Abn logo
Aug 13 2020 @ 02:15AM

ప్రైవేటు బస్సులో మంటలు ఐదుగురి సజీవదహనం

  • మృతుల్లో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు
  • చిత్రదుర్గ జిల్లాలో ఘటన

బెంగళూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కాగా మిగిలిన ఇద్దరు మహిళలు. విజయపుర జిల్లా నుంచి మంగళవారం రాత్రి బయలుదేరిన బస్సు ఎక్కడా ఆపకుండా రావడంతో ఇంజను వేడెక్కడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విజయపుర నుంచి 29 మంది ప్రయాణీకులు ఇద్దరు డ్రైవర్లతో బెంగళూరుకు బస్సు బయలుదేరినట్లు ఏజెన్సీ నిర్వాహకులు విజయపురలో ప్రకటించారు. కానీ మధ్యలో మరో నలుగురు చేరినట్లు తెలుస్తోంది.


పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున  హిరియూరు తాలూకా కేఆర్‌హళ్లి వద్దకు బస్సు చేరుకునే సరికి ఇంజను నుంచి మంటలు చెలరేగాయి. పలువురు ప్రాణాలకు తెగించి బయట పడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ఇద్దరు డ్రైవర్లు ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా, పారిపోవడమే ప్రమాదానికి కారణమయ్యింది.. బస్సులో ఉన్నవారందరికీ గాయాలు కాగా స్పర్శ(8), సమృద్ధ(5), నిశ్చిత(3), శీలా రవి (23), కవితా వినాయక (29)లు బస్సులోనే కాలిపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108తో పాటు ఫైర్‌ ఇంజన్లకు ఫోన్‌ ద్వారా సమాచారమిచ్చారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికే బస్సు పూర్తిగా కాలిపోయింది. బాధితులను చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విజయపుర ఎస్పీ అనుపమా ఆగర్వాల్‌ ప్రమాదంపై ఆరా తీశారు. చిత్రదుర్గ జిల్లా ఎస్పీ రాధిక ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటించారు. 


Advertisement
Advertisement
Advertisement