ప్రాణానికో రేటు

ABN , First Publish Date - 2021-05-18T05:45:29+05:30 IST

ప్రాణానికో రేటు

ప్రాణానికో రేటు

కరోనా వైద్యానికి ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీ

ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు

కరోనా బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు

ఇంజక్షన్లు, మందులు, ఆక్సిజన్‌కు అదనం

అనుమతులు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లే ఎక్కువ

చోద్యం చూస్తున్న అధికారులు

కృష్ణలంక నల్లగేటు వద్ద ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా 22 మంది కరోనా బాధితులకు వైద్యం చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు డాక్టరుపై కేసు నమోదు చేశారు. అదే ప్రాంతంలోని వెంకటేశ్వరపురం ఎల్‌వీ రామయ్య వీధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కరోనా బాధితులకు అనధికారికంగా వైద్యం చేస్తున్న మరో బీడీఎస్‌ డాక్టరుపై కూడా కేసు నమోదు చేశారు. 

బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లను ఒక్కొక్కటి రూ.40వేలకు విక్రయిస్తుండగా, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టుకున్నారు. పటమట పోలీసుస్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. 

..ప్రభుత్వ అనుమతులు లేకుండా కరోనా రోగులకు వైద్యం చేయడం, అనుమతి ఉన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సను నిరాకరించడం, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలకు రోజుకు రూ.75వేల నుంచి రూ.లక్షకు పైగా గుంజడం, ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లకు అదనంగా బాదడం.. ఇలా ఒకటా.. రెండా.. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అడుగడుగునా అక్రమాలే.. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ప్రైవేట్‌ వైద్యుల దోపిడీకి పట్టపగ్గాలు ఉండట్లేదు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రులతో పాటు మరో 73 ప్రైవేట్‌ ఆసుపత్రులకు అనుమతులు లభించాయి. వీటిలో మొత్తం 4,500 పైగా పడకలను కరోనా బాధితుల కోసం కేటాయించగా, వాటిలో 729 ఆక్సిజన్‌, 2,107 నాన్‌ ఆక్సిజన్‌, 1,670 జనరల్‌ పడకలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాలామంది కరోనా బాధితులు ప్రాణాలను కాపాడుకోవాలనే ఆత్రుతలో అనుమతులు లేని ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కాసులు కాజేయడానికి ఇదే సదావకాశంగా కొందరు ప్రైవేట్‌ వైద్యులు ప్రభుత్వ అనుమతులు లేకపోయినా చికిత్స చేస్తున్నారు. నగరం సహా జిల్లావ్యాప్తంగా కాస్త పేరున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌, చిన్నచిన్న క్లినిక్‌లు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కొవిడ్‌ ప్రమాణాలు పాటించకుండా వైద్యం చేసేస్తున్నారు. సీరియస్‌ అయిన వారికి ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ తదితర ఇంజక్షన్లు, మందులు ఇస్తున్నారు. చివరి నిమిషంలో చేతులెత్తేస్తున్నారు. ఇలా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొంతమందిని చివరి దశలో ఉండగా బయటకు పంపేస్తున్నారు. అప్పటికే తమ వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఎక్కువ మంది కరోనా బాధితులను చివరి నిమిషంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. అయితే, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడో, వివాదాలు వెలుగుచూసినప్పుడో ప్రైవేట్‌ ఆసుపత్రులకు జరిమానాలు విధిస్తూ అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారు. 

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అక్రమాలు

ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు దోపిడీకి తెరతీశారు. ఐసీయూలో చికిత్స కోసం వెళ్లే కరోనా బాధితులు కనీసం రూ.2 లక్షలు డిపాజిట్‌గా చెల్లిస్తేనే బెడ్‌ కేటాయిస్తున్నారు. ఆ తర్వాత ఐసీయూలో ఎన్ని రోజులు చికిత్స అందిస్తే అన్ని రోజులకు రోజుకు సగటున రూ.లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. బెడ్స్‌లో సగం ఆరోగ్యశ్రీ కింద కేటాయించాలని, మిగిలిన వాటికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే వసూలు చేయాలన్న నిబంధన కాగితాలకే పరిమితమవుతోంది. ఎవరైనా రూల్స్‌ మాట్లాడితే బెడ్స్‌ ఖాళీ లేవని చెప్పి పంపించేస్తున్నారు. దీంతో డబ్బు పోయినా ప్రాణాలు దక్కితే చాలనుకుంటున్న కరోనా బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రులకే ప్రాధాన్యమిస్తున్నారు. రూ.3వేలలోపు ఉండే రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు, ఇతర అత్యవసర మందుల సరఫరా సక్రమంగా లేకపోవడంతో మెడికల్‌ మాఫియా వాటిని బ్లాక్‌ మార్కెట్‌లో రూ.40వేలకు పైగా విక్రయిస్తూ అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటోంది. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు జిల్లాలో ఇప్పటికే సగానికి పైగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అక్రమాలను గుర్తించి చర్యలకు సిఫార్సు చేశాయి.

ల్యాబ్‌ల్లోనూ 

కరోనా నిర్ధారణ పరీక్షలకు జిల్లాలో రెండు, మూడు ప్రైవేట్‌ ల్యాబ్‌లకే అనుమతి ఉంది. వాటిలో కొవిడ్‌ టెస్టుకు రూ.499, సీటీ స్కాన్‌కు రూ.3వేలు వసూలు చేయాలి. కానీ, జిల్లాలోని ప్రైవేట్‌ ల్యాబ్‌ల నిర్వాహకులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే టెస్టులు నిర్వహిస్తున్నాయి. ర్యాపిడ్‌ టెస్టుకు రూ.1,500 నుంచి రూ.2వేలు, ఆర్టీసీ పీసీఆర్‌ టెస్టుకు రూ.3వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సీటీ స్కాన్‌కు రూ.10వేలకు పైగా తీసుకుంటున్నారు.

నిబంధనలు తూచ్‌  

చట్టప్రకారం ప్రతి ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను వైద్య ఆరోగ్య శాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వాటిని ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేయించుకుంటుండాలి. ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఈ భవనాలకు మున్సిపాలిటీ   లేదా గ్రామ పంచాయతీ, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు, ఐఎంఏ సభ్యత్వం, తగినంత మంది నిపుణులైన వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, వైద్య పరీక్షల సామగ్రి.. ఇలా అన్నింటి పైనా ఆడిట్‌ నివేదికలు సమర్పించాలి. కానీ, జిల్లాలో అనేక ప్రైవేట్‌ ఆసు పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లను రిజిస్ట్రేషన్‌ చేయించ కుండానే నిర్వహిస్తున్న ఘటనలో జిల్లాలో ఉన్నాయి.

Updated Date - 2021-05-18T05:45:29+05:30 IST