3 ఏళ్లలో ప్రైవేటు రైళ్లు

ABN , First Publish Date - 2020-07-03T07:12:39+05:30 IST

రైల్వే సేవలను ప్రైవేటీకరించే ప్రక్రియ మొదలైంది. సికింద్రాబాద్‌, ఢిల్లీ,. బెంగళూరు, చండీగఢ్‌, జైౖపూర్‌, ముంబై, పట్నా, ప్రయాగ రాజ్‌, హౌరా, చెన్నై నగరాల ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలోని 12 క్లస్టర్లలో ప్రైవేట్‌ రైళ్లు

3 ఏళ్లలో ప్రైవేటు రైళ్లు

35 ఏళ్లు.. 30 వేల కోట్లు

దేశంలో 109 మార్గాల్లో 151 రైల్వే సర్వీసులను 35 ఏళ్ల పాటు ప్రైవేటుకు అప్పగించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఒక్కో రైల్లో 16 బోగీలు ఉంటాయి. 160 కిలోమీటర్ల వేగం వరకు అనుమతిస్తారు. ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఈ మేరకు బుధవారం అర్హత కలిగిన కంపెనీల నుంచి అభ్యర్థనలను ఆహ్వానించింది. ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం, ప్రయాణ కాలాన్ని తగ్గించడం, ఉపాధి పెంచడం, డిమాండ్‌-సప్లయి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం ప్రైవేటీకరణ లక్ష్యాలు.


న్యూఢిల్లీ, జులై 2 (ఆంధ్రజ్యోతి): రైల్వే సేవలను ప్రైవేటీకరించే ప్రక్రియ మొదలైంది. సికింద్రాబాద్‌, ఢిల్లీ,. బెంగళూరు, చండీగఢ్‌, జైౖపూర్‌, ముంబై, పట్నా, ప్రయాగ రాజ్‌, హౌరా, చెన్నై నగరాల ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలోని 12 క్లస్టర్లలో ప్రైవేట్‌ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారం రేపుతోంది. మోదీ సర్కారుకు ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యనించారు. కేంద్రం నిర్ణయాన్ని కార్మిక సంఘాల ద్వారా కలిసికట్టుగా ప్రతిఘటిస్తామని వామపక్షాలు ప్రకటించాయి. నాలుగో తేదీ వరకు జరగనున్న బొగ్గు రంగం సమ్మె తీరుగానే రైల్వే ప్రైవేటీకరణను కూడా ప్రతిఘటిస్తామని కార్మిక సంఘం సీఐటీయూ చెప్పింది. ప్రైవేటు రైళ్లు 2023 ఏప్రిల్‌ నుంచి పట్టాల మీద తిరుగుతాయని, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కోచ్‌లను దేశీయంగానే తయారు చేస్తారని రైల్వే బోర్డు చైర్మన్‌ విజయ్‌ కుమార్‌ యాదవ్‌ గురువారం ప్రకటించారు. తొలిదశలో కేవలం ఐదు శాతం రైళ్లను ప్రైవేటుకు అప్పగిస్తామన్నారు. సేవలు సరిగా అందించలేని సంస్థలపై అపరాధ రుసుం విధిస్తామని చెప్పారు. ప్రైవేటు రైళ్లలో చార్జీలు పోటీ పద్ధతిలో ఉంటాయన్నారు. ధరలను నిర్ణయించేటప్పుడు విమానాలు, బస్సుల చార్జీలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు. ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే సెప్టెంబరు నుంచే మొదలవుతుందని, వచ్చే ఏడాది మార్చికల్లా వేలాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 2021 ఏప్రిల్‌ కల్లా బిడ్లను ఖరారు చేస్తామని వివరించారు.


ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం

రైల్వేలు ప్రజలకు జీవనాడి అని, దాన్ని ప్రభుత్వం దూరం చేస్తున్నదని రాహుల్‌గాంఽధీ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘మీరు ప్రజల నుంచి సాధ్యమైనంత లాక్కోండి... అందుకు ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారు’’ అని రాహుల్‌ హెచ్చరించారు. రైల్వే ఆస్తుల ప్రైవేటీకరణను వామపక్షాలు కలిసికట్టుగా ప్రతిఘటిస్తాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. రైల్వే ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న ఎస్సీ, బీసీ వర్గాల కలలు భగ్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేల ప్రైవేటీకరణ దేశ వ్యతిరేక చర్య అని సీఐటీయూ వ్యాఖ్యానించింది. లాక్‌ డౌన్‌ సమయంలో వేలం ఏమిటని నిలదీసింది. డ్రైవర్లు, గార్డులు తప్ప మిగతా ఉద్యోగులంతా ప్రైవేటు నుంచే వస్తారని పేర్కొంది. ఇప్పటికే రోలింగ్‌ స్టాక్‌, సిగ్నలింగ్‌, ఎలెక్ర్టిక్‌, డెడికేటెడ్‌ రవాణా లైన్లలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించారని సిపిఐ(ఎం) పేర్కొంది. అత్యంత విలువైన రైల్వే ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని విమర్శించింది.


కరోనా వల్ల ఆలస్యమైంది

ప్రైవేటీకరణ ప్రక్రియ కరోనా వైరస్‌ వల్ల ఆలస్యమైందని రైల్వే వర్గాలు తెలిపాయి. నిజానికి గత ఏడాది డిసెంబరులోనే బిడ్డింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యాపార రంగంలో అనుభవం ఉన్న 20 సంస్థలు రైల్వేలను నడపడంలో ఆసక్తి ప్రదర్శించాయి. ఆదానీ పోర్ట్స్‌, టాటా రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌, ఎస్సెల్‌ గ్రూప్‌, బొంబార్డియర్‌ ఇండియా, మక్వెరీ గ్రూప్‌ తదితర సంస్థలు ముందుకు వచ్చాయి. కరోనా వల్ల ఈ బిడ్డింగ్‌ ప్రక్రియ ఆగిపోయింది.

Updated Date - 2020-07-03T07:12:39+05:30 IST