Jul 31 2021 @ 19:25PM

‘నారప్ప’ నా కోరికలు తీర్చేశాడు: ప్రియమణి

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నార‌ప్ప‌’. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌ వీడియోలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ‘నారప్ప’గా వెంకీ అభినయం అందరినీ మెప్పిస్తోంది. సినిమాకు మంచి సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ హైద‌రాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ప్రియమణి ‘నారప్ప’ నా కోరికలు చాలా వరకు తీర్చేశాడు అని అన్నారు. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్ప‌టినుంచో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌ర్క్ చేయాలి అనుకుంటున్నాను. ఆ కోరిక తీరింది. ఈ అవ‌కాశం ఇచ్చిన సురేష్‌బాబు గారికి, డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్‌ అడ్డాలగారికి థ్యాంక్స్‌. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే నేను ‘పెళ్లైన కొత్తలో’ సినిమా చేసేటప్పుడు రామానాయుడు స్టూడియోస్‌లో షూట్ జరిగింది. అప్పుడు స్టూడియోలో హీరోయిన్ల ఫొటోలను చూశాను. ఇదేంటి హీరోయిన్లు ఫొటోలు పెట్టారు అని అడిగితే.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చేసిన హీరోయిన్ల ఫొటోలను ఇలా పెడతారని చెప్పారు. అప్పటి నుంచి ఆ ఫొటోలలో నా ఫొటో కూడా ఉండాలని అనుకున్నాను. ‘నారప్ప’ రూపంలో ఇప్పుడు నా ఫొటో కూడా అక్కడ చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. వెంకటేష్‌గారితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. కానీ కుదరలేదు. వెంకీసార్ నార‌ప్ప పాత్ర‌లో ఒదిగిపొయారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. కార్తిక్ రత్నం, రాకీ, బుజ్జ‌మ్మ ఇలా అంద‌రూ  చాలా బాగా చేశారు. సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని అన్నారు.