Abn logo
Sep 27 2021 @ 00:27AM

పర్యాటకంతో ప్రగతి

కొండారెడ్డి బురుజు

  1. జిల్లాలో అనేక పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలు
  2. ప్రచారం, సదుపాయాలు లేక ఇబ్బందులు
  3. టెంపుల్‌-టూరిజం సర్క్యూట్లకు గ్రహణం
  4. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం


ఆత్మకూరు, సెప్టెంబరు 26: దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే అంశాలలో పర్యాటకం ఒకటి. ప్రతిదేశంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకం ఉంటాయి. వాటిని పర్యాటకానికి అనుకూలంగా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆదాయవనరులుగా మారుతాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో టూరిజం కీలకం.  ఇందుకోసం ఐక్యరాజ్యసమితి ‘ది వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌’ను ఏర్పాటు చేసింది. పర్యాటకంలో గ్లోబల్‌ కోడ్‌ ఆఫ్‌ ఎఽథిక్స్‌ అమలును ఈ సంస్థ ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థలో 154 దేశాలు, 7 టెరిటరీలకు సభ్యత్వం ఉంది. ప్రైవేట్‌ రంగం, విద్యాసంస్థలు, టూరిజం అసోషియేషన్లు, స్థానిక టూరిజం అథారిటీల నుంచి 400 మంది అఫిషియేట్‌ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాన కార్యాలయం మాడ్రిడ్‌లో ఉంది. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ సూచన మేరకు 1980 నుంచి ఏటా సెప్టెంబరు 27న ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో అంశాన్ని ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది పర్యాటకాన్ని సమ్మిళిత వృద్ధి చేయాలన్న నినాదం ఇచ్చారు. 


జిల్లాలో నిర్లక్ష్యం


జిల్లాలో శ్రీశైలాన్ని మినహాయిస్తే, మిగిలిన అన్ని ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలలో సదుపాయాల కొరత ఉంది. యాత్రికులు విడిది చేసేందుకు డార్మెటరీలు, రెస్టారెంట్‌లు లేవు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టెంపుల్‌-టూరిజం(ఆలయ-పర్యాటకం) ప్రాజెక్ట్‌ పరిధిలో ఐదు సర్క్యూట్లను గుర్తించారు. దేవదాయశాఖ, పర్యాటకశాఖ సమన్వయంగా వ్యవహరించాయి. ఆర్టీసీ, ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సహకారం తీసుకునేందుకు కసరత్తు జరిగింది. జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను, పర్యాటక కేంద్రాలను అనుసంధానించారు. విజయనగర కారిడార్‌ సర్క్యూట్‌లో యాగంటి, బెలుం గుహలు, త్రిలింగయాత్ర సర్క్యూట్‌లో శ్రీశైలం, మహానంది, అహోబిలం, గోల్డెన్‌ ట్రయాంగిల్‌ సర్క్యూట్‌లో శ్రీశైలం, యాగంటి, మంత్రాలయం, కర్నూలు నగరంలోని పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించారు. కానీ యాత్రికులను ఆకర్షించడంలో విఫలం అయ్యారు. సర్క్యూట్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన దాఖలాలు కూడా లేవు. 


సంగమేశ్వరం.. కొలను భారతి


కృష్ణా పుష్కరాల సమయంలో అప్పటి కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ చొరవతో రూ.48 లక్షలతో హడావిడిగా సంగమేశ్వరంలో టూరిజం రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. సప్తనదీ జలాల్లో బోటులో విహరించేలా, సంగమేశ్వరం - శ్రీశైలానికి జలవిహారం చేసేలా పలు ప్యాకేజీలను రూపొందించారు. పుష్కరాలు ముగిశాక ఆ ఉత్సాహం, శ్రద్ధ కనిపించలేదు. సంగమేశ్వరంలోని పర్యాటక అంశాలను ప్రచారంలోకి తీసుకెళ్లలేదు. అడపాదడపా వచ్చేవారికి అవసరమైన సదుపాయాలు లేవు. టూరిజం రెస్టారెంట్‌ మరుగునపడింది. అలాగే రాష్ట్రంలోని ఏకైక సరస్వతి ఆలయం కొలనుభారతి పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 


ఎకో టూరిజం కేంద్రం


2017 మే 10న బైర్లూటి సమీపంలో ప్రారంభించిన ఎకో టూరిజం కేంద్రానికి తెలుగు రాష్ట్రాల నుంచే ఢిల్లీ నుంచి కూడా యాత్రికులు వస్తున్నారు. నల్లమల అందాలు, పరిశుభ్రమైన కాటేజీలు, మంచి ఆహారం, జంగిల్‌ సఫారీ పర్యాటకులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ప్రచారం లేకున్నా, యాత్రికులు ఆన్‌లైన్‌లోనే కాటేజీలను బుక్‌ చేసుకుని బైర్లూటికి వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో అడవులవు పాత్రను ప్రజలకు తెలియజేసేందుకు, నల్లమల చెంచులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎకో టూరిజం నేడు చక్కటి ఫలితాలను అందిస్తోంది.