రుషికొండపై ప్రాజెక్టుదరఖాస్తు వెనక్కి!

ABN , First Publish Date - 2022-09-07T08:12:15+05:30 IST

రుషికొండపై ప్రాజెక్టుదరఖాస్తు వెనక్కి!

రుషికొండపై ప్రాజెక్టుదరఖాస్తు వెనక్కి!

నిర్మాణ ప్లాన్‌పై 11 అభ్యంతరాలు

టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో ఏకీభవించిన కమిషనర్‌ లక్ష్మీశ

వాటిని నివృత్తి చేయాలని దరఖాస్తుదారుకు ఆదేశం

అంతవరకూ షార్ట్‌ ఫాల్‌లో దరఖాస్తు


విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రుషికొండపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) సమర్పించిన ప్లాన్‌ దరఖాస్తుపై మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ 11 అభ్యంతరాలను వ్యక్తంచేశారు. వాటిని నివృత్తి చేయాలంటూ  దరఖాస్తును షార్ట్‌ ఫాల్‌లో పెట్టారు. రుషికొండపై సర్వే నంబర్లు 19/1, 192, 19/3, 19/4లో 2,81,861.28 చదరపు మీటర్లలో భవన నిర్మాణాల కోసం ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ తరఫున కె.రమణ అనే వ్యక్తి జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు భవన నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. దరఖాస్తుదారు సమర్పించిన పత్రాలను పరిశీలించాక 11 అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దరఖాస్తును జీవీఎంసీ కమిషనర్‌కు సోమవారం పంపించారు. దీనిని పరిశీలించిన కమిషనర్‌.. టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అభ్యంతరాలతో ఏకీభవించారు. దరఖాస్తుదారు భవన నిర్మాణాలకు ప్లాన్‌ జారీచేసేందుకు రూ.19,05,83,805 చెల్లించాల్సి ఉండగా.. అందులో రూ.19.05 కోట్లను ఐదేళ్లలో చెల్లించేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మిగిలిన రూ.83,805 చెల్లించినట్లు ఆన్‌లైన్‌లో రశీదు జారీకానందున దానిని సమర్పించాలని కమిషనర్‌ స్పష్టంచేశారు. ‘అలాగే ఫైర్‌ ఎన్‌వోసీ జారీ కోసం రూ.1,53,310 చెల్లించాలి. నిర్మాణాలు చేయాలని ప్రతిపాదించిన స్థలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమో ప్రకారం యాజమాన్య హక్కు పత్రాలను సవరించాలి. మురుగునీటి పారుదల, శుద్ధికి సంబంధించిన ప్లాంట్‌ (ఎస్‌టీపీ) ప్లాన్‌ను మాకు సమర్పించిన డ్రాయింగ్‌లో చూపించలేదు. భవన నిర్మాణాలు ప్రతిపాదిత స్థలంలో కాంటూర్‌ ప్లాన్‌ వివరాలను అందజేయాల్సి ఉంది. నిర్మాణ సమయంలో ఏదైనా ప్రమాద ం జరిగితే బీమా వర్తించేలా ఆ ల్‌ రిస్క్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని మాకు అందజేయాలి. పార్కింగ్‌ ప్రాంతాలు, డ్రైవ్‌ వేను సూచించేలా పార్కింగ్‌ ప్లాన్‌ అందజేయాలి. అలాగే ప్రతిపాదిత భవనంలో ప్లాన్‌లో పేర్కొ న్న విస్తీర్ణంలో పది శాతం బిల్టప్‌ ఏరియాను జీవీఎంసీ పేరున రిజిస్ర్టేషన్‌ చేసి, ఆ పత్రాలతోపాటు అఫిడవిట్‌ను అందజేయాలి. భవన నిర్మాణాల ప్రతిపాదిత స్థలంలో గతంలో ఉన్న భవనాలను కూల్చివేయడం వల్ల వచ్చిన 98,882 టన్నుల వ్యర్థాల నిర్వహణ చార్జీల కింద రూ.80,57,751 చెల్లించాలి. అలాగే తాజాగా చెల్లించిన ఆస్తి పన్ను రశీదుతోపాటు గనుల శాఖ నుంచి ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం ఎన్‌వోసీ తీసుకుని అందజేయాలి’ అని అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటితోనూ కమిషనర్‌ ఏకీభవిస్తూ సోమవారం రాత్రే దరఖాస్తును వెనక్కి పంపించేశారు.


ప్లాన్‌ లేకుండానే శరవేగంగా నిర్మాణాలు

అయితే జీవీఎంసీ నుంచి ప్లాన్‌ జారీ కాకుండానే రుషికొండపై శరవేగంగా నిర్మాణాలు సాగిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కొండను తొలిచేసి ప్లాన్‌ లేకుండానే నిర్మాణాలు చేపట్టారంటూ నగరానికి చెందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దీంతో పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు ఆగమేఘాల మీద ప్లాన్‌ కోసం జీవీఎంసీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. గతంలో రిసార్ట్స్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపడుతున్నట్లు హైకోర్టుకు తెలిపి.. కొత్తగా చదును చేసిన ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ప్లాన్‌ లేకుండా నిర్మాణాలు చేపట్టకూడదు. అయినప్పటికీ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి గత రెండు నెలలుగా పనులు కొనసాగిస్తుండడం గమనార్హం.

Updated Date - 2022-09-07T08:12:15+05:30 IST