సమస్యల సదువులు

ABN , First Publish Date - 2022-06-13T06:03:27+05:30 IST

జిల్లాలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను తొలగించడంతో పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందితోనే పరిశుభ్ర పనులు చేపడుతున్నా అవి పూర్తిస్థాయిలో ఎక్కడా కొనసాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

సమస్యల సదువులు
ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల పరిస్థితి

- నేటి నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు

- పలు పాఠశాలల్లో నీరు, సౌకర్యాల కొరత

- తాగేందుకు, ఇతర అవసరాలకు నీరు కూడా లేని వైనం

- వానొస్తే పలు పాఠశాలలోని విద్యార్థులకు ఇబ్బందులే..

- ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు నిబంధనల బేఖాతారు


కామారెడ్డి టౌన్‌, జూన్‌ 12: జిల్లాలో సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను తొలగించడంతో పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బందితోనే పరిశుభ్ర పనులు చేపడుతున్నా అవి పూర్తిస్థాయిలో ఎక్కడా కొనసాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయా పాఠశాలలు శిథిలావస్థకు చేరినా అందులోనే పాఠాలు కొనసాగుతుండడంతో పాటు సౌకర్యాల లేమీతో పాఠశాలలు కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలలను గుర్తించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పనులు మొదలు కాకపోవడంతో ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడక తప్పదనే అభిప్రాయాలు విద్యార్థిసంఘ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.  పలు పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్‌ లేక ఇంటికి లేదంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో తాగేందుకు, ఇతర అవసరాలకు నీరు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానోస్తే గత సంవత్సరం పలు పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు లేకపోలేదు. ఇక ప్రైవేట్‌ పాఠశాలల పరిస్థితి అలానే ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు లాగుతూ కనీస అర్హతలేని వారితో బోధించడమే కాకుండా కొన్ని తరగతుల వరకే అనుమతులు తీసుకుని పై తరగతుల వరకు పాఠశాలలను కొనసాగిస్తున్నారని సమాచారం.

తాగు నీరు, సౌకర్యాల కొరత

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి డివిజన్‌ల పరిధిలోని పలు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం లేక అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు, సిబ్బంది గత ఏడాది నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఇంటి నుంచే నీటిని తీసుకొని వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలల్లో అయితే సరైన మరుగుదొడ్లు లేకపోవడంతో ఒంటికి, రెంటికి విద్యార్థులు ఇంటికి లేదంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. పలు పాఠశాలలో విద్యుత్‌ సమస్య సైతం ఉండడంతో పాటు ఆకతాయిలు వేసవి సెలువుల్లో చేసిన వీరంగానికి బెంచీలు, తలుపులు విరిగిపోయి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మండలాల్లో పరిసరాలను వస్తువులను పాడు చేసి విద్యార్థులకు అసౌకర్యాలు కల్గించేలా చేశారు.

స్కావెంజర్లు లేక పాఠశాలల్లో అపరిశుభ్రత

అసలే వర్షాకాలం. సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచడానికి గతంలో నియమించిన పారిశుధ్య సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. ఈ బాధ్యతను గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌కు అప్పగించింది. శానిటేషన్‌ పనులు చేయడంలో మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు వార్డులలో పనులు చేస్తూ ఇటు పాఠశాలలను శుభ్రం చేయాలంటే తమ వల్ల కావడం లేదని అంటున్నారు. పాఠశాలల్లోని తరగతి గదులను శుభ్రపరచడం నుంచి మొదలు పాఠశాల ఆవ రణను మొత్తం శుభ్రం చేయలేక అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయా పాఠశాలల్లో చెట్లపొదలు, అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు కొనసాగుతుండడంతో పనులు సాగుతున్నా అవి మూన్నాళ్ల ముచ్చటగానే ఉండనున్నాయి. దీంతో విద్యార్థులకు సీజనల్‌, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం పునరాలోచించి ప్రతీ పాఠశాలకు అటెండర్‌, స్వీపర్‌, స్కావెంజర్‌ను నియమించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉపాధ్యాయులు వేళకు పాఠశాలకు వచ్చేనా?

పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు వేళకు పాఠశాలలకు రాక విద్యార్థులకు నానా ఇబ్బందులు తలెత్తడంతో పాటు విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలకు లేటుగా రావడం, ఈ మధ్యకాలంలో సంఘాల పేరుతో, సమావేశాల పేరుతో పాఠశాలల ముఖం సైతం చూడని ఉపాధ్యాయులు ఎందరో తయారయ్యారు. వారంతా పాఠశాలలకు చుట్టం చూపులా వస్తూ విద్యార్థులకు బోధన మాత్రం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. నూటికి ఆరవై శాతం మంది రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారం, ఇతర వ్యాపకాలను పెట్టుకుంటూ విద్యార్థులకు మాత్రం విద్యను అందించడం లేదని తెలుస్తోంది. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ జీతాలను మాత్రం నెలనెలకు తీసుకుంటున్నారే తప్ప తమ విధులను మాత్రం చేయడం లేదు. కొందరు ఉన్నతాధికారులతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నా చర్యలు మాత్రం కరువయ్యాయని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లడమే కాకుండా విద్యార్థుకు నాణ్యమైన విద్యను అందించేవిధంగా చూడాలని కోరుతున్నారు.

ప్రైవేట్‌ పాఠశాలలో నిబంధనల భేఖాతారు

ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలు భేఖాతారు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో గతేడాది ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడంతో చాలా వరకు బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించలేదు.  ఈ వాహనాలు ప్రస్తుతం రోడ్డు మీదకు రావాలంటే చిన్నపాటి మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. వాటికే ఒక్కో వాహనానికి కనీసం రూ.50వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండడంతో చిన్నపాటి ఆటోలు, వ్యాన్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా వరకు గుర్తింపు లేని పాఠశాలలు, అనుమతి ఒక్కలా ఉంటే మరోలా పాఠశాలలు కొనసాగిస్తున్నవి కుప్పలు తెప్పలుగా ఉన్నాయని, అర్హతలేని ఉపాధ్యాయులతో బోధిస్తూ కేవలం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న పాఠశాలలపై చర్యలు కరువయ్యాయని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-06-13T06:03:27+05:30 IST