ఆరుగాలం కష్టం...అమ్మబోతే నష్టం

ABN , First Publish Date - 2020-05-05T10:35:55+05:30 IST

ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆరుగాలం కష్టం...అమ్మబోతే నష్టం

మందకొడిగా కొనుగోళ్లు  

తాలు పేరిట కోత 

రైతన్నల ఆందోళనలు..నిరసనలు 

3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు అంచనా

ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 54,355 మెట్రిక్‌ టన్నులు

జిల్లా వ్యాప్తంగా 215 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రబీ ధాన్యం అమ్ముకోవడానికి పడరాని కష్టాలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు ధాన్యం సేకరణలో ఇబ్బందులకు గురి చేస్తుండడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యానికి నిప్పటించి నిరసనలు తెలుపుతున్నారు.  జిల్లాలో 215 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హమాలీల కొరత, తేమ, తాలు పేరిట కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది.


జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేశారు. 15 రోజులుగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లలో 54 వేల 345 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 10,139 మంది రైతుల నుంచి రూ.99.72 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా రైతులకు 15.12 కోట్లు మాత్రమే చెల్లించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేందుకు కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి పక్షాల నాయకులు రైతులకు అండగా నిలుస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. 


టవరెక్కి నిరసన  

కొనుగోలు కేంద్రాల్లో దోపిడీపై ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన ఎనిమిది మంది రైతులు సోమవారం సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాలు పేరిట మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తున్నట్లు చెబుతోందని, మిల్లర్లు తాలు పేరిట కోత విధిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో గ్రామంలో ఐదు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎం ఇర్ఫాన్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ హామీ ఇవ్వడంతో రైతులు సెల్‌ టవర్‌ దిగి వచ్చారు.  రైతులు పసుల వెంకటి , రాంరెడ్డి, దేవరాజ్‌, భూమయ్య, సంపత్‌, నాగరాజు, నారాయణ, రజనీకాంత్‌ ఉన్నారు. 


గంభీరావుపేటలో ఆందోళన 

గంభీరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డుపె ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరిట  మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఒకే రైస్‌మిల్‌కు అనుమతి ఇవ్వడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందన్నారు. అధికారులకు చెప్పినా పలితం లేక పోవడంతో ఆందోళనకు దిగామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై రవి అక్కడికి చేరుకొని  సమస్య పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.  ఆందోళనలో బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్‌, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-05-05T10:35:55+05:30 IST