మత్తు వదలట్లేదా..?

ABN , First Publish Date - 2020-03-31T15:54:57+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దొరకని పరిస్థితిలో మద్యానికి బానిసలుగా మారిన వారికి ఇబ్బందులు ఎదురవడం అత్యంత సహజం. వ్యసనంగా మారిన మద్యం అందుబాటులో లేక అసహనానికి లోనవుతారు.

మత్తు వదలట్లేదా..?

ఆంధ్రజ్యోతి (31-03-2020): లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దొరకని పరిస్థితిలో మద్యానికి బానిసలుగా మారిన వారికి ఇబ్బందులు ఎదురవడం అత్యంత సహజం. వ్యసనంగా మారిన మద్యం అందుబాటులో లేక అసహనానికి లోనవుతారు. ఇలాంటప్పుడు ఎలా వ్యవహరించాలి? వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు!


లాక్‌డౌన్‌ సమయంలో మద్యానికి అలవాటు పడిన వారిలో మైల్డ్‌, మోడరేట్‌, సివియర్‌... ఇలా మూడు రకాల లక్షణాలు కనిపిస్తాయి.


మైల్డ్‌: రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్‌, అసహనం


మోడరేట్‌: తీవ్ర అసహనం, చీకాకు, కోపం, ప్రతి ఒక్కరినీ తిడుతూ ఉండడం


సివియర్‌: ఈ కోవకు చెందినవారికి ‘ఆల్కహాల్‌ విత్‌డ్రాయల్‌ సీజర్స్‌’ వస్తాయి. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు వైద్యులను సంప్రతించాలి. మైల్డ్‌, మోడరేట్‌ దశల్లో కనిపించే లక్షణాలను మందులతో తగ్గించగలిగినా, సివియర్‌ కోవకు చెందిన వ్యక్తులను వైద్యుల దగ్గరకు తప్పక తీసుకువెళ్లాలి.


వారం నుంచి పది రోజులు!

చిరాకు, అసహనం, డిప్రెషన్‌ మొదలైన లక్షణాలు సాధారణంగా వారం నుంచి పది రోజుల పాటు వేధించి, తగ్గిపోతాయి. మందులు వాడకపోయినా ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టమూ కలగదు. అయితే తీవ్రతను బట్టి వైద్యులనూ సంప్రతించవచ్చు. లాక్‌డౌన్‌ కారణంగా కొంతమంది వైద్యులు ఆన్‌లైన్‌ కన్సల్టేషన్స్‌ ద్వారా అందుబాటులో ఉంటున్నారు. వారు సూచించే మందులతో విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ను తగ్గించుకోవచ్చు.


ఇలా మనసు మళ్లించాలి!

యోగా, ధ్యానం వల్ల ఆల్కహాల్‌ విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ అదుపులోకి వస్తాయి. కుటుంబసభ్యులతో కాలక్షేప కార్యకలాపాల్లో పాల్గొనడం, పిల్లలతో ఆటలు ఆడడం, టి.వి చూడడం, మనసును ఉల్లాసంగా ఉంచే పనులు చేయడం ద్వారా కూడా విత్‌డ్రాయల్‌ లక్షణాలను తగ్గించుకోవచ్చు. వ్యాయామంతో ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలై మద్యం నుంచి మనసు మళ్లుతుంది. ఆల్కహాల్‌ ద్వారా పొందే కంఫర్ట్‌ను వ్యాయామంతోనూ భర్తీ చేయవచ్చు. ఫలితంగా మద్యం తాగాలనే ఆలోచనలు రావు.


విత్‌డ్రాయల్‌ సిండ్రోమ్‌ మానడానికి ఇదే అదను!

‘‘కొందరు మద్యానికి బానిసలుగా మారకపోయినా, ఆల్కహాల్‌ తీసుకుంటేనే తాము సమర్థంగా పనిచేయగలం, ఉల్లాసంగా ఉండగలం అనే అపోహలో ఉండిపోతారు. ఈ స్వభావాన్ని ‘ఆల్కహాల్‌ డిపెండెన్స్‌’ అంటారు. ఈ సమస్యకు వాడే  మందులతో మద్యం తాగాలనే ఆలోచనలు కూడా రాకుండా ఉంటాయి. నిజానికి మిగతా వారితో పోలిస్తే, ఈ కోవకు చెందిన వారు ఆల్కహాల్‌ మానేయడం తేలిక. మద్యం దొరకని ఈ సమయంలో, మందులతో వీరి చేత మద్యం శాశ్వతంగా మాన్పించవచ్చు. అందుకు ఇదే అనువైన సమయం.’’


- డాక్టర్‌ సోమశేఖర్‌

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

Updated Date - 2020-03-31T15:54:57+05:30 IST