Abn logo
Jun 14 2021 @ 13:41PM

కేసీఆర్ సర్కార్ ఆదేశాలు బేఖాతర్‌.. టీసీపీలకు ‘ఫీజు’ ముడి!

  • పెండింగ్‌ ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని బెదిరింపులు
  • ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తున్న విద్యాసంస్థలు
  • జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పెరుగుతున్న ఫిర్యాదులు

కరోనాతో ప్రజలందరూ వణికిపోతుంటే  పలు ప్రైవేట్‌ స్కూళ్లు విద్యార్థుల చదువులతో ఆటలాడుకుంటున్నాయి. పూర్తి ఫీజు చెల్లిస్తేనే పై తరగతికి ప్రమోట్‌ చేస్తామని, బకాయిలు  లేకుంటేనే ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ) ఇస్తామని కొర్రీలు పెడుతున్నాయి. కరోనా  కష్టకాలంలో పెండింగ్‌ ఫీజులు చెల్లించే పరిస్థితి లేక చాలా మంది తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 4,800  కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌, బడ్జెట్‌ పాఠశాలలు నడుస్తున్నాయి. ఆయా  స్కూళ్లలో సుమారు 13 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో  ఆన్‌లైన్‌  క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు ఫీజు ల విషయంలో అస్సలు వెనక్కి తగ్గడంలేదు. కరోనా నేపథ్యంలో కేవలం నెలవారీ ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన జీఓ 46ని ఎవ రూ పట్టించుకోవడం లేదు. పలు కార్పొరేట్‌, టెక్నో స్కూళ్లు తమ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లల నుంచి ఒకేసారి మొత్తం ఫీజులు తీసుకుంటున్నాయి. అడిగిన మొత్తాన్ని ఇస్తేనే ఆన్‌లైన్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఇస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి. పెండింగ్‌ ఫీజులు చెల్లిస్తేనే పై తరగతికి అప్‌గ్రేడ్‌ చేస్తామని, మొత్తం ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నాయి. పాత విద్యాసంవత్సరానికి సంబంధించిన పెండిం గ్‌ ఫీజును కొంత తగ్గిస్తే, ఆలస్యంగా చెల్లిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నా కొన్ని పాఠశాలల అధికారులు వినడం లేదు.  


విద్యాహక్కు చట్టం ఉల్లంఘన..

విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి దాక పిల్లలు టీసీలు, రికార్డు షీటు లేకుండానే ఒక స్కూల్‌ నుంచి మరో స్కూల్‌కు మారే అవకాశం ఉంది. 9, 10 తరగతులకు మాత్రం టీసీ నిబంధన కచ్చితంగా అమలు చేస్తున్నారు. అయితే, కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లు చైల్డ్‌ ఇన్‌ఫో సైట్‌ను ఆధారంగా చేసుకుని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రతి స్కూల్‌లో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్యను ఏటా తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం చైల్డ్‌ ఇన్‌ఫో రిజిస్ర్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యార్థి, టీచర్‌ పేరు, పుట్టిన తేదీ, తరగతి వివరాలను, ఆధార్‌కార్డును లింక్‌ చేస్తూ సైట్‌లో పొందుపరుస్తున్నారు. అయితే, పిల్లలు స్కూల్‌ మారుతున్న క్రమంలో చైల్డ్‌ఇన్‌ఫో డ్రాప్‌ బాక్స్‌లో సంబంధిత నిర్వాహకులు క్లియరెన్స్‌ చూపిస్తే.. వేరే అడ్మిషన్‌ సులువుగా ఉంటుంది. లేకుంటే స్థానిక విద్యాశాఖాధికారి అందించే లేఖతో కొత్త పాఠశాలతో అడ్మిషన్‌ పొందాల్సి ఉంటుంది. పెండింగ్‌ ఫీజుల కోసం పలు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థులకు టీసీలు ఇవ్వడం లేదు. పాత స్కూల్‌ నుంచి టీసీ రాకపోవడం, చైల్డ్‌ ఇన్‌ఫో డ్రాప్‌బాక్స్‌లో క్లియరెన్స్‌ లేని కారణంగా ఇతర పాఠశాలల్లో చేరికలు ఇబ్బందిగా మారాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీల విషయంలో జిల్లా విద్యాశాఖకు వివిధ మండలాల నుంచి ఇప్పటివరకు 12 ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

మొత్తం ఫీజు కట్టాలంటున్నారు

డీడీ కాలనీలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో నా కూతురు 6వ తరగతి, కుమారుడు రెండో తరగతి చదువుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ ఏడాది ఇద్దరిని వేరే స్కూల్‌లో చేర్పించాలని అనుకుంటున్నా. అయితే పిల్లల టీసీ, రికార్డుషీటు ఇవ్వాలని ఇటీవల యాజమాన్యాన్ని అడిగితే మొత్తం ఫీజు చెల్లించాలంటున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇద్దరి ఫీజు రూ.60 వేలలో ఇప్పటివరకు రూ.28 వేలు చెల్లించాను. కరోనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిగతా ఫీజు చెల్లించపోతున్నానని, పరిస్థితిని అర్థం చేసుకుని టీసీ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. - సంతోష్‌, విద్యానగర్‌, పేరెంట్‌

ప్రభుత్వ హెచ్‌ఎంల వెనకంజ

కరోనా విపత్తు కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయి వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించేందు కు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు సర్కారు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నా.. ప్రైవేట్‌ నిర్వాహకులు పిల్లలకు టీసీలు, రికార్డు షీట్లు ఇవ్వడం లేదు. దీంతో పుట్టిన తేదీ సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్‌ చేసుకునేందుకు హెచ్‌ఎంలు వెనకంజ వేస్తున్నారు. ప్రైవేట్‌ స్కూళ్ల ఆగడాలపై పోరాటం చేస్తాం. - జావేద్‌, ఎస్‌ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు