May 11 2021 @ 16:22PM

ఓ టీ టీ అంటే ఎందుకు వెనకడుగు?

కరోనా ఉదృతి మొదటి వేవ్‌ కన్నా భయంకరంగా మారింది. రోజురోజుకీ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలులో ఉంది. థియేటర్లు, షూటింగ్‌లు మూతపడ్డాయి. కరోనా ఉదృతి ఇలాగే ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి మరికొన్ని నెలలు తాళాలు వేయాల్సిందే. 

ఈ తరుణంలో షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల తేదీలు ప్రకటించిన ‘టక్‌ జగదీష్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘అఖండ’, లవ్‌స్టోరీ చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. పరిస్థితులు చక్కబడితే తప్ప ఈ బొమ్మలు తెరపై పడే పరిస్థితి కనిపించడం లేదు. దీని వల్ల నిర్మాతలకు వడ్డీల రూపంలో భారం తప్పదు. అయితే థియేటర్లకు బదులుగా ఓటీటీ మాధ్యమం అందుబాటులో ఉండి మంచి ఆఫర్స్‌ చేస్తున్నా నిర్మాతలు ఓటీటీలో విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే  థియేటర్‌లో విడుదలైన సినిమాకు వచ్చే రీచ్‌, కలెక్షన్లు వేరుగా ఉంటాయి. 


ప్రస్తుతం విడుదలకు సిద్ధమై వాయిదా పడిన సినిమాలన్నీ పెద్ద బడ్జెట్‌ చిత్రాలే. ఆయా చిత్రాల నిర్మాతలు ఓటీటీ నుంచి ఎక్కువ ధర ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారట. ఓటీటీ మాధ్యమాలు నిర్మాతల డిమాండ్‌కు ఏమాత్రం దగ్గర్లో లేరని, ఓటీటీ సంస్థలు హీరో మార్కెట్‌కు తగ్గట్లే ఆఫర్‌ చేసినా, సినిమా డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌కు ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్‌ చూపించడం లేదని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్‌ చిత్రాలు కాస్త తక్కువ ధరే ఇస్తుందని వినికిడి. అలాగని ఓటీటీలో విడుదలైన సినిమాలకు ప్రేక్షకాదరణ లేదని కాదు. ఇటీవల విడుదలైన చాలా చిన్న చిత్రాలు ఓటీటీలో సక్సెస్‌ సాధించాయి. 


గతేడాది నాని నటించిన ‘వి’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ‘టక్‌ జగదీష్‌’ను విడుదల చేయడానికి వెనకాడుతున్నారు. చేతిలో ‘ఆహా’ ఓటీటీ ఉన్నప్పటికీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ సినిమా విడుదల చేయడానికి అల్లు అరవింద్‌ కూడా ముందడుగు వేయడం లేదు. ‘నారప్ప, ‘అఖండ’, ‘లవ్‌స్టోరీ’, ‘ఖిలాడీ’, ‘విరాటపర్వం’, ‘నూటొక్క జిల్లాల్లో అందగాడు’, ‘పాగల్‌’ చిత్రాలను ఓటీటీ మాధ్యమంలో విడుదల చేయొచ్చు కానీ నిర్మాతలకు గిట్టుబాటు ధర రావడం లేదని, ఓటీటీ అయితే హీరో స్టార్‌డమ్‌కు తగ్గ రీచ్‌ ఉండదని భావిస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లు ఓపెన్‌ అయ్యేవరకూ చూడాల్సిందే! 


ఆ అనుభూతి రాదు...

‘‘సినిమా అనేది ప్రేక్షకుడికి ఓ వినోదం. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను పెద్ద తెరపై చూస్తేనే తృప్తి ఉంటుంది. టీవీల్లోనో, హోం థియేటర్‌లోనో చూస్తే సౌండ్‌ ఎఫెక్స్‌, విజువల్స్‌ గొప్పతనం తెలీదని లేట్‌ అయినా థియేటర్‌లోనే సినిమా విడుదల చేస్తామని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. 

వెండితెరపై పడాల్సిందే! 

‘‘అభిమాన నటుడి సినిమా తెరపై పడగానే ప్రేక్షకుడికి పూనకం వస్తుంది. ఆ ఫీల్‌ ఓటీటీ మధ్యమంలో ఎలా వస్తుంది? సినిమా సౌండింగ్‌కి, విజువల్స్‌కి ఆస్కార్లు వస్తున్నాయి. అలాంటి ఎఫెక్ట్స్‌ కావాలంటే బొమ్మ వెండితెరపై పడాల్సిందే! టెక్నాలజీ ఎంత పెరిగినా థియేటర్‌లో చూసిన అనుభూతి మరే మాధ్యమంలోనూ కలగదు’’ అని వై. రవిశంకర్‌ అన్నారు.