ప్రైవేటుకు మద్దిలపాలెం కాంప్లెక్స్‌

ABN , First Publish Date - 2020-10-30T06:08:54+05:30 IST

అత్యంత ఖరీదైన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల భూములను బీవోటీ (బిల్డ్‌...ఆపరేట్‌...ట్రాన్స్‌ఫర్‌) ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులు/సంస్థలకు కట్టబెడుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ప్రైవేటుకు మద్దిలపాలెం కాంప్లెక్స్‌
మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌

బీవోటీ ప్రాతిపదికన 33 ఏళ్లకు లీజు

ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం

ఏపీయూఐఏఎంఎల్‌కు డీపీఆర్‌ తయారీ బాధ్యత

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అత్యంత ఖరీదైన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల భూములను బీవోటీ (బిల్డ్‌...ఆపరేట్‌...ట్రాన్స్‌ఫర్‌) ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులు/సంస్థలకు కట్టబెడుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నగరంలోని మద్దిలపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను బీవోటీ పద్ధతిలో ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్‌గా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్‌ తయారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఏపీయూఐఏఎంఎల్‌)ను తాజాగా ఆదేశాలు జారీచేసింది. 

రాష్ట్రంలోని ఐదింటిని ఇంటిగ్రేటెడ్‌ బస్టాండ్‌లుగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించింది. అందులో మద్దిలపాలెం బస్టాండ్‌ ఒకటి. మద్దిలపాలెం కూడలిలో ఆర్టీసీ(పీటీడీ)కి చెందిన ఆరెకరాల స్థలంలో బస్‌ డిపోతోపాటు కాంప్లెక్స్‌ కూడా ఉంది. నగరం నడిబొడ్డున వున్న ఈ స్థలం అత్యంత విలువైనది. అటువంటిదాన్ని ఇప్పుడు బీవోటీ పేరుతో 33 ఏళ్లపాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

బస్టాండ్‌లో ప్రయాణికులకు వరల్డ్‌ క్లాస్‌ సదుపాయాలతోపాటు, బస్టాండ్‌ ఎలా ఉండాలి, ఫ్లోరింగ్‌ ఎలా ఉండాలి, సమాచార వ్యవస్థకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు, అనౌన్సింగ్‌ సిస్టమ్‌, టిక్కెట్లు జారీచేసే విధానం వంటి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కన్సల్టెన్సీగా బాధ్యతలు దక్కించుకున్న ఏపీయూఐఏఎంఎల్‌ను ఆదేశించింది. అలాగే బస్టాండ్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు నిర్మాణం, వాటికి అయ్యే వ్యయం, బీవోటీ విధానంలో టెండర్లు పిలవాల్సిన విధానం గురించి కూడా డీపీఆర్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నివేదికను జనవరి నాటికల్లా అందజేయాలని కన్సల్టెన్సీగా నియమితులైన సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. డీపీఆర్‌ అనంతరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న సంస్థకు బీవోటీ విధానంలో 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తుంది. అయితే ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులతోపాటు ప్రతిపక్షాలు కూడా విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - 2020-10-30T06:08:54+05:30 IST