విద్యుత్‌ బకాయిలు రూ.2.5 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-07-31T08:13:42+05:30 IST

విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరగా చెల్లించాలని

విద్యుత్‌ బకాయిలు రూ.2.5 లక్షల కోట్లు

ఇంధన రంగం బలోపేతానికి సహకరించాలని మోదీ పిలుపు

రాజకీయాల్లో నేతలకు నిజం చెప్పే లక్షణం పోతోందని వ్యాఖ్య

వీటిని త్వరగా చెల్లించండి.. రాష్ట్రాలకు ప్రధాని విజ్ఞప్తి


కందుకూరు/జ్యోతినగర్‌, న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ బకాయిలు పేరుకుపోవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలు దాదాపు రూ.2.5 లక్షల కోట్ల మేరకు బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరగా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంధన రంగాన్ని బలోపేతం చేసి, దేశ పురోభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే పాతికేళ్ల దేశ భవిష్యత్తులో ఇంధన రంగం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ‘‘ఉజ్వల భారత్‌, ఉజ్వల భవిష్య ఇంధనం-2047’’ కార్యక్రమంలో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘కొన్ని రాష్ట్రాలు.. లక్షల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఈ సొమ్మును చెల్లించండి’’ అని సూచించారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు, స్థానిక సంస్థలు ఏకంగా.. రూ.60 వేల కోట్లకు పైగా.. బకాయి పడ్డాయని, సబ్సిడీ నిధులను కూడా విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,70,000 మెగావాట్లకు పెరిగిందన్నారు.


‘సౌభాగ్య’ పథకం కింద మరో 3 కోట్ల కనెక్షన్లను ఇచ్చామని తెలిపారు. విద్యుత్‌లేని గ్రామాల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీపీసీకి చెందిన రూ.5,200 కోట్ల విలువైన హరిత ఇంధన ప్రాజెక్టుకు, 735 మెగా వాట్ల నోఖ్‌ సోలార్‌ ప్రాజెక్టు(రాజస్థాన్‌), గ్రీన్‌ హైడ్రోజన్‌ మొబిలిటీ ప్రాజెక్ట్‌(లేహ్‌), కవాస్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ బ్లెండింగ్‌ నేచురల్‌ గ్యాస్‌ ప్రాజెక్ట్‌(గుజరాత్‌)లకు శంకుస్థాపన చేశారు. 


ఏపీ గిరిజనుడితో మోదీ సంభాషణ

ఏపీలోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చింతపల్లి మండలానికి చెందిన క్రాంతి అనే గిరిజనుడితో ప్రధాని మాట్లాడారు. విద్యుత్‌ సౌకర్యంలో వచ్చిన మార్పుల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి అంతకు ముందు విద్యుత్‌ లేదని, ఇటీవల ఆ సౌకర్యం రావడంతో పలు వసతులు అందుబాటులోకి వచ్చాయని క్రాంతి వివరించారు. బోరు వేసుకున్నామని, టీవీ వస్తోందని పేర్కొన్నారు. 


సాగుకు 30 ఏళ్లు ఉచిత విద్యుత్‌: విజయానంద్‌

విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ప్రధాని పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌ మాట్లాడుతూ.. వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి 30 ఏళ్లు ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం ‘సెకి’తో 7000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామన్నారు.

Updated Date - 2022-07-31T08:13:42+05:30 IST