ఆసుపత్రిలో జైలు

ABN , First Publish Date - 2021-03-08T06:01:28+05:30 IST

తుపాకీ విసుగు తూటాలు సర్దుకుని, మాసిన గుడ్డతో తనను తాను తుడుచుకుంటూ కాపలా కాసే దురదృష్టాన్ని...

ఆసుపత్రిలో జైలు

తుపాకీ విసుగు తూటాలు సర్దుకుని, 

మాసిన గుడ్డతో తనను తాను తుడుచుకుంటూ 

కాపలా కాసే దురదృష్టాన్ని శపించుకుంటుంది.


దౌర్బల్యపు ఇనుప ఊసల మీద తాళం, 

చట్టం చేసిన సంతకంలా తుప్పుపట్టి వేలాడుతుంది.

కోరా రంగుకు మారిన ఖాదీబట్టపై

నిస్సహాయపు నీలం గీతలు 

సముద్రపు అలల్లా గదిలో పోటెత్తుతుంటాయి. 

ఖైదు జీవితపు నిట్టూర్పు, 

నిశ్శబ్ద సమాధిలో ఎప్పుడూ కళ్ళు తెరిచే పడుకుంటుంది. 

ఆవేశపు నేరం ఎంత శిక్ష అనుభవించినా 

తరగని ఒంటరితనపు నిప్పు సెగై 

రగుల్తూనే ఉంటుంది. 


పేరు, ఊరు ఉండవు!

నంబరు, నేరమే పుట్టుమచ్చలు. 

ఏనాడో పడవెళ్ళిపోయిన తీరంలో 

మిగిలిన దీపస్తంభంలా

ఇంటి జ్ఞాపకం మినుకు మినుకుమంటుంటే 

ఆసుపత్రికొచ్చిన ఖైదీలెవ్వరూ 

బతుకు పూవుల్లా విరబూస్తున్నట్టు లేరు.

ఋతువులు మారినా మార్పులేని కాలం మంచమ్మీద    

మందు రాయాల్సిన గాయానికి ఓదార్పు కరువౌతుంది.


చెరసాలలో మోగే సైరన్‌ ఈ వార్డులో వినపడదు కానీ,

గాలిని పీలికలు చేస్తున్న దుఃఖపు హృదయాలు,  

మూగబోయిన ఆనవాళ్ళను 

చెదపట్టిన చెక్కలా పొట్టు రాల్చుతుంటాయి  

ఇక్కడ బంధించిందెవర్ని? 

కళ్ళలో వేదన, కదలికల్లో అగాధాలు!

ఎక్కడిదీ భయంకర ఆత్మఘోష?


వీళ్ళను పౌరులుగా మరిచిపోయి 

నిర్దయగా నెట్టేసిన మన నాగరికత,

ఆ గది గోడల మీద నైరాశ్యపు 

నల్ల రంగును పులుముతుంది.

ఈ మందుల వాసన నిండిన చోట 

కాస్తంత ప్రేమ ఒక్కటే

మళ్ళీ పచ్చిక మొలిచిన పరిమళాన్ని గుబాళిస్తుంది    


(ప్రభుత్వాసుపత్రిలోని ప్రిజనర్స్‌ వార్డ్‌ దాటుతున్నప్పుడల్లా కదిలి)

కాళ్ళకూరి శైలజ

98854 01882


Updated Date - 2021-03-08T06:01:28+05:30 IST