‘అప్పు’త్కాలం: కొవిడ్‌ దెబ్బకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు విలవిల

ABN , First Publish Date - 2021-02-22T05:27:04+05:30 IST

స్థానికంగానో.. విదేశాల్లోనో చదువుకోవడం కోసం రుణం తీసుకోవడం సాధారణం. కానీ కొవిడ్‌ దెబ్బకు అదంతా మారిపోయింది. ఇప్పుడు చదువు చెప్పడం కోసం.. విద్యాసంస్థలను నడపడం కోసం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘అప్పు’త్కాలం: కొవిడ్‌ దెబ్బకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు విలవిల

రూ.కోట్లలో అప్పులు తెచ్చిన యాజమాన్యాలు

బ్యాంకులు, చిట్టీలు, ఫైనాన్స్‌ సంస్థల నుంచి రుణాలు

బిల్డింగుల అద్దెలు, వాహనాల ఈఎంఐలకు అవస్థలు

చిన్నాభిన్నమైన చిన్న, రూరల్‌ ప్రాంతాల పాఠశాలలు 

ఆర్థికపరిస్థితులు బాగాలేక నలుగురు కరస్పాండెంట్లు మృతి

ఖమ్మం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): స్థానికంగానో.. విదేశాల్లోనో చదువుకోవడం కోసం రుణం తీసుకోవడం సాధారణం. కానీ కొవిడ్‌ దెబ్బకు అదంతా మారిపోయింది. ఇప్పుడు చదువు చెప్పడం కోసం.. విద్యాసంస్థలను నడపడం కోసం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు జరగకపోవడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు.. తమ అడ్మిషన్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుని.. ఈక్రమంలో ఆన్‌లైన్‌ విద్యాబోధనను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఫీజుల వసూళ్లలో ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా చాలామంది కరోనా కారణంగా తమ ఉద్యోగ, ఉపాధి కోల్పోవడం, వ్యాపారాలు దెబ్బతినడం, ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసేవారికి సగం జీతాలే వస్తుండటంతో వారంతా ఫీజులు చెల్లించే విషయంలో ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులు కాస్తా ప్రైవేట్‌ యాజమాన్యాలకు భారంగా మారాయి. ఫలితంగా ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ సంస్థల నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

రూ.కోట్లలో అప్పులు తెచ్చిన నిర్వాహకులు..

కరోనాతో ఏర్పడిన విపత్కర పరిస్థితి దృష్ట్యా ఓ పాఠశాల యాజమాన్యం తమ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి సుమారు రూ.2 కోట్లు అప్పు తీసుకుంది. మరో పాఠశాల, కళాశాల యాజమాన్యం వారు రూ.2కోట్ల వరకు చిట్టీలు పాడారు. మరొకరు రూ.3కోట్లు బ్యాంకు నుంచి తీసుకోవడంతోపాటు మరికొన్ని చేతి రుణాలు తీసుకున్నారు. ఇదీ దాదాపు జిల్లాలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల పరిస్థితి. గత విద్యాసంవత్సరంలో నడిచిన విద్యాసంస్థల్లో.. ప్రస్తుతం సగం సంస్థలే నడుస్తున్నాయి. వాటిల్లోనూ కొన్ని సంస్థలు అరకొరగా జీతాలు ఇస్తూ నడిపిస్తుండగా.. చిన్న సంస్థలు మూతపడ్డాయి. అయితే కొన్ని పేరున్న యాజమన్యాలు మాత్రం అప్పులు తీసుకొచ్చి మరీ తమ సంస్థలను నడిపిస్తున్నాయి. వారు బ్యాంకులు మొదలు చిట్టీలు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు ఇలా ఎక్కడ అప్పులు దొరికితే అక్కడ తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాయి. గతేడాది సరిగ్గా విద్యాసంవత్సరం ముగిసే సమయానికి కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూతపడ్డాయి. దాంతో చాలా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజుల్లో సగం మేరకు వసూలు కాలేదు. అలా ఖమ్మం నగరంలోని ఓ పెద్ద విద్యాసంస్థకు సుమారు రూ. 2.69 కోట్లు విద్యార్థుల నుంచి రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులు కూడా సక్రమంగా వసూలు కాలేదు. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఫీజుల విషయంలో తల్లిదండ్రుల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు పాఠశాలల యాజమాన్యాలు కూడా 30 శాతం వరకు ఫీజు తగ్గిస్తూ.. తమ సంస్థల నుంచి విద్యార్థులు వెళ్లిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. కరోనా పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఒత్తిడి చేయలేకపోవడం లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

అద్దెలు, వాహనాల ఈఎంఐల భారం 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎక్కువ శాతం ప్రైవేట్‌ విద్యాసంస్థలు అద్దె భవనాల్లో ఉన్నాయి. కరోనాతో ఏర్పడిన పరిస్థితులతో అద్దెలు చెల్లించడం, సంస్థల నిర్వహణలో భాగంగా ఈఎంఐ పద్ధతిలో కొనుకున్న వాహనాలకు ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పాఠశాలల్లో ఉన్న సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, అటు బిల్డింగుల అద్దెలు, వాహనాల ఈఎంఐలు చెల్లించలేక సతమతమవుతున్నారు. కాగా ఇటీవల 9,10ఆపై తరగతుల వారికి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో కొంతవరకు ఫీజలు వసూలవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారికి పాత ఫీజులు రాక, కొత్తగా తరగతులు ప్రారంభం కాకపోవడంతో తమ పాఠశాలలు మూతవేసుకున్నారు. అంతేకాదు కరోనా వేళల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో కరస్పాండెంట్లు అనారోగ్యం బారన పడ్డారు. ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యాసంస్థల కరస్పాండెంట్లు నలుగురు మనోవేదన, అనారోగ్యంతో మృతి చెందినట్టు సమాచారం.  

ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి

సూరపనేని శేషుకుమార్‌, రాష్ట్ర ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘ అధికార ప్రతినిధి

కరోనాతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చాలారకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. గతేడాదికి సంబంధించి కొన్ని పాఠశాలల వారికి 50శాతం వరకు ఫీజులు బకాయిలుగానే మిగిలాయి. 9, 10 తరగతులు ప్రారంభించి నెలరోజులు గడుస్తున్నా చాలా పాఠశాలలకి ఆయా తరగతులకు కూడా ఫీజులు రాని పరిస్థితి ఉంది. కొవిడ్‌ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలోలా మన రాష్ట్రంలోనూ అన్ని తరగతుల వారికి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష తరగతులనే కోరుకుంటున్నారు. జూలై వరకు విద్యాసంవత్సరం పొడగించడం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.

Updated Date - 2021-02-22T05:27:04+05:30 IST