పథకాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ

ABN , First Publish Date - 2020-02-20T09:17:03+05:30 IST

వై.ఎస్‌. జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకాలు చిత్తశుద్ధిగా అమలు చేయాలని భావిస్తున్నది. కానీ రైతు భరోసా, ఫించన్లు, అమ్మఒడి పథకాలకు..

పథకాలపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ

వై.ఎస్‌. జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన నవరత్నాల పథకాలు చిత్తశుద్ధిగా అమలు చేయాలని భావిస్తున్నది. కానీ రైతు భరోసా, ఫించన్లు, అమ్మఒడి పథకాలకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై అర్హులకు లబ్ధిచేకూరటం లేదు. కొత్త ఇసుక విధానంతో కొద్దినెలలపాటు ఇబ్బందులు భరించిన ప్రజలకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ అందుబాటులోకి వచ్చినా, ఇసుకను అవసరం లేనివాళ్ళు బుక్‌చేసుకొని బ్లాక్‌లో విక్రయిస్తున్నారు.  ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకోసం, యువతకు ఉద్యోగాల కల్పనకోసం ప్రవేశపెట్టిన వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగాలు ఒకేసారి సుమారు 4 లక్షల మందికి ఉపాధి లభించింది. కానీ అంతకు ముందే చిరుద్యోగాలు చేసుకుంటున్నవారు దాన్ని పూర్తిగా వదలలేక, దీనిలో పూర్తిగా టైము గడపలేక పోవడంవల్ల కొన్ని ఏరియాలో పూర్తి స్థాయి ఇంటింటి సర్వేలు జరగలేదు. ఆ కారణంగా అర్హులను గురించలేదు. పై అధికారుల పర్యవేక్షణ కొరవడితే ఏ పథకమైనా ప్రజల్లోకి వెళ్ళదు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ప్రతి పథకాన్నీ గ్రామ సచివాలయం, వాలంటీర్‌ వ్యవస్థలకు ముడిపెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ఆ వ్యవస్థలు అంకిత భావంతో లేకపోతే ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంటుంది. టోల్‌ ఫ్రీ నెంబర్లలో సమాధానం దొరకకపోవడం, స్పందన అప్లికేషన్లకు స్పందన కొరవడడం కూడా చాలాచోట్ల జరుగుతోంది. పౌరసరఫరాల, ఆరోగ్య, విద్యా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో అనుసంధానమైన ఈ పథకాలన్నీ సక్రమంగా జరగాలంటే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. అన్ని సచివాలయాల్లో వాలంటీర్ల పేర్లు, ఫోన్‌ నెంబర్లు, స్పందన ఫోన్‌ నెంబర్లు తప్పనిసరిగా డిస్‌ప్లే చేసేట్టుగా చూడాలి. ఆ డివిజన్‌ ప్రజలందరికీ ఆ వార్డు సచివాలయం తాలూకూ అందరి ఫోన్‌నెంబర్లు అందుబాటులోకి వచ్చేట్లు చూడాలి. 

జోస్యుల వేణుగోపాల్‌, విజయవాడ

Updated Date - 2020-02-20T09:17:03+05:30 IST