Abn logo
Apr 8 2021 @ 21:09PM

‘అరణ్య’లా చేస్తారా? లేక ‘తలైవి’ని ఆపేస్తారా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రను పోషించగా, ఎంజీఆర్‌ పాత్రలో హీరో అరవింద్‌ స్వామి నటించారు. ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. ప్రతిరోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సినిమా థియేటర్లను పూర్తిగా మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అలాగే, రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దీంతో బాలీవుడ్‌లో అనేక చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు. ఇపుడు తలైవి చిత్రాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసే పరిస్థితి లేదు. ఈ కారణంగా తలైవి చిత్ర విడుదలను వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

ఒకవేళ.. హిందీ విడుదలను వాయిదా వేసి.. తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేసే అంశాన్ని నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి నటించిన కాడన్‌ చిత్రం కూడా హిందీ వెర్షన్‌లో విడుదల చేయలేదు. కేవలం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదల చేశారు. ఇపుడు ఇదే పరిస్థితి తలైవి చిత్రానికి కూడా నెలకొంది. మరి చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌, విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, గోథిక్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, స్పిరిట్‌ ఫిలిమ్స్‌లు కలిసి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement