ఇంటర్‌ పరీక్షలకు సహకరిస్తాం

ABN , First Publish Date - 2021-10-23T08:13:59+05:30 IST

ఇంటర్‌ పరీక్షలకు అన్నివిధాల సహకరిస్తామని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. బోధనా రుసుముల (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) బకాయిల విడుదలకు కృషి చేస్తామని అధికారులు ఇచ్చిన..

ఇంటర్‌ పరీక్షలకు సహకరిస్తాం

  •  ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల సంఘం ప్రకటన
  • బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌తో చర్చలు సఫలం
  • బోధనా రుసుముల బకాయిల చెల్లింపుపై హామీ

హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షలకు అన్నివిధాల సహకరిస్తామని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్య సంఘం ప్రకటించింది. బోధనా రుసుముల (ఫీజు రీయింబర్స్‌మెంట్‌) బకాయిల విడుదలకు కృషి చేస్తామని అధికారులు ఇచ్చిన హామీతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంఘం అధ్యక్షుడు గౌరి సతీష్‌, కార్యదర్శి తిరుపతి రెడ్డి తదితరులు శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్న క్రమంలో.. రెండున్నరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.312 కోట్ల బోధనా రుసుములను విడుదల చేయకుంటే, సహకరించమని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల సంఘం నిరసనకు దిగింది. శుక్రవారం కళాశాలల ప్రతినిధులతో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ చర్చలు జరిపారు. బకాయిలు త్వరగా మంజూరయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వెంటనే ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేశారు. దీంతో ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు నిరసన విరమించారు.


ప్రిన్సిపాళ్ల సంతకం సంగతేంటి?

విద్యార్థుల పరీక్ష హాల్‌ టికెట్‌పై సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్‌ సంతకం విషయంలో స్పష్టత కొరవడింది. సంతకం అవసరం లేదని సర్కారు ఇదివరకే స్పష్టం చేసింది. తాజా చర్చల్లో మాత్రం ప్రిన్సిపాళ్ల సంతకానికి ప్రభుత్వం అంగీకరించిందని ప్రైవేట్‌ కళాశాలల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, ఈ సాకుతో రెండో ఏడాది ఫీజులు కట్టాలని విద్యార్థులను కళాశాలలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. లేదంటే హాల్‌ టికెట్‌పై సంతకం చేసేది లేదని తేల్చిచెబుతున్నాయి. సోమవారం నుంచి జరిగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు అఽధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. 1,768 పరీక్ష కేంద్రాల్లో 4,59,228 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరైనా ఒత్తిడి, భయానికి గురవుతుంటే.. సాయం కోసం క్లినికల్‌ సైకాలజి్‌స్టల సేవలు పొందవచ్చని బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. సైకాలజిస్టులు డాక్టర్‌ అనిత ఆరే (9154951704), డాక్టర్‌ మేజర్‌ అలీ (9154951977), రజనీ తెనాలి (9154951695),  పి.జవహర్‌లాల్‌ నెహ్రూ (9154951699), ఎస్‌.శ్రీలత (9154951703), శైలజ పిశాపాటి (9154951706), అనుపమ(9154951687) అందుబాటులో ఉంటారన్నారు.


జోక్యం చేసుకోం: హైకోర్టు

 25 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ప్రమోట్‌ అయి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మళ్లీ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ తల్లిదండ్రుల సంఘం హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్‌ వాదించారు.  ఏడాదిన్నర కాలంగా తరగతులకు హాజరుకాకుండా పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.  రెండు రోజుల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకుంటే విద్యార్థులు గందరగోళానికి గురవుతారని పేర్కొన్నది.


ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే పిటిషన్‌ దాఖలు చేయాల్సిందని, పిటిషన్‌ దాఖలు చేయడంలో ఆలస్యమైందని ధర్మాసనం పేర్కొన్నది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. పిటిషనర్‌ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవడంతో విచారణను ముగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఈ తీర్పును స్వాగతిస్తున్నట్టు ఇంటర్‌ విద్య జేఏసీ నాయకులు పి.మధుసూదన్‌రెడ్డి, కృష్ణకుమార్‌ ప్రకటించారు.

Updated Date - 2021-10-23T08:13:59+05:30 IST