జాతీయ స్థాయి చికిత్స అందించటంలో పేరుగడించిందన్నారు. నిరుపేదలకు వైద్య బీమా పథకాన్ని సమర్థవంతంగా తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌తోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంచుగ్‌ మాండవ్య, రాష్ట్ర మంత్రులు ఎం.సుబ్రమణ్యం, ఏవీ వేలు, తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు. రాజ్‌భవన్‌నుండి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి  పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T15:00:35+05:30 IST