యూపీలో పొత్తులపై ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-01-23T01:25:33+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల అనంతరం బీజేపీ మినహా ఇతర

యూపీలో పొత్తులపై ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల అనంతరం బీజేపీ మినహా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఒకేవిధమైన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తాము పోరాడతామని, ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమైన పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని చెప్పారు. 


సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మధ్య తేడా గమనించారా? అని అడిగినపుడు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ తలుపులు బీజేపీకి మూసేసి ఉన్నాయని, ఇతర పార్టీల కోసం తెరిచి ఉన్నాయని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఒకే తరహా రాజకీయాలు చేస్తున్నాయని, దీనికి కారణం వాటి వల్ల ఆ పార్టీలు ప్రయోజనం పొందడమేనని తెలిపారు. తాము మాత్రం సామాన్యులు లబ్ధి పొందాలంటున్నామని తెలిపారు. అభివృద్ధి సమస్యలను లేవనెత్తాలన్నారు. మతతత్వం, కులతత్వం ప్రాతిపదికపై నడిచే పార్టీలకు ఒకే ఎజెండా ఉంటుందన్నారు. ఆ పార్టీలు పరస్పరం లబ్ధి పొందుతున్నాయన్నారు. 


కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థి ఎవరు? అని ప్రశ్నించినపుడు ఆమె స్పందిస్తూ, తమ ప్రధాన ప్రత్యర్థులు నిరుద్యోగం, ధరల పెరుగుదల, రాష్ట్రంలో పరిస్థితులు, రైతుల పరిస్థితులు అని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయనే విషయం ఇప్పుడే చెప్పడం అపరిపక్వత అవుతుందన్నారు. తాము పరిపూర్ణంగా కట్టుబడి, నిబద్ధతతో పోరాడుతున్నామన్నారు. 2022 ఎన్నికలతో ఈ పోరాటం ముగిసిపోయేది కాదన్నారు. ముఖ్యమైన సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యల కోసం ప్రజలకు మద్దతుగా నిలిచే పార్టీ కాంగ్రెస్ అని ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-01-23T01:25:33+05:30 IST