వ్యాక్సిన్‌కు ‘ప్రైవేట్‌’ బ్రేక్‌.. పండగపూట తెరుచుకోని టీకా కేంద్రాలు

ABN , First Publish Date - 2021-04-14T05:33:40+05:30 IST

సెలవుదినాల్లోనూ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పని చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బుట్టదాఖలవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో చాలా ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలు సెలవురోజుల్లో మూసి ఉంటున్నాయి.

వ్యాక్సిన్‌కు ‘ప్రైవేట్‌’ బ్రేక్‌..  పండగపూట తెరుచుకోని టీకా కేంద్రాలు

 ఖమ్మం జిల్లాలో 627మందికి వ్యాక్సిన్‌

 ఖమ్మం సంక్షేమవిభాగం/కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 13: సెలవుదినాల్లోనూ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పని చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బుట్టదాఖలవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో చాలా ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాలు సెలవురోజుల్లో మూసి ఉంటున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘టీకా ఉత్సవ్‌’ నీరుగారిపోతోంది. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్‌ సెలవులు, పండగల సెలవులను సైతం రద్దు చేశారు. అంతేకాకుండా 11వ తేదీ నుంచి 14వరకు టీకా ఉత్సవ్‌ ప్రకటించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్‌ వ్యాక్సిన్‌ కేంద్రాలు పనిచేశాయి. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలు 33, ప్రైవేట్‌లో 8 మొత్తం 41వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో మంగళవారం 34వ్యాక్సినేషన్‌ కేంద్రాలు పనిచేశాయి. వీటిలో 33 ప్రభుత్వ కేంద్రాలు కాగా ప్రైవేట్‌లో ఒకే ఒక్క వ్యాక్సినేషన్‌ కేంద్రం తెరిచారు. దీంతో కనీస వ్యాక్సినేషన్‌ లక్ష్యం నెరవేరలేదని విమర్శలు వెలువడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 627మందికే టీకా ఇవ్వటం విమర్శలకు గురిచేసింది. జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్‌ ఆసుపత్రులపై సరైన పర్యవేక్ష ణ చేయకపోవడం వల్లనే టీకా ఉత్సవ్‌ సమయంలోనూ ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు తెరవటం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో 627డోసులు

ఖమ్మం జిల్లాలో మంగళవారం 627డోసుల వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. వీటిలో కొవిన్‌ యాప్‌లో నమోదు చేయించుకున్న 598 మందితో పాటుగా ప్రంట్‌లైన్‌ వర్కర్లు 29మంది, మొత్తం 627మంది వ్యాక్సినేషన్‌ తీసుకున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి జిల్లాలో మంగళవారం 11శాతం మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకొన్నారు. మొత్తం 6475 మందికి వ్యాక్సిన్‌ వేయడమే లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 690మంది మాత్రమే ఆన్‌లైన్‌చేసుకొని టీకా తీసుకొన్నారు.

ఇరుజిల్లాల్లో 285మందికి కొవిడ్‌

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం 285మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌కు వచ్చిన వారికి సైతం ముందు జాగ్రత్తగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా మంగళవారం 1,300 మందికి పరీక్షలు చేయగా వాటిలో 216మందికి పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం మొత్తం 2,276 మందికి పరీక్షలు నిర్వహించగా 69 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించారు. కొత్తగూడెం డివిజన్‌లో 65, భద్రాచలం డివిజన్‌లో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 



Updated Date - 2021-04-14T05:33:40+05:30 IST