ప్రైవేటు వైద్య సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-05-14T08:13:21+05:30 IST

రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేటు వైద్య సంస్థలను రాష్ట్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేలా ఆదేశించాలని

ప్రైవేటు వైద్య సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

హైకోర్టులో ‘ఐలూ’ ప్రజాహిత వ్యాజ్యం

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేసేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు, ప్రైవేటు వైద్య సంస్థలను రాష్ట్రప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 17న విచారణ జరగనుంది. కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వెద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, భారత బీమా నియత్రణ అథారిటీ (ఐఆర్‌డీఏఐ), భారత వైద్య మండలి, ఏపీ వైద్య మండలి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ‘కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం జీవోలు జారీ చేసినా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటివి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనలను కఠినంగా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం అలసత్వం వహించింది. విపత్కర పరిస్థితులను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులు బాధితుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయి. వాటిపై నియంత్రణ అవసరం. సరిపడా ఆక్సిజన్‌ సరఫరా లేక కొవిడ్‌ బాధితులు మరణిస్తున్నారు. సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించాలి’ అని పిల్‌లో కోరారు. 

Updated Date - 2021-05-14T08:13:21+05:30 IST