Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 1 2021 @ 16:24PM

రాహుల్ చేయలేని ఆ పని చేస్తానంటోన్న ప్రియాంక

న్యూఢిల్లీ: ప్రతి ఎన్నికలోనూ మహిళా రిజర్లేషన్లపై చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్ని పార్టీలు తాము అధికారంలోకి వస్తే కొంత మేరకు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇస్తుంటారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక హామీలను బుట్టదాఖలు చేస్తుంటారు. ఇలా ఎన్నిసార్లు జరిగినా మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి మహిళా రిజర్వేషన్ వాగ్దానం తెరపైకి వస్తూనే ఉంటుంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు విద్యా, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అధ్యక్షుడి స్థానంలో రాహుల్ గాంధీ ప్రకటించారు. పార్టీ ఇచ్చే వాగ్దానం బాగానే ఉన్నా.. ఆ సమయంలో కాంగ్రెస్‌పై ఓ తీవ్రమైన విమర్శ వచ్చింది. మహిళలపై అంత పట్టింపు ఉంటే 33 శాతం మహిళలకు పార్టీ టికెట్లు ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చే రిజర్వేషన్ల సంగతి అలా ఉంచితే చేతిలో ఉన్న పార్టీ టికెట్లే మహిళలకు సముచిత స్థానంలో కేటాయించడం లేదని రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.


కాగా, రాహుల్ చేసిన ఈ తప్పిదాన్ని ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సవరిస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని సోమవారం ప్రియాంక ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీ కంటే ఇది 7 శాతం ఎక్కువ. యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 40 శాతం ఉద్యోగాల్లో మహిళలను నియమిస్తామని హామీ ఇస్తూనే పార్టీ తరపున 40 శాతం మహిళలను బరిలోకి దింపుతామని ప్రియాంక ప్రకటించారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్మార్ట్‌ఫోన్, స్కూటీ, బస్సు ప్రయాణం లాంటివి ప్రకటించారు. ఈ మేనిఫెస్టో మహిళలు కేంద్రంగా రూపొందించారనేది ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలకు కోటా ఇస్తామని ప్రియాంక చెప్పడం గమనార్హం. రెండున్నరేళ్ల కింద రాహుల్ తప్పిదాన్ని ప్రియాంక ఇలా సరిదిద్దబోతున్నారంటూ నెటిజెన్లు కొందరు చమత్కరిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement