మత సామరస్య సేతువుల నిర్మాత

ABN , First Publish Date - 2022-01-22T06:05:31+05:30 IST

భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి మహోజ్వల చరిత్ర ఉంది. స్వరాజ్యం కోసం సుదీర్ఘకాలం కొనసాగిన పోరాటంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు...

మత సామరస్య సేతువుల నిర్మాత

భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి మహోజ్వల చరిత్ర ఉంది. స్వరాజ్యం కోసం సుదీర్ఘకాలం కొనసాగిన పోరాటంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన యోధులున్నారు. చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ వీరులున్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని చెప్పవచ్చు. ఈ మహోద్యమంలో ముస్లిం యోధుల సంఖ్య కూడా ఎంతో పెద్దది. దురదృష్టవశాత్తు దేశవిభజన భారత ముస్లింల పాలిట శాపంగా మారింది. తదనంతర పరిణామాల మూలంగా, చరిత్రలో ముస్లింల పాత్రను కొందరు చరిత్రకారులు విస్మరిస్తూ వచ్చారు.


భిన్న మతాలు, విభిన్న కులాలు కలిగిన విశాల భారతదేశంలోని ప్రజల మధ్య పూదండలో దారంలా ఒక సామరస్య, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడానికి అవసరమైన విశేషాలన్నీ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఉన్నాయి. దాన్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగానే నేడు దేశాన్ని, దేశభక్తిని ఒక వర్గం సొంతం చేసుకోడానికి కారణమయింది. ఇలాంటి దురదృష్టకర పరిణామాల్ని 23ఏళ్ల ముందుగానే ఊహించిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ‘‘భారత స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర’’ గురించి శోధించి, పరిశోధించి చరిత్ర రచన చేయడం మొదలెట్టారు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రను ససాక్ష్యాలతో సమగ్రంగా భావితరాల ముందు ఆవిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఎంతో ఓపికతో ఎందరో ముస్లిం సమరయోధుల త్యాగాలను ఆయన రికార్డ్‌ చేస్తున్నారు. ఆ కృషి వేలాది పేజీలుగా.. పదుల పుస్తకాలుగా మన ముందు ఉన్నది. ఇవాళ స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల పాత్ర అనగానే నశీర్‌ అహమ్మద్‌ పేరు గుర్తొచ్చేలా ఆయన కృషి కొనసాగింది. ముస్లిం సమాజానికి తానేమి చేయగలడో దానిని చేస్తూవెళ్తున్న గొప్ప స్థితప్రజ్ఞుడు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌.


గత 75 ఏళ్లుగా మనం చదువుతున్న చరిత్రంతా సమగ్రంగా లేదనే చెప్పాలి. అసత్యాలు అర్ధసత్యాలతో కూడిన చరిత్రను చదువుకున్న తరాల మనసు లోతుల్లో దేశ స్వాతంత్ర్య పోరాటం పట్ల అనేక అపోహలు... అనుమానాలు ఏర్పడ్డాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఆ అపోహల మబ్బుతెరలు వీడలేదు. దేశ విభజన నాటి గాయాలు ఇంకా పచ్చి వాసనవేస్తున్నాయి. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించని కొన్ని మతోన్మాద వర్గాలు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన ముస్లిం సమాజపు దేశభక్తిని ప్రశ్నార్థకం చేస్తూ మొత్తం చరిత్రను వక్రీకరిస్తున్నాయి. మైనారిటీ వర్గాలను అభద్రతలోకి నెట్టి విద్వేష రాజకీయాలతో దేశ ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి విషాదకర పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ చరిత్రను ససాక్ష్యాలతో సహా సేకరించి ప్రజల ముందు ఆవిష్కరిస్తున్నారు నశీర్‌ అహమ్మద్‌. ప్రజల మధ్య సామరస్యాన్ని, సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు, మరింత బలోపేతం చేసేందుకు గత రెండు దశాబ్దాలకు పైగా నిరంతర కృషి చేస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రను రాయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక తపస్సు. వందల ఏళ్ల నాటి ఘటనలను శోధించాలి, పరిశోధించాలి, నిజానిజాలను ధృవపరచుకునేందుకు ఎన్నో డాక్యుమెంట్లను పరిశీలించాలి. పర్యటనలు జరపాలి. ఇందుకోసం అహోరాత్రులు శ్రమించాలి. అహర్నిశలు దీక్షతో పనిచేయాలి. ఆనాడు జరిగిన సంఘటనల తాలూకు దృశ్యాలను కళ్ళముందు కదలాడేలా గ్రంథస్థం చేయాలి. రాసిన పుస్తకాలను అల్మరాలో దాచి పెట్టుకోకుండా అన్ని వర్గాల ప్రజల వద్దకు చేరవేసినప్పుడే ఆ రచనల ఫలితం ఉంటుంది. అదొక యుద్ధం. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక రచయితగా, చరిత్రకారుడిగా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ యుద్ధభూమిలో పోరాడుతున్న సైనికుడిలా అక్షర సమరం చేస్తున్నారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రకు సమగ్ర రూపం కల్పించడమే కాదు. దాన్ని వివిధ మార్గాల ద్వారా ప్రజల వద్దకు చేరుస్తూ లక్షలాదిమందితో ఆయన మమేకమౌతున్నారు. సంకుచిత శక్తులు ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. హిందూ–ముస్లిం సోదరుల మధ్య అపోహల్ని తొలగించి సామరస్య సేతువుల్ని నిర్మిస్తున్నారు. 1998లో ప్రారంభించిన ముస్లిం స్వాతంత్య పోరాటయోధుల చరిత్ర రచనను వివిధ కోణాల నుంచి విపులంగా వివరిస్తూ ఇప్పటివరకు 21 పుస్తకాలను సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించారు. ఆయన రాసిన పుస్తకాలలో కొన్ని పలుమార్లు పునర్ముద్రణ కావడం విశేషం. నశీర్‌ రచించిన చరిత్ర పుస్తకాలు తమిళం, కన్నడం, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాషలలోకి అనువాదమయ్యాయి.


నశీర్‌ అహమ్మద్‌ రచయిత మాత్రమే కాదు మంచి వక్త కూడా. వివిధ దేశాల్లో ఆయన వేలాది ప్రసంగాలు చేశారు. దేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన ముస్లిం పోరాటయోధుల గురించి ప్రస్తావిస్తూ నశీర్‌ ప్రసంగిస్తుంటే అక్కడి స్థానికులు అమితాశ్చర్యానికి లోనవుతారు. పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన నశీర్‌ అహమ్మద్‌కు సంగ్రహణ శక్తి ఎక్కువ. విషయ పరిజ్ఞానం కోసం దూరభారాన్ని సైతం లెక్కచేయని ఆయన, సమాచార సేకరణ కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎందరినో కలిశారు. మరెంతో మందితో చర్చించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోని ముఖ్యఘట్టాల గురించి ఎంతో లోతుగా అధ్యయనం చేసిన ఆయన మంచినీళ్ళు తాగినంత సులువుగా ఆ పోరాట చరిత్రను వల్లెవేస్తుంటారు. నశీర్‌తో మాట్లాడడమంటే ఒక చరిత్ర పుస్తకాన్ని చదివినట్లే అనిపిస్తుంది. కేవలం స్వాతంత్ర్య పోరాటయోధుల గురించే కాకుండా మాతా సావిత్రీబాయి సహచర ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌ గురించి ‘ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌’ చరిత్రను గ్రంథస్థం చేయడం నశీర్‌ పట్టుదల, కృషికి నిదర్శనం. ఎక్కడో అరకొరగా ప్రస్తావితమయిన ఆ మహనీయురాలి జీవిత విశేషాలను సేకరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఎంతైనా అభినందనీయం. గూగుల్‌ ఇటీవల ఫాతిమా షేక్‌ పుస్తకాన్ని ప్రస్తావించడమే కాకుండా తన డూడుల్‌ మీద ఆమె చిత్రాన్ని ప్రచురించడం గమనార్హం. ఇది నశీర్‌ కృషి ఫలితం అని చెప్పొచ్చు. నశీర్‌ అహమ్మద్‌ వెలువరించిన విలువైన పుస్తకాలు ముస్లిం వ్యతిరేక ప్రచారాలలోని నిజానిజాల నిగ్గుతేలుస్తున్నాయి. ముస్లిమేతర సమాజాన్ని ముస్లింల పట్ల సెన్సిటైజ్‌ చేస్తున్నాయి.


1955 డిసెంబర్‌ 22న నెల్లూరు జిల్లా పరిని గ్రామంలో జన్మించిన సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌కు ప్రస్తుతం 67 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నశీర్‌ అహ్మద్‌ నిరంతర కృషిని గౌరవిస్తూ డాక్టర్‌ ఉమర్‌ అలీ షా సాహితీ సమితి 2022 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది. తొలితరం సాహిత్యకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్‌ ఉమర్‌ అలీషా జాతీయ పురస్కారం నశీర్‌ అహమ్మద్‌ అందుకోనుండడం ఎంతైనా ముదావహం!

సాబిర్‌ హుసేన్‌

జర్నలిస్ట్‌, కవి, రచయిత

(రేపు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌కు డాక్టర్‌ ఉమర్‌ అలీషా జాతీయ పురస్కార ప్రదానం)

Updated Date - 2022-01-22T06:05:31+05:30 IST