Advertisement
Advertisement
Abn logo
Advertisement

Team India: ఇంగ్లండ్‌కు పృథ్వీషా

కొలంబో: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టులో పలువురు ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం కావడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇందులో భాగంగా శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లండ్‌కు పంపాలని బోర్డు నుంచి శిఖర్ ధవన్ సేనకు పిలుపు అందించినట్టు సమాచారం.


వీరు ముగ్గురు మరో 24 గంటల్లో ఇంగ్లండ్‌కు పయనం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో రేపటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.

అయితే, పై ముగ్గురిని ఇంగ్లండ్‌కు పంపాలంటూ బోర్డు నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని యువ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదని, కాబట్టి తమ టీ20 వ్యూహంలో ఎలాంటి మార్పు ఉండబోదని ధవన్ పేర్కొన్నాడు.


ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శుభ్‌మన్ గిల్, అవేష్ ఖాన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాల బారినపడడంతో వీరిని స్వదేశం పంపనున్నట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి స్థానాలను షా, సూర్యకుమార్ యాదవ్, దేవదత్ పడిక్కల్‌తో భర్తీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, దేవదత్ పడిక్కల్, జయంత్ యాదవ్‌లలో ఎవరిని పిలవాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం.


ముగ్గురు క్రికెటర్లు మాత్రం రేపు రాత్రి శ్రీలంక నుంచి ఇంగ్లండ్‌కు బయలుదేరుతారని సమాచారం. వీరు శ్రీలంక నుంచి వెళ్తుండడంతో పది రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. మ్యాచ్ ఆగస్టు 4న ప్రారంభం కానుండడంతో అప్పటికి క్వారంటైన్ పూర్తి కాదు కాబట్టి తొలి టెస్టుకు అందుబాటులో లేనట్టే.  

Advertisement
Advertisement