డాక్టర్ రెడ్డీస్ లాభంలో 13% క్షీణత

ABN , First Publish Date - 2020-07-30T05:58:09+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆదాయం పెరిగినప్పటికీ.. నికర లాభం క్షీణించింది. యూరప్‌ మార్కెట్లు, ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రిడియెంట్స్....

డాక్టర్ రెడ్డీస్ లాభంలో 13% క్షీణత

త్రైమాసిక ఆదాయం రూ.4,418 కోట్లు

2020-21లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు

వచ్చే నెలలో కొవిడ్‌ ఔషధాలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఆదాయం పెరిగినప్పటికీ.. నికర లాభం క్షీణించింది. యూరప్‌ మార్కెట్లు, ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ (పీఎ్‌సఏఐ) విభాగం ఆదాయం పెరగడానికి దోహదం చేస్తే.. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై వెయిటెడ్‌ డిడక్షన్‌ను ఉపసంహరించడం.. కంపెనీకి చెందిన ఒక ప్లాంట్‌ పన్ను హాలీడే గడువు ముగియడం కారణంగా నికర లాభం క్షీణించింది. జూన్‌ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.4,418 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.3,843 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. సమీక్షా కాలానికి నికర లాభం మాత్రం 13 శాతం క్షీణించి రూ.663 కోట్ల నుంచి రూ.579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆదాయంలో నికర లాభం 17.2 శాతం ఉంటే ఈసారి 13.1 శాతానికి తగ్గిందని కంపెనీ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 2020 జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి పరిశోధన, అభివృద్ధిపై చేసిన ఖర్చు  రూ.361 కోట్ల నుంచి రూ.398 కోట్లకు పెరిగినప్పటికీ.. ఆదాయంలో ఆర్‌ అండ్‌ డీ వాటా 9.4 శాతం నుంచి 9 శాతానికి తగ్గింది. తొలి త్రైమాసికంలో రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టామని.. మొత్తం ఏడాదికి రూ.1,000 కోట్ల పెట్టాలని నిర్ణయించుకున్నామని కంపెనీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎరేజ్‌ ఇజ్రాయెలీ అన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో తొలి త్రైమాసిక ఫలితాలు అన్ని విధాల సంతృప్తికరంగానే ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ సహ చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. 


జాప్యం అందుకే..

కొవిడ్‌ కారణంగా ఆసుపత్రులకు రోగులు రావడం తగ్గడంతో కొన్ని మార్కెట్లలో ఔషధాల అమ్మకాలు తగ్గాయని ప్రసాద్‌ అన్నారు. దీనివల్ల కంపెనీపై పెద్ద ప్రభావం లేదు. ధరలు స్థిరంగా ఉన్నాయి. కొత్త ఉత్పత్తుల విడుదల కొనసాగించాం. డిజిటల్‌ మార్గంలో డాక్టర్లతో చర్చలు జరుపుతున్నాం. అవసరాలకు అనుగుణంగా ఔషధాల సరఫరా చేశామని ప్రసాద్‌ వివరించారు. కొవిడ్‌ చికిత్సకు రెమ్‌డెసివిర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి గిలీడ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌తోపాటు ఫావిపిరావిర్‌ టాబ్లెట్లను (ఎవిగాన్‌ బ్రాండ్‌) వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ సీఎ్‌ఫఓ సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు. రెండో విడతలో గిలీడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందున ఇతర కంపెనీల కంటే కొద్దిగా ఆలస్యంగా రెమ్‌డెసివిర్‌ను విడుదల చేస్తున్నామని వివరించారు. రెండు ఔషధాలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి పొందే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. 


భారత్‌లో క్షీణించాయి..

ఇతర అన్ని మార్కెట్లలో జెనరిక్‌ ఔషధాల విక్రయాలు పెరిగినప్పటికీ.. భారత్‌లో మాత్రం క్షీణించాయి. 10 శాతం తగ్గి రూ.696 కోట్ల నుంచి రూ.626 కోట్లకు పరిమితమయ్యాయి. కొవిడ్‌ కారణంగా రోగులు ఆసుపత్రులకు రాకపోవడంతో ఔషధాల అమ్మకాలు తగ్గాయని కంపెనీ వెల్లడించింది. కొవిడ్‌ కారణంగా తొలి త్రైమాసికంలో విక్రయాలు తగ్గినప్పటికీ.. త్వరలోనే ఊపందుకుంటాయని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది. 


యూరప్‌ ఆదాయంలో 48% వృద్ధి

సమీక్షా త్రైమాసికంలో గ్లోబల్‌ జెనరిక్స్‌ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.3,298 కోట్ల నుంచి రూ.3,507 కోట్లకు పెరిగింది. ఇందులో నార్త్‌ అమెరికా ఆదాయం రూ.1,728 కోట్లుంది. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఈ మార్కెట్‌ ఆదాయంలో 6 శాతం వృద్ధి నమోదైంది. 


Updated Date - 2020-07-30T05:58:09+05:30 IST