మృతదేహం అప్పగింతలో జాప్యం.. అనుమానాస్పదం.. ఆస్పత్రి నిర్వాకం

ABN , First Publish Date - 2020-08-07T19:30:07+05:30 IST

కొవిడ్‌ అనుమానాస్పదమంటూ మృతదేహం అప్పగింతలో 24 గంటల పాటు జాప్యం చేసిన పటాన్‌చెరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రి చేసిన నిర్వాకం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ యంత్రాంగం

మృతదేహం అప్పగింతలో జాప్యం.. అనుమానాస్పదం.. ఆస్పత్రి నిర్వాకం

3 రోజులకే రూ. లక్షన్నర బిల్లు

చెల్లించిన గంటకే చనిపోయాడని  ఆస్పత్రి నుంచి ఫోన్‌ 

బాధితులకు నిరభ్యంతర పత్రం ఇచ్చిన కొద్దిసేపటికే వాపస్‌ తీసుకున్న కొండాపూర్‌ ఎస్‌ఐ 

24 గంటల తర్వాత ఇచ్చిన వైనం

కోవిడ్‌ అనుమానమంటూ ఖననం చేయించినా ధ్రువీకరించని ఆస్పత్రి సిబ్బంది


సంగారెడ్డి(ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ అనుమానాస్పదమంటూ మృతదేహం అప్పగింతలో 24 గంటల పాటు జాప్యం చేసిన పటాన్‌చెరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రి చేసిన నిర్వాకం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ యంత్రాంగం   వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి (40) న్యూమోనియాతో బాధ పడుతూ ఈ నెల 2న పటాన్‌చెరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో పేషెంట్‌కు కరోనా లేదంటూ ఆస్పత్రిలో చేర్చుకుని కుటుంబ సభ్యుల నుంచి రూ.50 వేలను డిపాజిట్‌ చేయించుకున్నారు. మరుసటిరోజు మరో రూ.50 వేలను తీసుకున్నారు. నాలుగో తేదీన మరోసారి రూ.50 వేలు చెల్లించి ఇంటికి వచ్చిన గంటలోపే పేషెంట్‌ మరణించాడని ఆస్పత్రి సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు.


అదే రోజు మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసుల నుంచి నిరభ్యంతర(ఎన్‌వోసీ) పత్రం తీసుకురావాలని ఆస్పత్రి యాజమాన్యం కుటుంబసభ్యులకు తెలిపింది. తమ పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఏదీ నమోదు కాలేదని, అందువల్ల మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వవచ్చని కొండాపూర్‌ ఎస్‌ఐ ఈ నెల 4వ తేదీన ఎన్‌వోసీ రాసి ఇచ్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే కొద్దిసేపటికే తమ నుంచి ఎన్‌వోసీ తీసుకున్న ఎస్‌ఐ మరుసటి రోజు వరకు ఇవ్వలేదని, అప్పటిదాకా ఆస్పత్రి యాజమాన్యం తమకు మృతదేహం అప్పగించలేదని వారు వాపోయారు. ఎస్‌ఐ అలాంటి ఎన్‌వోసీ ఈ నెల 5న మళ్లీ ఇచ్చారని, ఆ లేఖ ఇచ్చిన తర్వాతే ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించారన్నారు.


ఎస్‌ఐ పాత్రపై అనుమానాలు

మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాలంటూ పటాన్‌చెరు ఆస్పత్రి పేరిట ఎన్‌వోసీ ఇవ్వడంలో కొండాపూర్‌ ఎస్‌ఐ 24 గంటల పాటు జాప్యం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అప్పగించాలని తొలుత అదే రోజు రాసిన ఎన్‌వోసీని మరుసటిరోజు వరకు ఎందుకు వాయిదా వేసినట్టో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ మళ్లీ 5వ తేదీన ఎన్‌వోసీ ఇచ్చే వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలో ఉంచుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  


కొవిడ్‌ అనుమానాస్పద మృతి..!

సదరు వ్యక్తికి తొలుత కరోనా లేదంటూ ఆస్పత్రిలో చేర్చుకున్న యాజమాన్యం మూడు రోజుల్లో లక్షా యాభై వేల రూపాయలు కట్టించుకున్నది. ఆ వెంటనే కోవిడ్‌ అనుమానాస్పద మృతిగా ఆస్పత్రి యాజమాన్యం చెబుతున్నది. అయితే ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారాన్ని సైతం ఇవ్వలేదు. మృతదేహాన్ని మాత్రం కోవిడ్‌ అనుమానాస్పదమంటూ అధికారులే నిబంధనల మేరకు ఖననం చేయించారు. కరోనా అనుమానముందంటూ తమకు కనీసం సమాచారాన్ని  ఇవ్వలేదు.. సరికదా  మృతదేహాన్ని సైతం చూడనీయలేదని, ఖననం దగ్గరికి రానీయలేదని కుటుంబసభ్యులు వాపోయారు. ఇంత జరిగినా ఇప్పటివరకు తమకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని, తమను ఐసోలేషన్‌, క్వారంటైన్‌లలో ఉండాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పలేదని వారు తెలిపారు. ఈ వ్యవహారమంతా గమనిస్తే  పటాన్‌చెరులోని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం, కొండాపూర్‌ ఎస్‌ఐ పాత్రపై  అనుమానాలు కలుగుతున్నాయని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. 


మూడు రోజుల్లో అంత ఖర్చెందుకు?

పటాన్‌చెరులోని ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల నుంచి మూడు రోజులకు రూ. లక్షా 50 వేలను ఎందుకు కట్టించుకున్నదో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు వాపోయారు. తొలుత కరోనా లేదని చెప్పిన ఆస్పత్రి వర్గాలు ఈ మూడు రోజుల్లోను ఆక్సిజన్‌ ఇవ్వలేదని, వెంటిలేటర్‌ అమర్చలేదని వారు తెలిపారు. ఆటో నడుపుకుని జీవించే తమ కుటుంబం నుంచి మూడు రోజులకే లక్షా 50 వేల రూపాయల బిల్లు తీసుకోవడం, ఒక రోజు మృతదేహాన్ని ఆస్పత్రి యాజమాన్యం తమ వద్దే ఉంచుకోవడం వంటి అంశాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-07T19:30:07+05:30 IST