సమతావాద దార్శనికుడు పూలే

ABN , First Publish Date - 2021-04-10T06:07:44+05:30 IST

రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యం పైనే పోరాడాలనే కృత నిశ్చయానికి వచ్చిన తొలి ఆధునికుడు జ్యోతిరావు ఫూలే. పాశ్చాత్య మేధావుల ‘రైట్స్ ఆఫ్ మెన్’, ‘ఆన్ లిబర్టీ’ పుస్తకాల ప్రేరణతో...

సమతావాద దార్శనికుడు పూలే

రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యం పైనే పోరాడాలనే కృత నిశ్చయానికి వచ్చిన తొలి ఆధునికుడు జ్యోతిరావు ఫూలే. పాశ్చాత్య మేధావుల ‘రైట్స్ ఆఫ్ మెన్’, ‘ఆన్ లిబర్టీ’ పుస్తకాల ప్రేరణతో మానవ హక్కులు, స్వాతంత్ర్యం, సమానత్వం వంటి స్వాతంత్ర్యోద్యమ భావాలు 1847 నాటికే జ్యోతిబాలో అంకురించాయి.


ఆదిమ సమాజం నుండి ఆధునిక నాగరిక సమాజం వరకు మానవజాతి వికాసానికి ప్రధాన కారణం విద్య. విద్య ప్రాధాన్యతను, దాని విశిష్టతను, మానవాభివృద్ధిలో దాని పాత్రను తెలిపిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే. నవభారత నిర్మాణానికి, అసమానతలు, వివక్ష రహితమైన సమాజానికి నాంది పలికిన మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప తొలి సామాజిక విప్లవకారుడు. 170 సంవత్సరాల క్రితం వర్ణ, కుల, లింగ వ్యవస్థ పునాదుల మూలాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటి మర్మాన్ని బట్టబయలు చేసి ప్రజలను చైతన్య పరిచిన క్రాంతి దార్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే.


అశేష జన బాహుళ్యానికి విజ్ఞాన వెలుగులు నింపాలని, లింగ, కుల, మత వివక్ష అసమాన ఆచరణలకు వ్యతిరేకంగా సమానత్వం కోసం ఆచరణాత్మక పోరాటాలను, ఉద్యమాలను నిర్మించి ఫలితాలను సమాజంలోని అట్టడుగు, నిమ్న వర్గాలకు అందించిన క్రాంతి దార్శనికుడు మహాత్మ జ్యోతిబాపూలే.


జ్యోతిబా 11 ఏప్రిల్ 1827లో జన్మించారు. జ్యోతిబా తన ఏడవ ఏట మరాఠీ పాఠశాలలో విద్యార్థిగా జీవితం ప్రారంభించి చదువును మధ్యలో మానేసి తండ్రికి పనులలో సహాయం చేసేవాడు. 13 సంవత్సరాల వయసులో 8 ఏళ్ల సావిత్రిబాయితో వివాహమయింది. బడి మానివేసినా పుస్తకాలు చదవడం మానని జ్యోతి బాను చూసి జఫర్ బేగ్ మున్షీ, లెజెట్ లు ఆయనను చదివించవలసిన అనివార్యతను గుర్తించి మేధో వికాసానికి విద్య ఎంత అవసరమో ఆయన తండ్రి గోవిందరావుకు విడమర్చి చెప్పి స్కాటిష్ మిషనరీ పాఠశాలకు పంపారు.


ఒకరోజు బ్రాహ్మణ మిత్రుని పెండ్లి ఊరేగింపులో జరిగిన అవమానపు సంఘటన జ్యోతిబా జీవిత గమనాన్ని మార్చేసింది. ఈ దుస్సంఘటనతో సామాజిక అసమానతల వల్ల ఒక వ్యక్తికి జరిగిన వివక్ష, అవమానం యావత్ జాతికి అవమానంగా ఆయన భావించారు. తన జాతి పురోగతికి అడ్డుగోడలుగా ఉన్న సనాతన హిందూ సామాజిక వ్యవస్థలోని వివిధ వివక్ష రూపాలలో ఉన్న అసమానతలను కూకటివేళ్లతో పెకలించాలనే ఒక సృజనాత్మక మేధోమధనానికి అంకురార్పణ పడింది. రాజకీయ దాస్యం కంటే సామాజిక దాస్యం పైనే పోరాడాలని కృత నిశ్చయానికి వచ్చారు. థామస్ పెయిన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ మెన్’ అన్న గ్రంథం సత్యం, న్యాయం, ధర్మం అనే భావాలకు ప్రేరణ ఇవ్వగా, మానవ హక్కులు, స్వాతంత్ర్యం, సమానత్వం వంటి స్వాతంత్ర్యోద్యమ భావాలు 1847 నాటికే జ్యోతిబాకు కలిగాయి. జాన్ స్టువర్ట్ మిల్ ‘ఆన్ లిబర్టీ ’పుస్తకం జ్యోతిరావు పూలేను విశేషంగా ప్రభావితం చేసింది. 


భారతదేశం వెనుకబడటానికి దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు విద్య లేకపోవడమేనని గుర్తించిన పూలే, తన భార్య సావిత్రిబాయిని విద్యావంతురాలుగా తీర్చిదిద్ది 1948 జనవరి ఒకటో తారీకున పూణేలోని బుధవార పేట ఖీడే గృహంలో తొలిసారిగా బాలికల కోసం పాఠశాలను ప్రారంభించాడు. 3, జూలై 1851న బుధవారపేటలో దళిత బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను నెలకొల్పారు. 1851 సెప్టెంబర్ 17న రాస్తాపేటలో మరొకటి, 1852 మార్చి 3న బేతాళ పేటలో అహల్యశ్రమం పేరిట దళితుల కోసం మరొక పాఠశాలను ఏర్పాటు చేశారు. 1851-59 కాలంలో దళిత బాల బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించడంతో పాటు అనాధల కోసం ఆశ్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పాఠశాలలను నెలకొల్పి బాలికలకు, శూద్రులకు, అతి శూద్రులకు జ్ఞాన జ్యోతులను వెలిగించడం ఏ మాత్రం సహించని ఛాందసవాద వర్గం అడుగడుగునా ఆటంకాలను, అవమానాలను సృష్టించినా వాటిని భరిస్తూ ఆ లక్ష్య సాధన కోసం మడమ తిప్పకుండా ముందుకు సాగారు. ఫూలే దంపతుల జీవితం వారి ఉద్యమ భాగస్వామ్యంలో కూడా చివరి వరకు ముడి వేసుకొని ఉంది. 


1876-–77 సంవత్సరంలో మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో పూలే దంపతులు రోజూ ధాన్యం సేకరించి రొట్టెలను భోజన కేంద్రాలకు పంపేవారు. ధాన్యం గింజ కూడా దొరకని ఆ రోజులలో కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. దళిత, బహుజన, రైతాంగం, కార్మికులు, జెండర్, మానవ హక్కుల కోసం శూద్రులు, నిమ్న కులాల్లో కూడా నూతన చైతన్యాన్ని కల్పించి, సంస్కరణ, ఉద్యమ బీజాలు నాటిన మహోన్నతమైన, విలక్షణమైన సామాజిక ఉద్యమ కారుడు ఫూలే. 


స్వాతంత్రం వచ్చి 70 వసంతాలు గడిచినా ఫూలే ఉద్యమాల ఎజెండా ఇంకా మిగిలి పోయింది. ‘నేటికీ కుల, వర్గ అసమానతలు – కుల, వర్గ రహిత సమానత వాంఛల’ మధ్య జరుగుతున్న పోరాటాలు ఉన్నాయి. జాతుల మధ్య సమానత్వం కోసం జరుగుతున్న సంఘర్షణలు ఉన్నాయి. జెండర్ అసమానతలకు వ్యతిరేకంగా జెండర్ సమానత్వం కోసం జరుగుతున్న పోరాటాలు ఉన్నాయి. అసమానతలు లేని, వివక్ష లేని సామాజిక వ్యవస్థ స్వప్నం ఫూలే ఉద్యమ స్పూర్తితో సాకారమవుతుందని ఆశిద్దాం.


-ప్రొఫెసర్ తాటికొండ రమేష్

కాకతీయ విశ్వవిద్యాలయం

(ఏప్రిల్ 11: జ్యోతిబా ఫూలే జయంతి)

Updated Date - 2021-04-10T06:07:44+05:30 IST