ముందుగా సమస్యలు పరిష్కరించాలి!

ABN , First Publish Date - 2020-08-12T07:35:49+05:30 IST

భవిష్యత్తులో అందరికీ నాణ్యమైన విద్యను అందించి, మన దేశాన్ని శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి దోహదపడాలనే ఉద్దేశంతో జాతీయ విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది...

ముందుగా సమస్యలు పరిష్కరించాలి!

భవిష్యత్తులో అందరికీ నాణ్యమైన విద్యను అందించి, మన దేశాన్ని శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి దోహదపడాలనే ఉద్దేశంతో జాతీయ విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు గాను కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంది. వీటిని అమలు చేయడానికి ఉన్నత విద్యను బోధించే విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో విరాజిల్లే విశ్వవిద్యాలయాలకు అనేక సమస్యలున్నాయి. ఈ చట్టానికి లోబడి తమ తమ విద్యా ప్రణాళికలు, లక్ష్యాల విషయంలో ఏం చేయాలనేది ఆయా కళాశాలలకే వదిలివేస్తే ఫలితాలు ఎంతవరకు వస్తాయనేది ప్రశ్నార్థకమే. విశ్వవిద్యాలయాలకు సంబంధించి గ్రంథాలయాలు, తరగతి గదులు, హాస్టల్‌ వసతి, బోధన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి పలు ఇబ్బందులున్నాయి. వీటికితోడు యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. దాంతో విద్యార్థుల్లో క్రమశిక్షణా రాహిత్యం, సంకుచిత ప్రయోజనాలు అధికమైపోతున్నాయి.


అధ్యాపకులు కూడా రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను, పరిపాలనలో ముఖ్యమైన వైస్‌ ఛాన్సలర్‌ వంటి ఖాళీలను ప్రభుత్వం తక్షణం భర్తీ చేయాలి. యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఇవ్వాలి. విశ్వవిద్యాలయాలను సామాజిక రంగంగా పరిగణించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. 1964లోనే కొఠారి కమిషన్‌ సూచించిన లక్ష్యాలను ఇన్ని సంవత్సరాలు గాలికి వదిలేసిన ప్రభుత్వాలు ఇప్పుడు మరొకమారు ప్రజల్ని అమాయకుల్ని చేయడానికి కొత్త లక్ష్యాలను ముందుకు తీసుకురావడం విడ్డూరం. అటానమస్‌, ప్రైవేట్‌ విద్య వంటివి ఏ చట్టంలో లేకున్నా వాటిని అమలు చేస్తున్నారు. 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యను ప్రైవేట్‌ స్కూళ్లలో సైతం అమలుచేస్తారా? చేయరా? అనేది నూతన చట్టంలో వివరణ లేకపోవడం శోచనీయం. నూతన విద్యావిధానం వల్ల మేలు జరగాలంటే దాని అమలుకు ముందు ఉండే సమస్యలన్నీ పరిష్కరించాలి.

డాక్టర్‌ పెద్దమళ్ళ శ్రీనివాసరావు, కాకతీయ యూనివర్సిటీ

Updated Date - 2020-08-12T07:35:49+05:30 IST