అన్నదాతకు ‘వరి’గోస

ABN , First Publish Date - 2020-05-12T10:08:42+05:30 IST

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజులుగా పంట కొనుగోళ్లు సాగుతున్నా ఇప్పటివరకు సగం మేరకు

అన్నదాతకు ‘వరి’గోస

కొనుగోళ్లలో జాప్యంతో ఇబ్బందులు

క్వింటాల్‌కు అదనంగా 4 కిలోల తూకం

ఇప్పటికీ సగం మేరకు కూడా జరుగని కొనుగోళ్లు

అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన


ఆంధ్రజ్యోతి, జగిత్యాల:  జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజులుగా పంట కొనుగోళ్లు సాగుతున్నా ఇప్పటివరకు సగం మేరకు కూడా పూర్తి కాలేదు. జిల్లాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పేరుకు 390 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు, నాయకులు పదే పదే చెబుతున్నా కొనుగోళ్లలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది.


వారం, పది రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఇప్పటికే మూడుసార్లు జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో రైతులకు నష్టం జరిగింది. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించడంలో కూడా జాప్యం జరుగుతోంది. అకాల వర్షంతో పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


ధాన్యం తరలింపునకు అదనంగా డబ్బుల వసూలు

జగిత్యాల జిల్లాలో ఇప్పటికే తాలు, తప్ప పేరిట రైస్‌ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతుండగా, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యం సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లర్లు తరలించేందుకు జగిత్యాల జిల్లాను ఐదు సెక్టార్లుగా విభజించారు. టెండర్‌ దక్కించుకున్నవారు కొనుగోలు చేసిన ధాన్యం రైస్‌మిల్లులకు తరలించాల్సి ఉండగా, రెండు, మూడు రోజులుగా ధాన్యం తరలించేందుకు లారీల యాజమానులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో బస్తాకు రూ.2 నుంచి రూ.3 వసూలు చేస్తుండటంతో రైతులు ససేమిరా అంటుండగా, మరికొన్ని చోట్ల గత్యంతరం లేక డబ్బులు చెల్లిస్తున్నారు.


వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడిస్తే తమకెక్కడ ఇబ్బంది పడుతుందోననే ఆలోచనతో రైతుల అవసరం దృష్టిలో ఉంచుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా, అధికారులు రెండు లారీలను సీజ్‌ చేశారు. లారీ యాజమానులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇది ఇలా ఉంటే తుర్పారా బట్టి అమ్మకానికి తెచ్చినా క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోలు అదనంగా తూకం వేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2020-05-12T10:08:42+05:30 IST