ప్రైవేటు దందా

ABN , First Publish Date - 2021-04-22T07:03:30+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృత రూపం దాలుస్తోంది. కేవలం ఏప్రిల్‌ మాసంలోనే 2981 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.

ప్రైవేటు దందా

కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ

డబ్బు డిపాజిట్‌ చేస్తేనే వైద్యం

రూ.లక్ష నుంచి రూ.4లక్షలకు పైగా వసూళ్లు

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అందని చికిత్స

చితికిపోతున్న బాఽధితులు


కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతితో జనం చిగురుటాకులా వణుకుతున్నారు. సైలెంట్‌ కిల్లర్‌గా లక్షణాలు కనిపించకుండానే మహమ్మారి విస్తరిస్తోంది.  ఈ అవకాశాన్ని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డబ్బు చేసుకుంటున్నాయి. కరోనా వైద్యానికి చికిత్స తీసుకోవాలంటే లక్షల్లో డిపాజిట్‌ చేస్తే తప్ప ఆసుపత్రుల్లో బెడ్లను కేటాయించని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిని బట్టి లక్ష మొదలుకుని మూడు లక్షల వరకు డిపాజిట్‌ చేయించుకుంటున్నారని సమాచారం. దీంతో ప్రైవేటు వైద్యం, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. 


కడప, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృత రూపం దాలుస్తోంది. కేవలం ఏప్రిల్‌ మాసంలోనే 2981 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది. కరోనాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వైద్యసేవలు విస్తరించేందుకుగాను ఆరగ్యోశ్రీ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ ఆసుపత్రుల్లో కేటాయించిన బెడ్లలో ఆరోగ్యశ్రీ ఉన్నవారికి ఉచితంగా చికిత్స అందించాలి. మిగతా వారికి ప్రభుత్వం సూచించిన ధర మేరకే చికిత్స నిర్వహించాలి. జిల్లాలో ఆరోగ్యశ్రీకింద కడపలో 6, ప్రొద్దుటూరులో 4, రాయచోటిలో ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా చికిత్స చేస్తామంటూ మరికొన్ని హాస్సిటల్స్‌ దరఖాస్తు చేసుకున్నాయి. రెండు మూడురోజుల్లో వీటికీ అనుమతి వచ్చే అవకాశం ఉంది.


క్యాష్‌ చేసుకుంటున్నారు

కరోనా వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రులు కొన్ని దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోంది. దగ్గినా, ఆయాస పడుతూ ఆసుపత్రి మెట్లెక్కినా కరోనా అంటూ రోగులను భయపెట్టి నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన ధరకు చికిత్స అందివ్వకుండా ఆసుపత్రిలో బెడ్డు కావాలంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. కడపలో ఓ ఆసుపత్రి రూ. 3లక్షలు డిపాజిట్‌ వసూలు చేస్తుండగా, మరో ఆసుపత్రి రూ.ఒకటిన్నర లక్ష, ఇంకో ఆసుపత్రి రూ.2లక్షలు డిపాజిట్‌ చేస్తేనే చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్‌ చేయలేమంటే బెడ్లు లేవంటున్నారని సమాచారం.


ప్రభుత్వ రేట్లు ఇవీ..

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ధరలు నిర్ణయించింది. చికిత్సను బట్టి వైద్య సిబ్బంది, పీపీఈ కిట్లు, టెస్టులు, మందులు, న్యూట్రిషన ఖర్చుతో కలిపి ధర నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ట్రస్టు తరపున ప్రకటనలు ఇచ్చారు. అత్యవసరం కాని చికిత్సలైతే రోజుకు రూ.3,220, ఐసీయూ ఉంచితే వెంటిలేటర్‌, ఎనఐవీ లేకుండా అయితే రూ.5,480, నోట్లో పైపులేకుండా వెంటిలేటరు ద్వారా ఆక్సిజన అందించే చికిత్స అయితే రూ.5,980, నోట్లో పైపు ద్వారా వెంటిలేటరుతో ఆక్సిజన అందించే వ్యవస్థకు రూ.9,580 తీసుకోవలి. అలాగే రక్తంలో ఇనఫెక్షనకు చికిత్స చేస్తే రూ.6280, రక్తంలో ఇనఫెక్షన, వెంటిలేటరు పెడితే రూ.10,380, రక్తంలో ఇనఫెక్షన ఉండి, బీపీ, పల్స్‌ పడిపోయే పరిస్థితి అంతకు మించి శరీర భాగాలు పనిచేయకుంటే రూ.10,380 వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదని అంటున్నారు. డిపాజిట్‌ కట్టడంతో పాటు రోజుకు రూ.35వేలు చార్జీ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిటికల్‌ పరిస్థితి అయితే మందుల పేరిట రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 


గతంలోనూ ఇంతే..

కరోనా వైద్యంపేరిట గత సంవత్సరం కడప, ప్రొద్దుటూరులోని కొందరు డాక్టర్లు బాగా క్యాష్‌ చేసుకున్నట్లు వైద్యవర్గాలు చెవుతున్నాయి. లాక్‌డౌన కారణంగా తొలినాళ్లలో ప్రైవేటు ఆసుపత్రులు తెరవలేదు. తరువాత ప్రైవేటుకు అనుమతిచ్చారు. కడపలో నలుగురు డాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ట్రీట్‌మెంటు అందించారని సమాచారం. వీరు సుమారు రూ.6కోట్లకు పైగానే ఆర్జించినట్లు చెబుతారు. ట్రీట్‌మెంటు కోసం రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. అప్పట్లో ప్రొద్దుటూరులోనూ ఇలానే చేశారని సమాచారం. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండడంతో గతంలోలాగా క్యాష్‌ చేసుకునేందుకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధమైనట్లు విమర్శలున్నాయి. కరోనాకు చికిత్స అందించేందుకు మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిఘా లేకపోతే జనం నిలువుదోపిడీకి గురవుతారు.


ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

- డాక్టర్‌ రఘు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ 

ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు వైద్యమందించాలి. కరోనా వైద్యానికి ప్రభుత్వం సూచించిన ధర ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డిపాజిట్‌ తీసుకున్నా కూడా చర్యలు తప్పవు.

Updated Date - 2021-04-22T07:03:30+05:30 IST