ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-04-10T07:06:25+05:30 IST

బ్రిటిష్‌ రాణి ఎలిజెబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. రాచభవనం విండ్సర్‌ కేసిల్‌లో శుక్రవారం తెల్లవారుఝామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు రాజప్రాసాదం ఓ ప్రకటనలో తెలిపింది

ప్రిన్స్‌ ఫిలిప్‌ కన్నుమూత

99 ఏళ్ల వయసులో తుదిశ్వాస

రాణి కోసం వ్యక్తిగత జీవితం త్యాగం


లండన్‌, ఏప్రిల్‌ 9: బ్రిటిష్‌ రాణి ఎలిజెబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ (99) కన్నుమూశారు. రాచభవనం విండ్సర్‌ కేసిల్‌లో శుక్రవారం తెల్లవారుఝామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు రాజప్రాసాదం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ సమయంలో రాణి ఆయన చెంతనే ఉన్నారు. వారిరువురిదీ 73 ఏళ్ల వైవాహిక జీవితం. భర్తే తనకు కొండంత బలమనీ, ఇన్ని దశాబ్దాలపాటు నిరాటంకంగా  సజావుగా  రాజరికపు బాధ్యతలు తాను నిర్వర్తించగలగడానికి ఆయనే కారణమని, ఆయన రుణం ఎన్నడూ తీర్చుకోలేననీ  గతంలో రెండు సందర్భాల్లో ఎలిజెబెత్‌ చెప్పారు. బయటకు ఎప్పుడు వచ్చినా ఇద్దరూ కలిసే వచ్చేవారు. ఇపుడు జీవన సాయం సంధ్యలో 94-ఏళ్ల ఆమె తన జీవిత భాగస్వామిని కోల్పోవడంపై బ్రిటన్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. బ్రిటన్‌ చరిత్రలో ఇంత ఎక్కువ కాలం జీవించిన రాజప్రముఖుడు ఈయనే కావడం విశేషం. వీరికి నలుగురు పిల్లలు.. ప్రిన్స్‌ చార్లెస్‌ (72), ప్రిన్సెస్‌ ఏనీ (70), ప్రిన్స్‌ ఏండ్రూ (61), ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ (57). తల్లి నుంచి కరుణను, తండ్రి నుంచి క్రమశిక్షణ, విధి నిర్వహణలో చిత్తశుద్ధిని నేర్చుకున్నట్లు ఏండ్రూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  


గ్రీకు రాకుమారుడు..

ఫిలిప్‌ గ్రీకు రాకుమారుడు. గ్రీస్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌కు, ఎలై్‌సకు 1921లో జన్మించారు. అక్కడే పెరిగి పెద్దవాడై ఉండుంటే గ్రీస్‌-డెన్మార్క్‌ల రాజయ్యేవారు. కానీ సైనిక కుట్రతో ఈ రాజదంపతులను దేశం నుంచి వెళ్లగొట్టడంతో ఓ బ్రిటిష్‌ యుద్ధనౌకలో వారు క్షేమంగా ఇటలీ చేరారు. ఓ పండ్లబుట్టనే చిన్నపాటి బెడ్‌గా మార్చి అందులో పసివాడైన ఫిలి్‌పను పడుకోబెట్టి తీసుకొచ్చారు. ఫిలిప్‌ బాల్యం అస్తవ్యస్తంగా సాగింది. నరాల బలహీనతతో తల్లి ఆమె 30 ఏటనే ఆస్పత్రి పాలయింది. తండ్రి ఓ  యువతితో ప్రేమాయణం సాగించి ఫ్రాన్స్‌ వెళ్లిపోయాడు. దాంతో ఫిలి్‌పను తల్లి బంధువులు బ్రిటన్‌ తీసుకొచ్చి  పెంచారు. మౌంట్‌బాటెన్‌ అనే ఇంటిపేరుతో స్కాటిష్‌ స్కూల్లో చదివారు ఫిలిప్‌. ఆ తరువాత బ్రిటానియా రాయల్‌ నేవీ కాలేజ్‌లో చేరి  టాపర్‌గా, బెస్ట్‌ కేడెట్‌గా ఉత్తీర్ణుడయ్యాడు. 1942లో ఆయన బ్రిటన్‌లోనే అతి పిన్నవయస్కుడైన నేవీ ఫస్ట్‌ లెఫ్టినెంట్‌గా అందరి ప్రశంసలూ అందుకున్నారు. 


కింగ్‌ జార్జ్‌-6 తన ఇద్దరు కుమార్తెలు- ఎలిజెబెత్‌, మార్గరెట్‌లతో కలిసి 1939లో ఆ కాలేజీకి వచ్చినపుడు ఆ కుమార్తెల వెన్నంటి ఉండి, వారికి వినోదం పంచే బాధ్యతను ఫిలి్‌పకు అప్పగించారు. అదే తొలిసారి ఎలిజెబెత్‌-ఫిలి్‌పల కలయిక. తదనంతరం చాలా మార్లు ఇరువురూ లేఖల ద్వారా ప్రేమను కొనసాగించారు. చివరకు తాను ఫిలి్‌పను పెళ్లాడదలిచానని ఎలిజెబెత్‌ చెప్పినపుడు రాజకుటుంబం ఆశ్చర్యపోయింది. చివరకు కింగ్‌జార్జ్‌ వారి పెళ్లికి అంగీకరించి 1947 నవంబరు 20న వైభవంగా వివాహం చేశారు. అపుడు ఫిలిప్‌ మౌంట్‌బాటెన్‌ కాస్తా డ్యూక్‌ ఆఫ్‌ ఎడిన్‌బరో అయ్యారు. తన తండ్రి కింగ్‌జార్జి-6 మరణానంతరం రాణి పదవిని ఎలిజెబెత్‌ అలంకరించారు.  ఫిలిప్‌ చాలా పట్టుదల, రుజువర్తన, మనోబలం ఉన్న వ్యక్తి. ఎలిజెబెత్‌కు ఆయన ద్వారానే ఈ లక్షణాలు సంక్రమించాయంటారు. భార్యకు సహకరించేందుకు తన వ్యక్తిగత కోరికలు, లక్ష్యాలను త్యాగం చేసిన వ్యక్తి ఫిలిప్‌. రాణికి భర్తయ్యాక కోటలో అనేక మార్పులు తీసుకొచ్చారు. దుబారా వ్యయం అరికట్టారు. సూటిగా మాట్లాడే ఫిలిప్‌ చాలా సందర్భాల్లో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కాగా ఫిలిప్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, రాహుల్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-04-10T07:06:25+05:30 IST