Abn logo
Aug 2 2021 @ 03:08AM

మన్యంలో నిషేధం

మైనింగ్‌ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీయొద్దు

అడుగడుగునా ఫెన్సింగ్‌.. నిషేధం బోర్డులు 

మైనింగ్‌ మాఫియా కొత్త పంథా..

అడవిలో సొంత మనుషులతో నిఘా


మైనింగ్‌ మాఫియా కొత్త పంథాను ఎంచుకుంది. తమ అక్రమాలు బయటపడకుండా సొంత మనుషులతో అడవిలో నిఘా ఏర్పాటు చేసుకుంది. వాహనదారులను ఆపి తనిఖీలు చేస్తోంది. వారి వద్ద సెల్‌ఫోన్లు ఉంటే ఫొటోలు, వీడియోలు తీశారేమోనని క్షుణ్ణంగా పరిశీలించిగానీ వదలడం లేదు. స్మార్ట్‌ ఫోన్లతో అడవిలోకి రావద్దని హుకుం జారీ చేస్తోంది. మైనింగ్‌ ఏరియాలో ఐరన్‌ కంచెతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకుంది. అడుగడుగునా ‘నిషేధం’ బోర్డులు ఏర్పాటు చేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విశాఖ మన్యంలో అటవీ, పర్యావరణ విధ్వంసం బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇప్పటికే కొంతమందికి డబ్బులు వెదజల్లిన మైనింగ్‌ మాఫియా ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మైనింగ్‌ జరిగే ప్రాంతం, ఖనిజాన్ని డంపింగ్‌యార్డుకు తరలించే ప్రాంతం, అక్కడినుంచి రౌతంపూడికి వచ్చే ప్రధాన రహదారుల వెంట సొంత నిఘాను ఏర్పాటుచేసుకుంది. కీలకమైన ప్రాంతాలకు సొంతంగా ఐరన్‌ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. బయటి వ్యక్తులు రాకుండా, అక్కడ ఫొటోలు, వీడియోలు తీయకుండా నాతవరం నుంచి భమిడికలొద్ది వెళ్లే రహదారి, రౌతులపూడి నుంచి డంపింగ్‌యార్డ్‌, మైనింగ్‌ ఏరియాకు వచ్చే రహదారుల్లో నిషేధం బోర్డులను ఏర్పాటుచేసింది. తమ అనుమతి లేకుండా ఎవరూ ఈ ప్రాంతంలోకి ప్రవేశించవద్దని, ఎవరైనా ఉల్లంఘించి వస్తే శిక్షకు గురవుతారని ఆ బోర్డుల్లో హెచ్చరించింది.


ఆ ప్రాంతంలో ఫొటోలు, వీడియోలు తీయవద్దని పేర్కొంది. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్లలో ఫొటోలు, వీడియో ఏమైనా తీశారేమోనని క్షుణ్ణంగా పరిశీలిస్తూ గంటల తరబడి ఆపేస్తున్నారు. దీనిపై గిరిజనులు మండిపడుతున్నారు. కొంతమంది నుంచి ఫోన్లు లాక్కుంటున్నారని బాధితులు చెబుతున్నారు. గిరిజనులను కూడా అటు వెళ్లనివ్వడం లేదని వాపోతున్నారు. 


అడవి వైపు కన్నెత్తి చూడొద్దు..

మైనింగ్‌ జరిగే ప్రాంతం తీవ్ర వివాదాస్పదం కావడం, అక్కడ లేటరైట్‌ పేరిట బాక్సైట్‌ తవ్వేస్తున్నారని, అడవిని ధ్వసం చేసి, ఖనిజాన్ని తరలించేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో మైనింగ్‌ మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్తవారెవరూ అటవీ ప్రాంతంలో కనబడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. నాతవరం మండలంలోని ఎంపిక చేసిన యువకులకు డబ్బులిచ్చి ప్రైవేటు గస్తీని ఏర్పాటు చేయించినట్లు తెలిసింది. వారి కి మోటార్‌సైకిళ్లు ఇప్పించి, మైదాన ప్రాంతం నుంచి మన్యంలోకి ప్రవేశించే మార్గాల్లో వ్యక్తుల కదలికలపై నిరంతర గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.


దీని వల్లే గిరిజనుల రాకపోకలు వెంటనే వారికి తెలిసిపోతున్నాయని, ఫోన్లు లాక్కొని తనిఖీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అలజడి రేగుతుండటంతో గత నాలుగైదు రోజులుగా నాతవరం మండలంలోని భమిడిక, సరుగుడు, ఇటు రౌతులపూడి మండలంలోని అటవీ గ్రామాల్లో దండోరా వేయిస్తున్నట్లు తెలిసింది. ‘‘అవసరం లేకుండా ఎవరూ అడవిలోకి వెళ్లవద్దు. మాట వినకుండా అడవిలోకి వెళ్తే ఎదురయ్యే సమస్యలకు మాది బాధ్యత కాదు. అలా అతిక్రమించే వారికి డబ్బులు కూడా అందవు’’ అంటూ దండోరా వేయిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది.


ఒక్క ఆధారమూ లేకుండా చేసేందుకేనా?..

 మైనింగ్‌ మాఫియా అడవిలో చేసిన విధ్వంసం, పర్యావరణ హననం గురించి ఫొటోలు, వీడియోలు బయటికి రావడంతో వాటిపై అటవీశాఖ నిశిత పరిశీల న చేస్తోంది. తూర్పుగోదావరి డీఎ్‌ఫవోను మార్చేసింది. పలువురు అటవీ రేంజర్లను పిలిచి మాట్లాడినట్లు తెలిసింది. మైనింగ్‌ ఏరియాలో రహదారి నిర్మాణం కోసం ఇప్పటిదాకా ఎన్నిరకాల చెట్లు నరికారు? మొత్తం ఎన్నివేల చెట్లను నేలకూల్చారన్న అంశంపై అటవీశాఖ ప్రాధమిక అధ్యయనం చేసినట్లు సమాచారం. విజిలెన్స్‌ విభాగం కూడా ప్రత్యేక పరిశీలన జరిపినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అడవిలో ప్రైవేటు వ్యక్తులను స్వేచ్ఛగా తిరగనిస్తే మరిన్ని ఫొటోలు, వీడియోలు తీస్తారని, తమకు చిక్కులు వస్తాయని మైనింగ్‌ మాఫియా భావించడంవల్లే అక్కడ నిషేధ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చివరికి పోలీసు, అటవీ విభాగం వారిని కూడా ఆ ప్రాంతంలోకి వెళ్లనివ్వడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. 


పోలీసు అధికారిపై వేటు..

అడవిలో తమ అక్రమాలు బయటికి రాకుండా మైనింగ్‌ మాఫియా గిరిజన గ్రామాల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచిన విషయం ఓ పోలీసు అధికారి దృష్టికి వెళ్లింది. అసలు అక్కడ ఏం జరుగుతోందన్న అనుమానం కలగడంతో ఆయన మైనింగ్‌ జరిగే ప్రాంతం, డంపింగ్‌ యార్డ్‌, ఇతర ప్రాంతాల సందర్శనకు అడవిలోకి వెళ్లారు. దీంతో మైనింగ్‌ ఏరియా వద్ద ఆయనను అడ్డుకున్నట్లు తెలిసింది. ‘‘పోలీసు అయితే ఇక్కడకు వస్తావా? ఎవరి పర్మిషన్‌తో ఇక్కడకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్లిపో. ఇంకోసారి రావొద్దు’’ అంటూ ఆయన్ను మైనింగ్‌ మాఫియా హెచ్చరించినట్లు తెలిసింది. కంగుతిన్న ఆయన మిగతా ప్రదేశాల పరిశీలనకు వెళ్లకుండానే నేరుగా స్టేషన్‌కు బయలుదేరగా, మార్గమధ్యంలోనే ఫోన్‌ వచ్చింది. ‘‘మిమ్మల్ని బదిలీ చేస్తున్నారు. వీఆర్‌లో రిపోర్టు చేయమన్నారు’’ అని చెప్పినట్టు తెలిసింది.


వెంటనే ఆ ప్రాంతానికి మరోకొత్త పోలీసు అధికారికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆకస్మిక బదిలీ అయిన అధికారిని కొద్దిరోజుల తర్వాత ట్రాఫిక్‌కు మార్చినట్లు తెలిసింది. మన్యంలో నక్సల్స్‌ ఉనికి నేపథ్యంలో ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు  చేయాలని కిందిస్థాయి పోలీసులకు హితబోధ చేస్తుంటారు.   మైనింగ్‌ మాఫియా అరాచకాన్ని కళ్లారా చూడటానికి వెళ్లిన ఓ పోలీసు అధికారిని స్టేషన్‌కు చేరకుండానే ఆకస్మిక బదిలీ చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? గిరిజన తెగకు చెందిన అధికారి పట్ల ఇలా వ్యవహరిస్తారా? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఎన్‌జీటీ విచారణతో హడావుడి.. 

మైనింగ్‌ పేరిట జరుగుతోన్న విధ్వంసంపై ఇప్పుడు అటవీశాఖ అధికారులు విచారణ, పరిశీలనల పేరిట హడావుడి చేస్తున్నారు. చెట్ల నరికివేత, రహదారి విస్తరణపై వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ మైనింగ్‌, పర్యావరణ విధ్వంసంపై జాయింట్‌ కమిటీ విచారణకు ఎన్‌జీటీ ఆదేశించిన నేపథ్యంలోనే హడావుడి చేస్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.