కొత్త సాంకేతికతల సవాళ్లు

ABN , First Publish Date - 2021-01-05T06:00:53+05:30 IST

ఒక పెద్ద కంపెనీ ఉత్పత్తి చేసే వస్త్రం మీటరు రూ.200కి లభిస్తే చిన్న కంపెనీ ఉత్పత్తిచేసే అదే వస్త్రం ధర విధిగా రూ.250 ఉంటుంది. ఫలితంగా భారతీయ వినియోగదారులు అదనంగా రూ.50 వెచ్చించవలసి ఉంటుంది....

కొత్త సాంకేతికతల సవాళ్లు

ఒక పెద్ద కంపెనీ ఉత్పత్తి చేసే వస్త్రం మీటరు రూ.200కి లభిస్తే చిన్న కంపెనీ ఉత్పత్తిచేసే అదే వస్త్రం ధర విధిగా రూ.250 ఉంటుంది. ఫలితంగా భారతీయ వినియోగదారులు అదనంగా రూ.50 వెచ్చించవలసి ఉంటుంది. ఈ వ్యయాన్ని ‘ఉద్యోగితా పన్ను’గా మనం పరిగణించాలి. ఉద్యోగాలతో పాటు ఖరీదైన దేశీయ ఉత్పత్తులు కావాలా లేక ఉద్యోగాలు లేకుండా చౌక విదేశీ సరుకులు కావాలో భారతీయ వినియోగదారులు నిర్ణయించుకోవలసి ఉంది.


ఇరవై ఒకటో శతాబ్ది మూడో దశాబ్దంలోకి ప్రవేశించాం. నిత్య నూతనంగా ప్రభవిస్తున్న సాంకేతికతలను ఎలా నిర్వహించుకోవాలన్నది ఈ దశకంలో మన ముందున్న ఒక అతి పెద్ద సవాల్. ఇటీవల మనదేశంలో డ్రైవర్ అవసరం లేని మెట్రోరైలు ఒకటి ప్రారంభమయింది. మంచిదే. అయితే 2035 సంవత్సరం నాటికి 50 శాతం ఉద్యోగాలను రోబోలు హరించివేయడం ఖాయమని ప్రొఫెసర్ మేథ్యూడి జాన్సన్ (కెనడా) ఘంటాపథంగా చెబుతున్నారు. మరి 2050 నాటికి ఉద్యోగాల విపణి మరింత ఘోరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. సరైన వ్యవస్థీకృత సంస్కరణలు చేపడితే 2050 సంవత్సరం నాటికి మనదేశం రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల అంచనా. చాలా సంవత్సరాలుగా మనదేశంలోని సంఘటితరంగంలో ఉద్యోగాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. మరోవైపు లక్షలాది యువజనులు ఏటా కార్మికవిపణి లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు సమకూర్చలేక పోగా కొత్త సాంకేతికతలతో ఉన్న ఉద్యోగాలను సైతం హరింపచేస్తున్నాం.


మరోపక్క ఉద్యోగాల సృష్టిలో చిన్న పరిశ్రమలు అగ్రగాములుగా ఉంటున్నాయి. అయితే అవి దేశీయ కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మనదేశంలోని అతి పెద్ద ఔషధ ఉత్పత్తిదారులు చైనా నుంచి ముడి పదార్థాలను, బ్రెజిల్ నుంచి కంటైనర్లను, జర్మనీ నుంచి ఎలక్ట్రానిక్ సామగ్రిని దిగుమతి చేసుకోవడం కద్దు. లాజిస్టిక్స్ సాఫ్ట్‌వేర్‌కు మరోదేశం వైపు చూడవలసిన అవసరం మనకు లేదు కదా. ముడి పదార్థాలను అతి తక్కువ ధరకు లభ్యమయ్యే దేశం నుంచి దిగుమతి చేసుకొంటూ తమ ఉత్పత్తులకు అధిక ధర లభించే దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఉత్పత్తిని భారీస్థాయిలో చేపడుతున్నందున దానికి సంబంధించిన వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నాయి.


మరి ఔషధ ఉత్పత్తిరంగంలో ఉన్న చిన్న కంపెనీలు పెద్ద సంస్థలతో పోటీ పడలేవు. చిన్న కంపెనీలు తమకు అవసరమైన ముడిపదార్థాలను స్థానికంగానే కొనుగోలు చేసుకోవల్సి ఉంటుంది–-అవెంత వ్యయభరితమైనవైనా సరే. ఉత్పత్తి చేసిన ఔషధాలను దేశీయ మార్కెట్‌లోనే తక్కువ ధరకే విధిగా విక్రయించుకోవలసి ఉంటుంది. చిన్న పరిశ్రమలు పెద్ద కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోలేక దివాలా తీస్తే ఉద్యోగాల సృష్టి నిలిచిపోవడం అనివార్యం. అలాంటప్పుడు ఉద్యోగ విపణిలోకి ప్రవేశిస్తున్న యువజనులకు ఉపాధి కొరవడుతుంది. ఫలితంగా వారిలో చాలామంది అరాచకాలకు పాల్పడే అవకాశముంది. అధునాతన సాంకేతికతలతో ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు అటువంటి పరిస్థితులు తప్పవు. కనుకనే చిన్న పరిశ్రమలకు సహాయం సమకూర్చాలని, స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించాలని ఆర్థర్‌ డి లిటిల్ అనే గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ, బ్యాంక్ ఆఫ్ అమెరికా సూచిస్తున్నాయి.


అయితే ఈ ప్రోత్సాహం, సహాయం వల్ల సత్ఫలితాలు సమకూరుతాయని నేను భావించడం లేదు. నిజానికి మన చిన్న పరిశ్రమలకు ‘సహాయం’ అందించడానికి బదులు, పెద్ద కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీ నుంచి వాటికి ‘సంరక్షణ’ సమకూర్చాలి. మన యువజనులకు ఉద్యోగాలు సమకూర్చాలంటే ఇలా చేయడం తప్పనిసరి. సహాయం అందించడం వల్ల మార్కెట్‌లో చిన్న, పెద్ద కంపెనీల మధ్య పోటీ కొనసాగుతుంది. కొత్త దశాబ్దంలో దీని వల్ల ప్రయోజనం లేదు. మూడు దశాబ్దాల సరళీకరణ అనుభవాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన్మోహన్‌సింగ్ హయాంలో చిన్నపరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ ఒకటి సూచించింది. ఆచరణలో దాని వల్ల ఎటువంటి ప్రయోజనం నెరవేరలేదు. కనుక చిన్న పరిశ్రమలకు సంరక్షణ సమకూర్చడమే ముఖ్యం. 


అయితే ఈ సంరక్షణతోనూ ఒక సమస్య ఉంది. దేశీయ చిన్నపరిశ్రమలకు ప్రభుత్వం సమకూర్చే సంరక్షణ అవి నాసిరకం సరుకులను మాత్రమే ఉత్పత్తి చేసేందుకు దారితీసే అవకాశం ఎంతైనా ఉంది. పైగా వాటి ధరలు అనివార్యంగా భారీగా ఉంటాయి. ఈ నాసిరకం ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌లో మాత్రమే విక్రయిస్తారు. ఇందుకొక ఉదాహరణ అంబాసిడర్ కార్లు. దశాబ్దాల పాటు మన దేశంలోని సంపన్నులకు అవి మినహా మరే అధునాతన కార్లు అందుబాటులో లేకుండా పోయాయి. జపనీస్ కంపెనీ సహకారంతో సంజయ్‌గాంధీ మారుతీ కార్ల కంపెనీని నెలకొల్పిన తరువాతనే పరిస్థితులు మారాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభయిన తరువాత అవి మరెంత అనూహ్యంగా మారిపోయాయో చెప్పనవసరం లేదు. 


‘రక్షిత’ చిన్నపరిశ్రమల వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు సంభవించే నష్టాల నుంచి బయటపడడం ఎలా? రోబోలతో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఎగుమతుల కోసం పెద్దఎత్తున ఉత్పత్తిచేయడమే మార్గాంతరం. దీని వల్ల మన పారిశ్రామికవేత్తలు అధునాతన సాంకేతికతలను తప్పక ఉపయోగించుకుంటారు. మనదేశంలో చౌకగా లభ్యమయ్యే శ్రమ శక్తి కూడా వారికి పూర్తిగా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తులను పూర్తిగా ఎగుమతుల కోసమే ఉద్దేశించవలసి ఉంటుంది. ఈ విధానం వల్ల మనకు అధునాతన సాంకేతికతలూ సమకూరతాయి, ఎగుమతుల రంగంలో ఉద్యోగాలూ సృష్టి అవుతాయి. ఇక చిన్నపరిశ్రమలకు దేశీయ మార్కెట్‌లో తగు వ్యాపారావకాశాలను కల్పిస్తాయి. 


అయితే మనం కొన్ని వాస్తవాలను విస్మరించకూడదు. మన చిన్న ఉత్పత్తిదారులు అనుసరించే ‘అసమర్థ’ ఉత్పాదక విధానాల వల్ల ఉత్పత్తివ్యయాలు భారీగా ఉంటాయి. ఒక పెద్ద కంపెనీ ఉత్పత్తి చేసే వస్త్రం మీటరు రూ.200కి లభిస్తే చిన్న కంపెనీ ఉత్పత్తిచేసే అదే వస్త్రం ధర విధిగా రూ.250 ఉంటుంది. ఫలితంగా భారతీయ వినియోగదారులు అదనంగా రూ.50 వెచ్చించవలసి ఉంటుంది. ఈ వ్యయాన్ని ‘ఉద్యోగితా పన్ను’గా మనం పరిగణించాలి. ఉద్యోగాలతో పాటు ఖరీదైన దేశీయ ఉత్పత్తులు కావాలా లేక ఉద్యోగాలు లేకుండా చౌక విదేశీ సరుకులు కావాలో భారతీయ వినియోగదారులు నిర్ణయించుకోవలసి ఉంది. 


మనదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంది. ఈ జనాభా లబ్ధి (డెమోగ్రాఫిక్ డివిడెండ్- – పని చేసే వయసు ఉన్న జనాభా పెరగడం వల్ల జరిగే అభివృద్ధి) మనకు ఒక పెద్ద వరంగా పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ జనాభా లబ్ధి జనాభా విపత్తుగా పరిణమిస్తోంది! నోట్లరద్దు, వస్తుసేవల పన్ను, కరోనా మహమ్మారి మన ప్రజలను తీవ్రంగా దెబ్బతీశాయి. మన ఆర్థిక వ్యవస్థకు భారీనష్టాన్ని కలిగించాయి. కూరగాయల విక్రేతల రోజువారీ ఆదాయం రూ.2000 నుంచి రూ.500కి తగ్గిపోయిందని ఉత్తరప్రదేశ్‌లో జిల్లాస్థాయి బీజేపీ నాయకుడు ఒకరు చెప్పారు. గతంలో ఇద్దరు విక్రేతలు ఉన్నచోట ఇప్పుడు ఇరవై మంది విక్రేతలు ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజల ఆదాయాలలో తగ్గుదల ఇప్పుడు కాకపోయినా సమీప భవిష్యత్తులో ఒక అతిపెద్ద ఆర్థిక ఉపద్రవం కానున్నదనేది స్పష్టం. ఉద్యోగాలను హరించివేసే పెద్ద పరిశ్రమల సాంకేతికతా సమర్థత, ఉద్యోగాలను సృష్టించే చిన్నపరిశ్రమల వాణిజ్య అప్రయోజకత్వం మధ్య అటు అధునాతన సాంకేతికతలు సమకూరడంతో పాటు ఇటు ఉద్యోగాల సృష్టికి దోహదం చేసే ఒక కొత్తమార్గాన్ని కనుగొనవలసిన అవసరమున్నది. 2021–-30 దశాబ్దంలో దేశ ఆర్థికవ్యవస్థను సమున్నతస్థాయికి తీసుకువెళ్ళడంలో భారతప్రభుత్వం విధిగా ఎదుర్కోవలసిన సవాల్ ఇది.





భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-01-05T06:00:53+05:30 IST