ఇసుక కొరతతో ఇబ్బందులు..

ABN , First Publish Date - 2020-10-17T06:39:17+05:30 IST

ఇసుక కొరత నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా లేకపోవడంతో పెద్దపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల

ఇసుక కొరతతో ఇబ్బందులు..

రవాణా లేక నిలిచిన ఇళ్ల నిర్మాణాలు

ఉపాధి కోల్పోతున్న కార్మికులు

భారంగా మారిన కుటుంబ పోషణ


పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 16: ఇసుక కొరత నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రవాణా లేకపోవడంతో పెద్దపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఇళ్లు, తదితర అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వివిధ దశల్లో నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో ఆయారంగంపై ఆధారపడ్డ వారి కుటుంబాలు ఉపాధిని కోల్పోతున్నాయి. ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన యజమానులు ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మానేరు గేట్లు ఎత్తివేయడం వల్ల వాగు ఇరువైపులా హద్దులు దాటి ప్రవహిస్తోంది. దీంతో రీచ్‌ల నుంచి ఇసుక తీయలేని పరిస్థితి నెలకొంది.


నిలిచిన ఇసుక బుకింగ్‌

పెద్దపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సుల్తానాబద్‌ మండలం గట్టెపల్లి, నీరుకుల్ల, మిర్జంపేట, కదంభాపూర్‌, తొగర్రాయి తదితర ప్రాంతాల వాగు ఒడ్డు రీచ్‌ల నుంచి సాండ్‌ ట్యాక్సి ద్వారా ఇసుక రవాణ జరుగుతుంది. బుకింగ్‌ చేసుకున్న వారం రోజుల్లో ఇంటికి ఇసుక వచ్చేది. దూరాన్ని బట్టి ట్రాక్టర్‌ ఇసుక ట్రిప్పు ధర నిర్ణయిస్తారు. అయితే కురుస్తున్న వర్షాలతో మానేరు డ్యాం గేట్లు ఎత్తివేయడంతో రెండు నెలలుగా వాగు పొంగిపొర్లుతుండడంతో జిల్లా అధికారులు ఇసుక బుకింగ్‌ నిలిపివేశారు. అయితే కాళేశ్వరం, అన్నారం తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. పట్టణంలో సుమారు ఐదారువందల ఇండ్లు వివిధ దశల్లో ఇసుక కొరతతో నిలిచిపోయాయి.


దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు, డ్రైవర్లు, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. అప్పులు తెచ్చి తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ నాలుగు నెలలు వివిధ కారణాలతో సుమారు 4 నెలల పాటు ఇసుక బుకింగ్‌ ఆపివేశారు. తిరిగి ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే వర్షాల ప్రభావంతో మళ్లీ బుకింగ్‌ నిలిపివేశారు. ఇప్పటికే వేలాది ట్రిప్పులు బుకింగ్‌లో ఉన్నాయి. వారికి ఇసుక రవాణా జరిగాకే కొత్తగా బుకింగ్‌ మొదులుపెడుతామని అధికారులు పేర్కొంటున్నారు. 


బ్లాక్‌ మార్కెట్లో ఇసుక

సాండ్‌ ట్యాక్సీ ద్వారా పెద్దపల్లికి ఒక్క ట్రిప్పు ఇసుకకు 2,550 రూపాయల చొప్పున ఇంటికి సరఫరా చేశారు. అయితే ఇప్పుడు ఇసుక రవాణా లేకపోవడం వల్ల కొందరు ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. కాళేశ్వరం, అన్నారం, తదితర ప్రాంతాల నుంచి పెద్ద లారీల్లో ఇసుక తీసుకువచ్చి ఒక్క టిప్పు ట్రాక్టర్‌ ఇసుకకు రూ.6,500 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. 


ఇసుక బంద్‌ చేయడంతో ఇబ్బందులు.. వానరాసి ఉపేందర్‌, ఇంటి యజమాని

గత ఏడాది భూమిపూజ చేసి ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టాను. కొద్ది రోజులకే ఇసుక బుకింగ్‌ బంద్‌ చేశారు. రెండు, మూడు నెలలు ఆగి మళ్లీ బుకింగ్‌ తెరిచారు. కొద్ది రోజులకే వానలకు మళ్లీ బుకింగ్‌ మూసివేశారు. ఎక్కువ స్టాక్‌ పోసుకుందామంటే సరిపడా స్థలం లేదు. ఇసుక బంద్‌ చేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. 

Updated Date - 2020-10-17T06:39:17+05:30 IST