ప్రైవేటు దోపిడీ

ABN , First Publish Date - 2021-04-14T05:58:32+05:30 IST

జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై నిఘాలేదు. వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ లేదు. కరోనా పేరునా అవసరం లేకున్నా పరీక్షలు చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా ఆవైపు చూసేవారు లేరు.

ప్రైవేటు దోపిడీ


జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పేరిట అడ్డగోలు పరీక్షలు

అవసరం లేకున్నా వేల రూపాయల ఫీజుల వసూళ్లు

ఇబ్బందులు పడుతున్న రోగులు.. పట్టించుకోని అధికారులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులపై నిఘాలేదు. వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ లేదు. కరోనా పేరునా అవసరం లేకున్నా పరీక్షలు చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా ఆవైపు చూసేవారు లేరు. జ్వరం, ఇతర లక్షణాలతో వచ్చేవారికి పలు పరీక్షలను నిర్వహించడంతో భారీగా డబ్బులు చికిత్స పేరున తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు లేకున్నా సిటీస్కాన్‌, ఇతర పరీక్షలను చేస్తూ రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రైవేటు ఆసుపతుల్రకే చికిత్స చేసేందుకు అనుమతులు ఇచ్చినా నగర పరిధిలోని చాలా ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరంలేని మం దులను కూడా అంటగడుతుండడం తో సాదారణ రోగాలతో వచ్చిన వారు కూడా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 

నెల రోజులుగా పెరిగిన కేసులు 

జిల్లాలో నెల రోజులుగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. ప్రతిరోజూ వందలాది కేసులు బయటపడుతున్నా యి. నగరంలోని జనరల్‌ ఆసుపత్రితో పాటు అన్ని పీహెచ్‌సీల పరిధిలో ర్యాపిడ్‌ టెస్టులను ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు. భారీగా కేసులు వస్తుండడంతో ప్రతిరోజూ టెస్టులను పెంచుతున్నారు. కరోనా వచ్చి సీరియస్‌ అవుతున్న వారిని ఆసుపత్రులలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రితో పాటు ఆర్మూర్‌, బోధన్‌ ఆసుపత్రిలో కరోనా వచ్చిన వారికి చికి త్స అందిస్తున్నారు. వీటితో పా టు ప్రభుత్వం నగర పరిధిలోని 9 ఆసుపత్రులకు కరోనా చికిత్స అందించేందుకు అనుమతి ఇచ్చిం ది. వీటిలో 305 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి మినహా వేరే ఆసుపత్రిలో కరోనాకు సంబంధించిన చికిత్స అందించకూడదు. ఒకవేళ పాజిటివ్‌ వచ్చినవారు ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులలో ఇది కనిపించడంలేదు. 

అనుమతులు  లేకుండానే సేవలు, పరీక్షలు..

నెల రోజులుగా కేసులు భారీగా పెరగడంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో అనధికారికంగా కరోనా సేవలు అందిస్తున్నారు. తమ ఆసుపత్రికి వచ్చే వారికి అనధికారికంగా పరీక్షలు చేస్తున్నారు. కరోనా తేలకున్నా వారికి అధిక మందులు ఇస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలతో వచ్చే వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంతమందికి సాధారణ జ్వరం ఉండి మూడు నాలుగు రోజులకు తగ్గిపోవడంతో ఇతర పరీక్షలు చేస్తున్నారు. వారికి సిటీ స్కానింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రూ.వేలకువేలు డబ్బులను వసూలు చేస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్ట్‌, ఆర్టీపీసీఆర్‌ ద్వారానే చేయాలని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు ఉన్న ఎవరూ పట్టించుకోవడంలేదు. 

సందడిగా  మారుతున్న ల్యాబ్‌లు

కరోనా పేరుతో అవసరం లేకున్నా పలు పరీక్షలు చేయడంతో ల్యాబ్‌లన్నీ జ్వరాలు వచ్చిన వారితో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ల్యాబ్‌లలో అనధికారంగా ఈ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సిటీస్కాన్‌లో ఎలాంటివి రాకున్న కొంతమంది వైద్యులు తమ ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నుంచి అధికారులకు ప్రతీనెలా మామూళ్లు అందుతుండడంతో వాటిపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడంలేదు. ప్రైవేటు ల్యాబ్‌లు, సిటీ స్కాన్‌ల వైపు చూడడంలేదు. కేసులు పెరుగుతున్న సమయంలో రోగులను భయాందోళనకు గురిచేయకుండా ప్రైవేటు ఆసుపత్రులలో వైద్య సేవలు అందిస్తే వారికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

పర్యవేక్షణ కరువు..

నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా లేకపోవడం, తరచూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని ఆసుపత్రులు నామమాత్రం అనుమతులు తీసుకుని వాటిని నడిపిస్తున్నారు. జిల్లాలో మొదటి విడత కరోనా వ్యాప్తి సమయంలో నిర్వహించిన విధంగానే ప్రస్తుతం పలు ఆసుపత్రుల పరిధిలో ఇవి చేస్తున్నారు. సెకండ్‌వేవ్‌తో కేసులు ఎక్కువ కావడం.. ఎక్కువ మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరికి పలువురు వైద్యులు ఫోన్ల ద్వారా వైద్య సేవలు అందించడంతో పాటు మందులను వారి ఇళ్లకు పంపిస్తున్నారు. సాధారణ తీవ్రత ఉన్నవారితో పాటు కొంచెం ఎక్కువగా ఉన్నవారికి కీలకమైన మందులను ఇస్తున్నారు. భారీగా ఫీజులను వసూలు చేస్తున్నారు. ఈ ఆసుపత్రులపై వైద్య, ఆరోగ్యశాఖ నిఘా లేకపోవడంతో ఎక్కువగా ఈ విధానంలో సేవలు అందిస్తున్నారు. 

మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై ఏది నిఘా?

జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో ఎక్కువ మంది మందుల కోసం మెడికల్‌ షాప్‌లు, ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా పాజిటివ్‌ రాగానే పీహెచ్‌సీలలో ఇచ్చే కిట్స్‌తో పాటు వైద్యులు సూచించిన విధంగా కుటుంబ సభ్యులను పంపి మందులను తెప్పించుకుంటున్నారు. కరోనా వచ్చిన వారు వినియోగించే కొన్ని రకాల మందులు జిల్లాకు తక్కువగా వస్తుండడంతో ఏజెన్సీలతో పాటు మెడికల్‌ షాప్‌ల యజమానులు ధరలు పెంచి అమ్ముతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు చేస్తున్న కొన్నింటిలో ఈ దందా ఆగడంలేదు. కీలకమైన మందుల కొరత సృష్టిస్తూ దొరకడంలేదు, సరఫరా లేదనే పేరుతో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు వీటిపై దృష్టిపెడితే అసలైన ధరలకు మందులు కరోనా వచ్చినవారికి అందే అవకాశం ఉంది. జిల్లాలో ఆసుపత్రులలో కరోనా పేరునా టెస్టులు, చికిత్సపై దృష్టిసారిస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. తమకు ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడతామని తెలిపారు. 


Updated Date - 2021-04-14T05:58:32+05:30 IST