ప్రాజెక్టులపై నీలినీడలు

ABN , First Publish Date - 2021-01-09T05:57:57+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టు పనులు ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. గడువు పెంచుతూ వస్తున్నా పనులు మాత్రం పూర్తికావడం లేదు. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఫ్లోరైడ్‌ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. ఇక శ్రీరాంసాగర్‌ కాల్వలు అధ్వానంగా మారాయి.

ప్రాజెక్టులపై నీలినీడలు

నిలిచిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులు

ముందుకు సాగని డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల ఎత్తుపెంపు

డెడ్‌‘లైన్‌’ దాటిన బీ.వెల్లెంల ప్రాజెక్టు ట్రయల్‌, డ్రైరన్‌

అధ్వానంగా శ్రీరాంసాగర్‌ ప్రధాన, ఉప కాల్వలు

ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టు పనులు ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు ఏళ్లుగా సాగుతున్నాయి. గడువు పెంచుతూ వస్తున్నా పనులు మాత్రం పూర్తికావడం లేదు. ఫలితంగా లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు, ఫ్లోరైడ్‌ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. ఇక శ్రీరాంసాగర్‌ కాల్వలు అధ్వానంగా మారాయి.


గడువులు ముగుస్తున్నా సాగని ప్రాజెక్టుల పనులు

దేవరకొండ: శ్రీశైలం సొరంగమార్గం(ఎ్‌సఎల్‌బీసీ), ఓపెన్‌కెనాల్‌, డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల ఎత్తుపెంపు ప్రాజెక్టుల నిర్మాణ పనులు గడువులు ముగుస్తున్నా ముందుకుసాగడంలేదు. సొరంగమార్గం 2010 నాటికి పూర్తికావాలన్నది లక్ష్యం. నాటి నుంచి ఎన్నోమార్లు ఈ గడువును పెంచినా పనులు లక్ష్యం నెరవేరలేదు.  నిధుల కొరత, టన్నెల్‌ బేరింగ్‌ యంత్రం తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో సొరంగమార్గం పూర్తికావడం లేదు. మొత్తం 43.93కి.మీ సొరంగానికి ఇప్పటి వరకు 33.35 కి.మీ పూర్తయింది. ఇంకా 10.625కి.మీ తవ్వాల్సి ఉంది. రూ.1925కోట్లకు రూ.1600 కోట్ల మేర పనులు జరిగాయి. ప్రాజెక్టుకు 2005లో శంకుస్థాపన చేయగా, 2010 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. 2011లో ఈ గడువును 2014కు పొడిగించారు. 2014లో మరోమారు 2017 నాటికి పెంచారు. ప్రత్యేక రాష్ట్రం అనంతరం ఈ గడువును 2021 నాటికి పెంచారు. ప్రస్తుతం టన్నెల్‌ బేరింగ్‌ యంత్రం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అందుకు నెల రోజుల సమయం పట్టవచ్చు.  ఇక డిండి ఎత్తిపోతల పథకాన్ని రూ.6500కోట్ల వ్యయంతో నిర్మిస్తుండగా, 2015లో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రెండున్నర ఏళ్లలో ప్రాజెక్టు పూర్తిచేయాలన్నది లక్ష్యం. అయితే నిర్వాసితులకు భూపరిహారం ప్రక్రియ పూర్తికాకపోవడంతో వారు తరచూ పనులను అడ్డుకుంటున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడెం, చింతపల్లి, కిష్టరాయన్‌పల్లి, గొట్టిముక్కల, సింగరాజుపల్లి, ఉల్పర, గోకారం, ఇర్విన్‌  రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటిలో చర్లగూడెంలో 12 టీఎంసీలు, కిష్టరాయన్‌పల్లిలో 5.7టీఎంసీల రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. వీటి లో గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్‌ పనులు 80 శాతం పూర్తికాగా, మిగతా రిజర్వాయర్ల పనులు 40 నుంచి 50 శాతం మాత్రమే జరిగాయి. ఈ రిజర్వాయర్ల పరిధిలో వేల ఎకరాలు, పలు గ్రామాలు ముంపునకు గురవుతుండగా, నిర్వాసితులకు పరిహారంతోపాటు, పునరావాసం కల్పించాల్సి ఉంది. దీంతో నిర్వాసితులు తరచూ పనులు అడ్డుకుంటుండటంతో రిజర్వాయర్ల నిర్మాణంలో జాప్యంచోటుచేసుకుంటోంది. ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్‌, పెండ్లిపాకల పనులను 2014లో ప్రారంభించగా, ఇప్పటి వరకు 30శాతం కూడా పూర్తికాలేదు.


అధ్వానంగా శ్రీరాంసాగర్‌ కాల్వలు

అర్వపల్లి: శ్రీరాంసాగర్‌ రెండోదశ 69, 70, 71 డీబీఎం ప్రధాన, ఉపకాల్వలు అఽధ్వానంగా మారాయి. 15 ఏళ్ల క్రితం 70డీబీఎం ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్‌ నిర్మించారు. నాగారం మండలం మామిడిపల్లి సమీపంలో ఈ సీసీ లైనింగ్‌ పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంత ఏర్పడ్డాయి. పర్సాయపల్లి, డికొత్తపల్లి సమీపంలోని 71 డీబీఎం కట్ట కిలోమీటరు మేర వర్షాలకు కొట్టుకుపోయింది. గుంతలమయమైన ఈ కట్టపై నుంచి వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ప్రధాన కాల్వకు ఉన్న 7ఆర్‌, 1ఆర్‌, 11ఆర్‌ ఉపకాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లేక 30శాతం నీరు వృథాగా పోతోంది.

కాల్వల నుంచి నీరొచ్చేదెలా?

69డీబీఎం ప్రధానకాల్వ పరిధిలో తుంగతుర్తి, నూతన్‌కల్‌, మద్దిరాల మండలాల్లో 200చెరువులు, కుంటలు ఉండగా, 60572 ఎకరాల ఆయకట్టు ఉంది. 70డీబీఎం కింద తిరుమలగిరి, నాగారం మండలాల్లో 42 చెరువులు, కుంటలు ఉండగా, ఆయకట్టు కింద 7175ఎకరాలు ఉన్నాయి. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 71డీబీఎం ప్రధాన కాల్వ అత్యధికంగా విస్తరించి ఉంది. ఈ కాల్వ కింద 314చెరువులు ఉండగా 1,44,276 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కానీ అయితే ఉప కాల్వలు అస్తవ్యస్తంగా మారి చెరువుల్లోకి నీరు చేరడం లేదు. దీంతో రైతులు ఏటా శ్రీరాంసాగర్‌ నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 70డీబీఎం ప్రధాన కాల్వ కింద ఉపకాల్వల పనులు ఇంతవరకు పూర్తి కాలేదు. ఇదే కాల్వ కింద తుంగతుర్తి మండలం, వెల్గుపల్లి, పర్సాయపల్లి, డి.కొత్తపల్లి మధ్య రుద్రమ్మ చెరువు ఉంది. దీన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు పునర్జీవన పథకం కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. కాల్వల మరమ్మతు, సీసీ లైనింగ్‌, తూముల ఏర్పాటుకు రూ.220కోట్ల నిధులు మంజూరైనా టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో శ్రీరాంసాగర్‌ రెండోదశ ప్రధాన, ఉపకాల్వలు మరమ్మతులకు నోచుకోవడంలేదు. కాల్వల పునరుద్ధరణ పనులు రెండేళ్లుగా నిలిచాయి.

గోదావరి జలాల విడుదలతో నిలిచిన మరమ్మతులు

సూర్యాపేట జిల్లాలో శ్రీరాంసాగర్‌ రెండోదశ ఆయకట్టు పరిధిలోని 600 చెరువులకు నాలుగు నెలల పాటు గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు. దీంతో రబీ సీజన్‌లో కూడా కాల్వల మరమ్మతుకు అవకాశం లేకుండాపోయింది. పునర్జీవన పథకం కింద విడుదలైన నిధులతో వచ్చే వేసవిలో అయినా కాల్వల మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


ఏళ్లుగా పూర్తికాని బీ.వెల్లెంల ప్రాజెక్టు

నార్కట్‌పల్లి: బీ.వెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులు పలు కారణాలతో ముందుకుసాగడం లేదు. రూ.699కోట్ల అంచనా వ్యయంతో: ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాన్ని నార్కట్‌పల్లి మండలంలోని బీ.వెల్లెంల, చౌడంపల్లి గ్రామాల వద్ద నిర్మిస్తున్నారు. ఇది ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగం కాగా, 2007లో ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్‌ శంకుస్థాపన చేశారు. అయితే ప్రాజెక్టు డీపీఆర్‌లో మార్పుల కారణంగా అంచనా వ్యయం రూ.483.94కోట్లకు తగ్గింది. ఈ ఎత్తిపోతల ద్వారా నల్లగొండ, నకిరేకల్‌, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల పరిధిలో 1లక్ష 27ఎకరాల ఆయకట్టుతో పాటు 107 గ్రామాలకు ఫ్లోరైడ్‌ రహిత తాగునీటిని అందించడం లక్ష్యం. 0.305 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరందించాల్సి ఉంది. అయితే తొలి దఫా ఎడమ కాల్వ ద్వారా నీరందించే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ కాల్వపై పలు చోట్ల బ్రిడ్జీలు నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే పానగల్‌ రిజర్వాయర్‌ నుంచి 6.9కి.మీ పొడవున అప్రోచ్‌ కాల్వ పూర్తయింది. అక్కడి నుంచి 10.625 కి.మీల మేర సొరంగం తవ్వకం పలు ఆటంకాల నడుమ పూర్తిచేయగా, దీని రూఫ్‌ సీసీ పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 3కి.మీ మేర టన్నెల్‌ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా భూ సేకరణ సమస్యగా మారింది. మొత్తం 3864 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 1379ఎకరాలు మాత్రమే సేకరించారు. కుడి, ఎడమల కాల్వల ద్వారా నీటిని మళ్లించేందుకు అవసరమైన 1335 ఎకరాల భూమిలో 299 ఎకరాల సేకరణ పూర్తయింది. భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, కోర్టు కేసుల కారణంగా పనులు ముందుకు సాగడంలేదు. ప్రాజెక్టులో ప్రధాన విభాగమైన విద్యుత్‌ వ్యవస్థ కోసం 35ఎకరాల్లో 220కేవీ స్విచ్‌ యార్డ్‌ను నిర్మించారు. 91.70మీటర్ల లోతులో ఉన్న సర్జ్‌పూల్‌లోని నీటిని ఎత్తిపోసేలా రెండు మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. పంప్‌హౌస్‌లో కంట్రోల్‌ ప్యానెల్‌ను సిద్ధం చేసినా  డ్రైరన్‌ చేయలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయంతో పోల్చితే సుమారు రూ.250 కోట్లకు పైగా నిధులు కావాల్సి ఉంది. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచాయి.

Updated Date - 2021-01-09T05:57:57+05:30 IST