Abn logo
May 16 2020 @ 17:31PM

హీరోగా దానయ్య కొడుకు.. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్!

టాలీవుడ్ మెగా పవ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్‌ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల పాత్రల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తుండగా.. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముప్పావు భాగం పూర్తి చేసుకొని చివరి దశకు చేరుకుంది. అయితే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌తో సినిమా యూనిట్ సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.


ఇదిలా ఉంటే.. చాలాకాలంగా డీవీవీ దానయ్య తన సుపుత్రుడు క‌ల్యాణ్ దాస‌రిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం స‌రైన ద‌ర్శకుడు, స్టోరీని సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. అది సెట్ కాకనే ఇంకా క‌ల్యాణ్ అరంగేట్రం వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. అయితే తాజాగా దాన‌య్య ద‌ర్శకుడు శ్రీ‌వాస్‌ చేతిలో తన కుమారుడిని పెట్టేందుకు డిసైడ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికే శ్రీవాస్ స్క్రిప్ట్‌ని కూడా రెడీ చేసి ఉంచుకున్నారని టాక్.


లాక్‌డౌన్ త‌ర్వాత ప్రభుత్వ అనుమ‌తుల‌న్నీ చూసుకొని ఈ సినిమా ప‌ట్టాలెక్కించాల‌నే ఆలోచ‌న‌లో దాన‌య్య ఉన్నట్లు సమాచారం. అలాగే.. శ్రీ‌వాస్ నుంచి కూడా సినిమా వ‌చ్చి సుమారు రెండేళ్లైంది. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో శ్రీ‌వాస్ చేసిన ‘సాక్ష్యం’ తర్వాత మరే సినిమా పట్టాలెక్కించలేదు. నిజంగా డీవీవీ కుమారుడి అరంగేట్రాన్ని శ్రీవాస్ చేతికి అప్పగిస్తే అది అటు కుమారుడికి ఇటు డైరెక్టర్‌కి పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు మరి.

Advertisement
Advertisement
Advertisement