Sep 17 2021 @ 20:52PM

ఓటీటీల వైపు నిర్మాతల మొగ్గు.. బోసిపోతున్న థియేటర్లు

కోలీవుడ్: కరోనా వైరస్‌ మహమ్మారి చిత్ర పరిశ్రమను కోలుకోని విధంగా దెబ్బతీసింది. నిర్మాణం పూర్తి చేసుకున్న అనేక చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. అనేక ఆంక్షల మధ్య థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. వినాయకచవితి పండుగ మొదలు కొత్త చిత్రాలు వరుసగా విడుదలవుతున్నాయి. అయినప్పటికీ సినిమా హాళ్ళ వద్ద ప్రేక్షకుల సందడి కనిపించడం లేదు. దీంతో అనేకమంది నిర్మాతలు ఓటీటీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఓటీటీలో విడుదలయ్యే అన్ని చిత్రాలు హిట్‌ కాకపోయినప్పటికీ.. నిర్మాతలు మాత్రం ఓటీటీలను సేఫ్‌ జోన్‌గా భావిస్తున్నారు. అందుకే తమ చిత్రాలను కనీస లాభంతో ఓటీటీలకు విక్రయిస్తున్నారు. 


వాస్తవానికి థియేటర్లలో వరుసగా చిత్రాలు విడుదలైతే ప్రేక్షకులు కూడా వస్తారని, చిత్రాల కలెక్షన్లు కూడా పెరుగుతాయని థియేటర్‌ యజమానులు భావిస్తున్నారు. కానీ, అలా జరగడం లేదు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రతి వారం ఓటీటీలో అధిక చిత్రాలు విడుదల కావడం థియేటర్‌ యజమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. గత వారం సంతానం నటించిన ‘డిక్కీలూనా’, విజయ్‌ సేతుపతి నటించిన ‘తుగ్లక్‌ దర్బార్‌’ చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యాయి. ఈ శుక్రవారం ‘అనబెల్‌ సేతుపతి’ స్ట్రీమింగ్‌ అయింది. వచ్చే శుక్రవారం ‘రామన్‌ ఆండాలుం రావణన్‌ ఆండాలుం’ చిత్రాల్ని ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నారు. ఇలా ప్రతి వారం వరుసగా ఓటీటీలో కొత్త చిత్రాలను విడుదల చేయడాన్ని థియేటర్‌ యజమానులు తప్పుబడుతున్నారు.