దద్దరిల్లిన ‘ఉక్కు’ పోరు

ABN , First Publish Date - 2021-08-04T08:14:40+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా హస్తినలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఆందోళన విజయవంతంగా ముగిసింది. రెండో రోజైన మంగళవారం ఆంధ్రాభవన్‌ ప్రాంగణంలో

దద్దరిల్లిన ‘ఉక్కు’ పోరు

రెండోరోజూ ఆంధ్రాభవన్‌ వద్ద ధర్నా, నిరసనలు 

ఉక్కు జేఏసీ జాతీయ స్థాయి పోరు జయప్రదం 

ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని ప్రమాణం 

బీజేపీయేతర రాజకీయ పక్షాల సంఘీభావం

ప్రధాని మోదీ మెడలు వంచాలంటే 

25 మంది ఎంపీలూ రాజీనామా చేయాల్సిందే 

రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన టీడీపీ 

ప్లాంట్‌ పరిరక్షణకు రాజకీయాలు పక్కనపెట్టాలి


న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు నిరసనగా హస్తినలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఆందోళన విజయవంతంగా ముగిసింది. రెండో రోజైన మంగళవారం ఆంధ్రాభవన్‌ ప్రాంగణంలో చేపట్టిన ధర్నాలో ఆందోళనకారులు ప్లకార్డులు, బ్యానర్లతో చేసిన నిరసనలు, నినాదాలు ఢిల్లీలో దద్దరిల్లాయి. ఉదయం 10.30గంటలకు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ఉక్కు ప్లాంటు జేఏసీ నేతలు ధర్నా ప్రారంభించారు. సాయంత్రం 4గంటల వరకూ అక్కడే ఆందోళన కొనసాగించారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’, ‘ప్రైవేటీకరణ వద్దు- ప్రభుత్వ రంగమే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వామపక్షాలతో పాటు బీజెపీయేతర  పక్షాలన్నీ పాల్గొని ఆందోళనకు సంఘీభావం తెలిపాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని టీడీపీ సభ్యులు ప్రకటించారు.


ఏపీ నుంచి మొత్తం 25మంది లోక్‌సభ సభ్యులూ రాజీనామా చేస్తే తప్ప ప్రధాని దిగిరారని వక్తలు పేర్కొన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకుని తీరాలని ప్రమాణం చేశారు. అఖిలపక్షాలు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలను కలుపుకుని త్వరలో ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు మేధోమథన సదస్సు నిర్వహించి, భవిష్యత్‌ కార్యాచరణను ఖరారు చేస్తామని జేఏసీ నేతలు మంత్రి రాజశేఖర్‌, వరసాల శ్రీనివాసరావు వెల్లడించారు. ఆరోగ్యం సహకరించక, నడవలేని స్థితిలో రైతు నేత వడ్డె శోభనాద్రీశ్వరరావు ఇద్దరు సహాయకులతో వచ్చి ధర్నాలో పాల్గొన్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, వైసీపీ ఎంపీలు,  సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీ, జేన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐసీ గోస్‌ పాల్గొన్నారు. 


సాధ్యమైతే ప్రైవేటీకరణ... కుదరకపోతే మూసివేతే 

ఉక్కుపై రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంలో మరో మాటకు తావులేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు వంటి కర్మాగారాలను సాధ్యమైతే ప్రైవేటీకరిస్తామని, కుదరని పక్షంలో ఆ ప్లాంట్లను శాశ్వతంగా మూసివేస్తామని తేల్చిచెప్పింది. మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.  నిర్ణయాన్ని పున:పరిశీలించాలని ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాశారని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశామని మంత్రి భగవత్‌ వివరించారు.


ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ధర్నా 

రాజమహేంద్రవరం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో అధికంగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం వైస్‌ చైర్మన్‌ ఎల్‌వీ ప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 


గనులు కేటాయించండి :ఎంపీ రామ్మోహన్‌ 

 చైనాకు ఐరన్‌ ఓర్‌ ఎగుమతులు నిలిపివేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మంగళవారం  లోక్‌సభలో కోరారు. పాం్లట్‌ నష్టాల్లో లేదని, అధిక వడ్డీ రేట్లు, సొంత గనులు లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందిపడుతోందని తెలిపారు. 


ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలు 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. అదానీ, అంబానీల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోదీ దోచిపెడుతున్నారు. 

సీతారాం ఏచూరి, సీపీఎం  నేత 


రాజీనామాలకు సిద్ధపడాల్సిందే 

ఏపీకి చెందిన 25మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేస్తేనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రధాని మోదీ వెనక్కి తీసుకుంటారు. ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, సభలు, ప్రసంగాలకు ఆయన బెదరరు. నాటి ఉద్యమ స్ఫూర్తితో ఎంపీలంతా పార్లమెంటును దిగ్బంధించాలి. 

- వి.హనుమంతరావు, కాంగ్రెస్‌ నేత 


రాజీనామాలకు సిద్ధం 

విశాఖ ఉక్కు కోసం ఎంపీ పదవులను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడవసరమైతే అప్పుడు రాజీనామా చేస్తాం. 

-కె.రామ్మోహన్‌నాయుడు, టీడీపీ ఎంపీ 


ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోం 

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. ప్రజల త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన పరిశ్రమను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోం. 

- కేశినేని నాని, టీడీపీ ఎంపీ 


కోర్టుకు వెళ్లి .. స్టే తెచ్చుకుందాం 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్టే తెచ్చుకుందాం. ఒక ఏడాది లేదా ఏడాదిన్నరపాటు ఈ ఉద్యమాన్ని కొనసాగించగలిగితే, తర్వాత ఎన్నికల ప్రకియ మొదలవుతుంది. అప్పుడు స్టీల్‌ ప్లాంటును ఏమీ చేయలేరు. 

 విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ

Updated Date - 2021-08-04T08:14:40+05:30 IST