హెచ్‌ 1బీ లపై నిషేధం

ABN , First Publish Date - 2020-06-24T06:55:39+05:30 IST

భారతీయ ఐటీ నిపుణులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్‌1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్‌ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది.

హెచ్‌ 1బీ లపై   నిషేధం

హెచ్‌2, హెచ్‌4, ఎల్‌1, జే1లపైనా..

ఏడాది చివరి వరకూ రద్దు

హెచ్‌1బీ లాటరీ పద్ధతికి స్వస్తి

ఎక్కువ జీతం ఉంటేనే ఇక వీసా

ట్రంప్‌ సర్కారు కీలక నిర్ణయం

ఎన్నికల్లో గెలుపునకు ‘స్వదేశీ’ పాచిక

ప్రతిపక్షాలు, కంపెనీల మండిపాటు


వాషింగ్టన్‌, జూన్‌ 23: భారతీయ ఐటీ నిపుణులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హెచ్‌1బీతోపాటు వివిధ రకాల విదేశీ వర్క్‌ వీసాలను ఈ ఏడాది చివరి వరకూ ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సంతకం చేశారు. ఇవి బుధవారం నుంచి ఈ ఏడాది డిసెంబర్‌ చివరి వరకూ అమల్లో ఉంటాయి. గ్రీన్‌కార్డుల జారీని నిలిపి వేస్తూ, అమెరికాకు చట్టబద్ధంగానే రావాలంటూ ఇమిగ్రేషన్‌ ప్రకటనపై ఏప్రిల్‌లోనే ట్రంప్‌ సంతకం చేశారు. దాని గడువు జూన్‌ 22న ముగిసిపోనుంది. దానికి కొత్తగా ఎల్‌1(ఇంట్రా కంపెనీ బదిలీలు), హెచ్‌4(స్పౌజ్‌ వీసా లు), హెచ్‌2బీ(తాత్కాలిక వ్యవసాయేతర వర్కర్లు), జే1 (ఎక్స్ఛేంజ్‌) వీసాలను జోడిస్తూ ఈ ఏడాది చివరి వర కూ పొడిగించారు. ట్రంప్‌ తాజా నిర్ణయంతో కొత్తగా 5.25 లక్షల మంది అమెరికన్లకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని శ్వేతసౌధం ఒక ప్రకటనలో తెలిపింది.


ఎక్కువ జీతం ఉన్నవారికే వీసా

అమెరికన్ల ఉద్యోగాలు కాపాడడం, ఎక్కువ నైపుణ్యాలున్న వారికి పెద్దపీట వేయడానికి ఇమిగ్రేషన్‌ వ్యవస్థను సంస్కరిస్తామని అమెరికా అధికారి తెలిపారు. అంటే..ఎక్కువ జీతాలున్న వారికే హెచ్‌1బీ వీసాలిస్తారు. ఏటా 85 వేల హెచ్‌1బీ వీసాలు ఇస్తుంటాం. గత ఏడాది 2,25,000 దరఖాస్తులొచ్చాయి. ఇప్పటి వరకూ లాటరీ ద్వారా వీసాలిచ్చాం. ఇకనుంచి జీతాన్ని ప్రాతిపదికగా పెట్టాలని ట్రంప్‌ నిర్దేశించారు. అంటే, అత్యధిక జీతం ఉన్న 85 వేల మందికి వీసా రానుంది. దీంతో హెచ్‌1బీ దరఖాస్తుదారుల జీతాల, నైపుణ్య స్థాయి పెరుగుతుంది’’ అని శ్వేతసౌధం అధికారి ఒకరు తెలిపారు. అప్పు డు అత్యంత నైపుణ్య స్థాయి ఉద్యోగాల్లో అమెరికన్ల మధ్య పోటీ కూడా తగ్గుతుందన్నా రు. హెచ్‌1బీ వీసాలకు సం బంధించి వేతన గణాంక విధానాన్నికూడా సంస్కరించాలని ట్రంప్‌ నిర్దేశించారని తెలిపారు. దీంతో ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటారని పేర్కొన్నారు. 


లక్షలాది అమెరికన్లకు లబ్ధి: ట్రంప్‌

కరోనా, ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాదిమంది అమెరికన్లకు లబ్ధి చేకూర్చడానికి తాజా నిర్ణ యం అవసరమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గ్రీన్‌కార్డు వచ్చినవాళ్లు అన్ని ఉద్యోగాలకూ పోటీ పడుతున్నారు. దాంతో, అన్ని రంగాల్లోనూ లక్షలాదిమంది విదేశీ ఉద్యోగులతో అమెరికన్లు పోటీ పడాల్సి వస్తోంది. తాత్కాలిక ఉద్యోగులతోపాటు వారి భాగస్వాములు, పిల్లలు కూడా వస్తున్నారు. వారితోనూ అమెరికన్లు పోటీ పడాల్సి వస్తోంది. ఫిబ్రవరి, ఏప్రిల్‌ మధ్య కాలంలోనే 1.7 కోట్ల మందికిపైగా రోడ్డునపడ్డారు. వారిస్థానంలో హెచ్‌2బీ వీసాదారులను నియమించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే కా లంలో కీలక రంగాల్లో మరో రెండు కోట్ల మందికిపైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. వాటిని హెచ్‌1బీ, ఎల్‌1 వీసాదారులతో భర్తీ చే యాలని కంపెనీలు భావిస్తున్నాయి. వీరంతా అమెరికన్ల ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించనున్నారు’’ అని వివరించారు. వాషింగ్టన్‌ పోస్టు, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ చేసిన ఓ సర్వేలో 65ు మంది ట్రంప్‌ నిర్ణయాన్ని స్వాగతించారు. 


విమర్శల వెల్లువ

ట్రంప్‌ నిర్ణయాన్ని అమెరికాలోని ప్రతిపక్షాలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల అధినేతలు తప్పుబట్టారు. అధ్యక్షుడి ఆదేశాలు వైవిధ్యమనే అమెరికా గొప్ప ఆర్థిక బలాన్ని దెబ్బతీస్తోంది. ఇమిగ్రేషన్‌ విధానం టెక్నాలజీ రంగంలో అమెరికాకు ప్రపంచంలోనే నాయకత్వ హోదాను కల్పించింది. గూగుల్‌ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికీ ఇమిగ్రేషనే కారణం’’ అని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అన్నా రు. ఈ నిర్ణయంతో సృజనాత్మక రంగం దెబ్బ తింటుందని, అమెరికాలో ఉద్యోగ కల్పన, వృద్ధి రేటు పడిపోతుందని యూఎస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ సీఈవో థామస్‌ డోనోహూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘భారతీయ ఐటీ కంపెనీలు తాము పనిచేసే తీరును మార్చుకున్నాయి.హెచ్‌1బీ వీసాలపై ఆధారపడటం మానేసాయి. దీంతో మనకు నష్టం పెద్దగా ఉండదు’’ అని నాస్కాం ప్రతినిధి శివేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.


ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ వారికి..

అమెరికాలో ఓపీటీపై ఉన్నవారికి ఎలాంటి ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. ఓపీటీపై ఉన్నవారికి ఉద్యోగం లభించగానే హెచ్‌1బీకి దరఖాస్తు చేసుకొంటారు. ‘‘వారు ఇప్పటికే అమెరికాలో ఉన్నారు కాబట్టి సమస్య ఉండదు. అయితే వారు ఎటువంటి పరిస్థితుల్లోను అమెరికాను వదిలి రాకూడదు. వస్తే తిరిగి వెళ్లటానికి ఉండదు’’ అని ఎన్‌పీజెచ్‌ లా గ్రూప్‌నకు చెందిన మేనేజింగ్‌ అటార్నీ స్నేహల్‌ భాత్రా సూచించారు.


ఎల్‌-1 వీసాలపై ఉన్నవారికి..

ఎల్‌-1 వీసాలను మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉన్న నిపుణులకు జారీ చేస్తారు. ‘‘అమెరికాలో ఒక కంపెనీ ఉందనుకుందాం. వారి ఆఫీసు భారత్‌లోనూ ఉంటుంది. ఇక్కడి సిబ్బంది అవసరం అమెరికాలో ఉంటే.. వారికి ఎల్‌1 జారీ చేస్తారు. ఈ వీసాతో అమెరికా పౌరుల ఉద్యోగాలకు ప్రమాదం లేదు. అయినా ఎందుకు నిషేధం విధించారో తెలియదు’’ అని స్నేహల్‌ భాత్రా అన్నారు.


హెచ్‌2 ఏ వీసాలు ఉన్నవారికి..

అమెరికా వ్యవసాయ రంగానికి విదేశీ కార్మికులకు ఈ వీసాలను జారీ చేస్తారు. వీటి నిషేధంతో 2.19 లక్షల మంది వ్యవసాయ కార్మికులపై ప్రభావం పడుతుందని మైగ్రేషన్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన షారా పియర్స్‌ అభిప్రాయపడ్డారు.

- స్పెషల్‌ డెస్క్‌


ఇప్పుడే ఎందుకు!?

అమెరికాలో నవంబర్‌లో అధ్య క్ష ఎన్నికలు జరగనున్నాయి. కరోనా, ఆర్థిక మాంద్యంతో అమెరికా విలవిల్లాడుతోంది. నిరుద్యోగుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇప్పటికే 4 కోట్ల మందికిపైగా ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. వీటన్నింటినీ తట్టుకొని ఎన్నికల్లో మళ్లీ గెలవటానికి ట్రంప్‌ ఈ నిషేధాల పాచిక విసిరారని నిపుణులు భావిస్తున్నారు. 


వీసాల పునరుద్ధరణకు కృషి!

ఇప్పటికే వీసాలు ఉన్నవారిపై ట్రంప్‌ నిర్ణయంతో ఎలాంటి ప్రభావం పడదని మోదీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీసాలను పునరుద్ధరించాలంటూ అమెరికాతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని వివరించాయి. తాజా విధానంతో ఇప్పటికే హెచ్‌1బీ వీసాలున్న వారికి మరిన్ని జీతాలు వస్తాయని తెలిపాయి. తాజా నిర్ణయంతో ఆఫ్‌షోర్‌ కార్యకలాపాలు పెరుగుతాయని, దాంతో, భారత్‌లో ఉన్నవారికి మరిన్ని అవకాశాలు వస్తాయని వివరించాయి.


మినహాయింపులేమిటి?

అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండే వాళ్లు, అమెరికా పౌరులకు భాగస్వాములుగా లేదా పిల్లలుగా ఉన్న విదేశీయులపై తాజా ఉత్తర్వుల ప్రభావం ఏమీ ఉండదు. అలాగే, తాత్కాలికంగా ఆరోగ్య, అత్యవసర సర్వీసుల్లో పని చేయడానికి వచ్చేవారిపైనా ఎటువంటి ప్రభావం ఉండదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి అవసరమైన వారికి.. కోవిడ్‌-19పై చేస్తున్న పోరులో పాల్గొంటున్న వారికి ఈ నిషేధాజ్ఞలు వర్తించవు. రక్షణ, దౌత్య, అంతర్గత భద్రత విషయాలలో కీలకమైన మానవ వనరులకు కూడా ఈ నిషేధాజ్ఞలు వర్తించవు.


ఎవరేమన్నారు

‘‘ప్రపంచమంతా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. అమెరికా కూడా అనేక ఇబ్బందుల్లో ఉంది. ఒక వైపు కొవిడ్‌.. మరో వైపు ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ పరిస్థితులను చక్కబరచటానికి నిపుణులైనవారు అవసరం. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ మానవ వనరులను ఆకర్షించటమే అమెరికా విజయం వెనకున్న సూత్రం. అధ్యక్షుడు ట్రంప్‌ తాజా ఆదేశాలు ఈ వాస్తవ పరిస్థితిని పట్టించుకోవటం లేదు. దీని వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయి’’

- జెన్నిఫర్‌ మీనియర్‌, అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోషియేషన్‌ (ఏఎల్‌ఎల్‌ఏ)



నైపుణ్యమున్న విదేశీ నిపుణులపై నిషేధం విధించటం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెరగకపోగా తగ్గుతాయి.

- సాఫ్ట్‌వేర్‌ అలయెన్స్‌ సంస్థ


ఆంక్షలపై ఆందోళన వద్దు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేకిన్‌ ఇండియా; తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటు అవకాశాల ద్వారా ఈ సవాల్‌ను ఎదుర్కోవాలి. ఇందులో నుంచే అవకాశాన్ని వెతుక్కోవాలి. భారతీయులు తమ సత్తాను చాటుకునేందుకు ఇదే సరైన సమయం.

- టీటా గ్లోబల్‌ అధ్యక్షుడు సందీప్‌ మక్తల


ఎవరిపై ఎంత ప్రభావం!?

హెచ్‌1బీ వీసాలు పొందిన వారికి..


పెద్ద ఎత్తున ఐటీ నిపుణులు, అమెరికా, ఇండియాల్లోని పలు కంపెనీలపై తాజా నిర్ణయం ప్రభావం పడనుంది. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అమెరికా ఏటా 85 వేల హెచ్‌1బీ వీసాలను మంజూరు చేస్తుంది. వాటి లాటరీ కూడా ముగిసింది. ప్రస్తుతం ఈ లాటరీలో ఎంపికైన వారి తరఫున కంపెనీల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అన్నీ అనుకున్నట్లు సాగితే వీరికి అక్టోబర్‌ 1వ తేదీ నుంచి వీసాలు మంజూరవుతాయి. వీరి కోసం టెక్నాలజీ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి కూడా! తాజా నిర్ణయంతో వీసాలపై వారు స్టాంపింగ్‌ వేయించుకోవాలంటే ఈ ఏడాది చివరి వరకూ వేచి ఉండాల్సి వస్తుంది. అంతేనా, తమ హెచ్‌1బీ వీసాలను రెన్యువల్‌ చేయించుకోవడానికి ఐటీ నిపుణులు కూడా ఏడాది చివరి వరకూ ఎదురు చూడాల్సిందే. ఈ నేపథ్యంలో జనవరిలో కానీ వారు ఉద్యోగాల్లో చేరలేరు. ‘‘ఇది కంపెనీల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.


అక్టోబరులో చేరతారనుకున్న ఉద్యోగులు డిసెంబరు దాకా రాకపోతే వారి కార్యకలాపాలు దెబ్బతింటాయి. మానవ వనరులకు సంబంధించిన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది’’ అని ఇమిగ్రేషన్‌ డాట్‌ కామ్‌ మేనేజింగ్‌ అటార్నీ రాజీవ్‌ ఖన్నా ఆందోళన వ్యక్తం చేశారు. నిషేధం ప్రభావం భారతీయ నిపుణులపైనా పడుతుంది. అమెరికా ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017లో మంజూరు చేసిన 1.08 లక్షల హెచ్‌1బీ వీసాల్లో 67,815 (63ు) భారతీయులకే దక్కాయి. సాధారణంగా ఏటా దాదాపు 50-60 వేల మంది భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు దక్కుతాయి. తాజా ఆంక్షల వల్ల వీరందరూ నష్టపోయినట్లే!

Updated Date - 2020-06-24T06:55:39+05:30 IST