ప్రైవేటు బస్సులా..కష్టమే!

ABN , First Publish Date - 2020-06-05T09:14:53+05:30 IST

ప్రైవేటు బస్సులు ఇప్పట్లో రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. వచ్చే ఆగస్టు వరకు పూర్తి లాక్‌డౌన్‌లోనే ఉండనున్నాయి.

ప్రైవేటు బస్సులా..కష్టమే!

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రైవేటు బస్సులు ఇప్పట్లో రోడ్డెక్కే పరిస్థితి కనిపించటం లేదు. వచ్చే ఆగస్టు వరకు పూర్తి లాక్‌డౌన్‌లోనే ఉండనున్నాయి. మార్కెట్‌ను బట్టి బస్సులు తిప్పాలా వద్దా అన్నది సెప్టెంబరులో ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు తీసిన నేపథ్యంలో, ప్రైవేటు బస్సులు కూడావస్తాయని భావించారు. వీరు మాత్రం ఇప్పట్లో కుదిరే పరిస్థితి లేదని భావిస్తున్నారు. భౌతిక దూరం నిబంధనల వల్ల 40 సీటింగ్‌ బస్సులో 27 మందిని మాత్రమే తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆపరేటర్‌ ప్రభుత్వానికి అనేక టాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. బస్సు సీటింగ్‌ ఆదాయంలోనూ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.


ఈ పరిస్థితుల్లో తక్కువ సీటింగ్‌తో వయబిలిటీ కాదని భావిస్తున్నారు. ఒకవేళ ధైర్యం చేసి బస్సులు తీసినా ప్రయాణికుల డిమాండ్‌ కూడా అంతగా ఉండే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రోత్సాహకాలు, ఇన్సూరెన్స్‌లు వంటివి వస్తాయేమోనని ఎదురుచూసినా అలాంటి హామీలేవీ రాకపోవటంతో నిరాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బస్సులు తిప్పాలంటే ఛార్జీలు పెంచటమే మార్గంగా కనిపిస్తుంది. దానికీ అనుమతులు కావాలి. ప్రయాణికులూ రిసీవ్‌ చేసుకోవాలి. కొవిడ్‌ కారణంగా ఛార్జీలు పెంపు కూడా మరో సమస్య అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆగస్టు వరకు బస్సులను లాక్‌డౌన్‌లో ఉంచటమే మేలని భావిస్తున్నట్టుగా నగరంలోని సీనియర్‌ బస్‌ ఆపరేటర్‌ రవీంద్ర ట్రావెల్స్‌ అధినేత రవీంద్ర ఆంధ్రజ్యోతికి చెప్పారు.

Updated Date - 2020-06-05T09:14:53+05:30 IST