ప్రైవసీ

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

మొదట్లో అంతా బాగానే ఉంటుంది వైరస్‌ పేరు మీద దొరికిన ఆటవిడుపు అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది.. మొదట్లో అంతా బాగానే ఉంటుంది ఆఫీసు పేరిట ఎగిరిపోయే జంట పక్షులు రెండూ..

ప్రైవసీ

మొదట్లో అంతా బాగానే ఉంటుంది

వైరస్‌ పేరు మీద దొరికిన ఆటవిడుపు

అందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది..

మొదట్లో అంతా బాగానే ఉంటుంది

ఆఫీసు పేరిట ఎగిరిపోయే జంట పక్షులు రెండూ..

ఇంటి పట్టునే ఉండటం, పిల్లలకు సందడిగానే ఉంటుంది

స్కూళ్లు, హోంవర్క్‌లు లేకపోవడం ప్రాణానికి హాయినిస్తుంది

అంతా కలిసి కాసిన్ని నవ్వుల్ని వెదజల్లుకోడం బానే ఉంటుంది

తెలివిగా వెలువడే పిల్లల మాటల నుంచి..

వాళ్లు ఎదిగిపోయారని తెల్లబోవడం

పిల్లాటలు మాని మేధో పజిల్స్‌ మాటున ఫూల్‌ కావడం

వూట్‌ కిడ్స్‌ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ మీదుగా ఈది..

చివరకు అంతా ‘ఇంగ్లీష్‌ ఛానల్‌’ ఈదాల్సి రావడం

కాంటినెంటల్‌ డిషెస్‌ను కావాల్సినట్టుగా

యూట్యూబు నుంచి ఆమె డౌన్‌లోడ్‌ చేసేయడం

ఎప్పుడూ సోదిలోకి కూడా రాని బంధువులను

వాట్సప్‌ వీడియోల్లో వాటేసుకోవడం.

ఇంటిపనుల సెల్ఫీలతో, వీడియోలతో

అందరం కాసేపు సెలబ్రిటీలమై పోవడం

అంతా బానే ఉంటుంది, మొదట్లో.

ఊరి చివరో, వీధి వాకిట్లోనో

ఒళ్లు విరుచుకుంటున్న వైరస్‌ అలికిడి

ఈ హడావిడి మధ్య కాసేపు మ్యూట్‌ అవుతుంది.

ఇంతకీ, అసలు మొదట్లో అనేది ఎక్కడ మొదలైనట్టు..

ఎన్ని రోజులు ఆ మొదటి ఉత్సహాం ఉరకలేసేట్టు?

కొందరికి కొన్నాళ్లు.. మరికొందరికి ఇంకో నాలుగు నాళ్లు

తర్వాత మధ్యతరగతి సంసారాలన్నీ..

మద్యధరా సముద్రాలవుతాయి

నిశ్శబ్దంగా ఒక్కొక్కరిలో అంతర్వాహినులు 

సుడుల సవ్వడి

మృత్యు భయమేదో జరాసంధుడిలా 

అడ్డం పడుతుండటంతో

ముఖంపై నవ్వులు బలవంతపు కెరటాలవుతాయి

కానీ, మూతివిరుపులు.. నురగ కప్పిన 

రహస్యాలను విప్పెస్తాయ్‌

ఫేషియల్స్‌, డైలు లేని అసహజ రూపాలతోపాటు

అసహన సహజ అవతారాలు పెల్లుబికుతాయి

ఉరకలేసిన పిల్లల ఉత్సాహం, మళ్లీ

వాళ్ల ప్రపంచంలోకే ముడుచుకుపోతుంది

మురిపించిన చిట్టి చేతుల సాయం

ఫేస్‌బుక్‌లో మెమరీగా మారిపోతుంది

దుమ్ము దులిపి, తుడిచి సర్దిన బొమ్మలన్నీ

ధగధగలు కోల్పోయిన కొత్త 

ధూళితో బిత్తరపోయి చూస్తుంటాయి

వేషం, సన్నివేశం.. సందర్భాసందర్భంగా ఏకమై

సినిమాలన్నీ రివైండ్‌లో చిక్కుకుంటాయి

మసాలాలు ఎన్ని దట్టించినా

వంట ఘాటుపై ఎవరూ కాంప్లిమెంటూ పోస్ట్‌ చేయరు

చూడాల్సిన వీడియోలతో కిక్కిరిసిపోయిన గ్యాలరీలా

బంధువులంతా ముఖాలు ముడిచేసుకుంటారు, మనలాగే.

మన సొంతూరిలో, మన సొంత వీధిలో, మన సొంతింట్లో

మనల్ని మనమే సమాధి చేసుకున్నట్టు

ఎవరి గదుల్లో వాళ్లు.. ఎవరి గాడ్జెట్లలో వాళ్లు..

ఎవరి ఆలోచనల్లో వాళ్లు..

ఎవరి భీతిలోనూ వాళ్లే.

ఎవరికి వాళ్లే స్వేచ్ఛాయుత నిర్బంధంలో పడి

స్వీయ జీవితేచ్ఛ మధ్య తేలియాడుతుంటారు

ఎందుకంటే, మొదట్నించీ మనం కోరిందీ

జీవించడాన్ని సైతం పణంగా పెట్టిందీ,

రాకాసి ఒంటి స్తంభాలు నిర్మించుకున్నదీ..

ఈ ప్రైవసీ కోసమేగా.

కొంపదీసి ఈ వైరస్‌..

మన ప్రైవసీకి పట్టిన చెదపురుగు కాదు కదా?

దేశరాజు


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST