పెద్దాసుపత్రి క్యాజువాల్టీలో నరకం

ABN , First Publish Date - 2021-01-21T05:55:34+05:30 IST

రాయచూరుకు చెందిన 70 ఏళ్ల బాబు తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నాడు.

పెద్దాసుపత్రి క్యాజువాల్టీలో నరకం
క్యాజువాల్టీ వద్ద బుధవారం బారులుతీరిన రోగులు

  1. అత్యవసర రోగిపట్ల నిర్లక్ష్యం
  2. పెద్దాసుపత్రిలో రోగులకు నరకం


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 20: రాయచూరుకు చెందిన 70 ఏళ్ల బాబు తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నాడు. దీంతో బుధవారం అర్ధరాత్రి 2 గంటలకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగానికి బంధువులు తీసుకువచ్చారు. రోగిని గంటలోపు క్యాజువాల్టీ నుంచి వార్డుకు షిఫ్ట్‌ చేయాలి. కానీ క్యాజువాల్టీ సీఎంవో, వైద్యుల నిర్లక్ష్యంతో అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన రోగిని మధ్యాహ్నం 2 గంటలైనా అక్కడే ఉంచారు. రోగి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వైద్యుల వద్దకు వెళ్లి వైద్యం చేయాలని బంధువులు వేడుకున్నా స్పందించలేదు. పెద్దాసుపత్రి క్యాజువాల్టీలో రోజూ ఇదే పరిస్థితి. అత్యవసర రోగులకు నరకం చూపిస్తున్నారు. క్యాజువాలిటీకి అత్యవసర చికిత్స కోసం రోజు 200 నుంచి 300 మంది రోగులు వస్తుంటారు. రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలవారికి కీలకం పెద్దాసుపత్రి. మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతో వచ్చే రోగుల గురించి క్యాజువాల్టీ విభాగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.


ఎక్స్‌రే కోసం అవస్థలు

రాయచూరుకు చెందిన బాబు బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్స్‌రే కోసం ఇలా స్ర్టెచర్‌పై తిరుగుతూ కనిపించాడు.  సిబ్బంది పట్టించుకోలేదు. 18సీ, 18బీ, 18డీ, 22 కేంద్రాలకు వెళ్లాలని ఒకచోటు నుంచి మరో చోటుకు తిప్పుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి నిరీక్షించినా ఎక్స్‌రే తీయలేదని వాపో యారు. రాయచూరుకు చెందిన బాబు బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్స్‌రే కోసం తిరుగుతూ కనిపించాడు. అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. 18సీ, 18బీ, 18డీ, 22 కేంద్రాలకు వెళ్లాలని ఒకచోటు నుంచి మరో చోటుకు తిప్పుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి నిరీక్షించినా ఎక్స్‌రే తీయలేదని వాపోయారు. 


సూపరింటెండెంట్‌ ఆదేశించినా.. 

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.నరేంద్రనాథ్‌ రెడ్డి క్యాజువా ల్టీని 20 రోజుల అకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర రోగులు క్యాజువాల్టీలో గంటల తరబడి వైద్యం కోసం వేచి ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాజువాల్టీకి వచ్చిన గంటలోపు రోగిని వార్డుకు షిప్ట్‌ చేయాలని వైద్యులను ఆదేశించారు. కానీ సూపరింటెం డెంట్‌ ఆదేశాలు అమలు కావడం లేదు. ఒక గంట కాదు.. 12 గంటలు గడిచినా అక్కడే ఉంచుతున్నారు. 


పని చేయని ఎక్స్‌రే యంత్రాలు

రేడీయాలజీ విభాగంలో పెద్ద ఎక్స్‌రే యంత్రాలు ఎనిమిది నెలలుగా మూలనపడ్డాయి. ఎక్స్‌రే కోసం ఆసుపత్రికి రోజుకు 300 నుంచి 400 మంది రోగులు వస్తుంటారు. వీరికి తగ్గట్టుగా ఎక్స్‌రే యంత్రాలు లేవు. ఆరు పెద్ద ఎక్స్‌రే (500 ఎంఏ) యంత్రాలు చెడిపోయినా మరమ్మతు గురించి పట్టించుకోవడం లేదు. చేసేది ఏమీలేక రేడీయాలజీ వైద్యులు, సిబ్బంది మొబైల్‌ మిషన్‌లతో ఎక్స్‌రేలు తీస్తున్నారు. సీటీ, సీఆర్‌ మిషన్‌, క్యాసెటోలు కూడా పని చేయడం లేదు. 


గంటలోపు షిఫ్ట్‌ చేయాలి..

క్యాజువాల్టీకి వచ్చిన అత్యవసర రోగిని గంటలోపు సంబంధిత వార్డుకు షిఫ్ట్‌ చేయాలి. ఇప్పటికే క్యాజువాల్టీ వైద్యులు, సీఎంవోలకు ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలు అమలయ్యేలా చూస్తాం. రోగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటాం.  - డాక్టర్‌ జి. నరేంద్రనాథ్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌

Updated Date - 2021-01-21T05:55:34+05:30 IST