అమెరికా హామీ!

ABN , First Publish Date - 2020-06-27T06:17:48+05:30 IST

భారత్‌ సహా పలు ఆసియాదేశాలను చైనా నుంచి రక్షించడానికి తమ అంతర్జాతీయ బలగాలను తరలిస్తానని అమెరికా అంటున్నది. భారత్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా...

అమెరికా హామీ!

భారత్‌ సహా పలు ఆసియాదేశాలను చైనా నుంచి రక్షించడానికి తమ అంతర్జాతీయ బలగాలను తరలిస్తానని అమెరికా అంటున్నది. భారత్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు చైనా సైన్యంనుంచి ముప్పుపెరుగుతున్న నేపథ్యంలో, వాటిని రక్షించాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు అమెరికా విదేశాంగమంత్రి మైక్‌పాంపియో. జర్మనీ స్థావరంగా ఉన్న అమెరికా బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ మాటలు అన్నప్పటికీ, యూరప్‌లో మోహరించిన తమ బలగంలో కొంత ఆసియాకు తరలించే ఆలోచన అమెరికా గట్టిగా చేస్తున్నదనే అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బలగాలను ఎప్పటికప్పుడు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా మోహరిస్తామన్న పాంపియో వ్యాఖ్యలపై భారత్‌ ప్రత్యేకంగా స్పందించిందేమీ లేదు. 


చైనాతో సరిహద్దు వివాదంలో మునిగిన భారత్‌కు ఈ కష్టకాలంలో, పాంపియో వ్యాఖ్యలు ఎంత భరోసానిస్తాయన్నది అటుంచితే, నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనాతో ఘర్షణ ఎంత పెరిగితే అంత మేలు. అమెరికా చైనాల మధ్య ఇంతవరకూ సాగుతున్న వాణిజ్య యుద్ధాలు, కరోనా కయ్యాలకు ఈ మిలటరీ మోహరింపులు కూడా తోడై ఉద్రిక్తతలు హెచ్చితే, డెమోక్రాటిక్‌ పార్టీని సునాయాసంగా ఆత్మరక్షణలోకి నెట్టేయవచ్చు, జో బిడెన్‌ను మట్టికరిపించవచ్చు. సరిహద్దులో పరిస్థితులు సానుకూలంగా లేని స్థితిలో అమెరికా ఇలా ముందుకు రావడం భారత్‌కు ఊరటనిచ్చే విషయమే. గల్వాన్‌ ఘాతుకంలో ఇరవైమంది సైనికులను కోల్పోయిన స్థితిలో అమెరికా స్పందన అంతమాత్రంగానే ఉండటం, మన పక్షం వహించి చైనాను ఘాటుగా విమర్శించకపోవడం భారత్‌కు కష్టం కలిగించింది. అదే సమయంలో హెచ్‌౧బీ వీసా వ్యవస్థ రద్దుతో, పలు ఉద్యోగ అనుమతులపై ఆంక్షలతో భారత్‌నే ట్రంప్‌ ప్రధానంగా దెబ్బతీశారు. హ్యూస్టన్‌, అహ్మదాబాద్‌ సభలతో మోదీ ట్రంప్‌లు తమ మైత్రిని కొత్తపుంతలు తొక్కిస్తున్నా, భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీసే కఠిన నిర్ణయాలకు ట్రంప్‌ వెనకంజ వేయడం లేదు. ఆయన నిర్ణయాలన్నీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగానే ఉంటాయి. 


గతంలో కశ్మీర్‌ విషయంలోనూ, గత నెల లద్దాఖ్‌ గొడవలోనూ మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ముందుకు వచ్చినప్పుడు భారత్‌ సున్నితంగా తిరస్కరించింది. ద్వైపాక్షిక సమస్యలను సాధ్యమైనంత వరకూ శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. మధ్యవర్తులంటే ఉభయులకూ ఆమోదయోగ్యమైనవారు కావాలి కానీ, వారిలో ఒకరిపట్ల శత్రుత్వాన్ని చూపేవాడు మధ్యవర్తి కాలేడు. అప్పుడు పరిష్కర్తగా మధ్యవర్తిగా ఉంటానన్నవారే ఇప్పుడు రక్షకుడి అవతారమెత్తుతానని అంటున్నారు. ట్రంప్‌ మాటలు, అమెరికా చేష్టలు అర్థం చేసుకోలేనివేమీ కావు. భారత్‌–చైనా సరిహద్దు ఘర్షణను ఆసరా చేసుకొని ఆసియాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనీ, ప్రయోజనాలు పరిరక్షించుకోవాలని అమెరికా చూస్తున్నది. ఆర్థిక, వాణిజ్య, సైనికపరమైన చర్యలతో చైనాను దెబ్బతీయడం కోసం భారత్‌ను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. భారత్‌–చైనా సరిహద్దు వివాదంలో అమెరికా వచ్చి ఉద్రిక్తతలు పెంచడం తప్ప చల్లార్చగలిగేదేమీ ఉండదు. చైనా దూకుడుకు ముకుతాడు వేయాలన్న తాపత్రయంలో అమెరికాకు పెద్దపీట వేసి మరింత నష్టపోకుండా జాగ్రత్తపడటం అవసరం. స్వప్రయోజనాల పరిరక్షణే తప్ప, కష్టకాలంలో సైతం భారత్‌ను ఆదుకున్న చరిత్ర అమెరికాకు లేదు. ఈ కారణంగానే, రష్యాతో మరింత సన్నిహితంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇటీవలి భారత్‌–రష్యా–చైనా త్రైపాక్షిక చర్చలు, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా పర్యటన ఈ దిశగా ఉపకరించేవే. రష్యా నేరుగా చైనాకు వ్యతిరేకంగా, మన పక్షాన వకల్తా పుచ్చుకోకపోవచ్చు. కానీ, రెండేళ్ళక్రితం ఒప్పందం కుదర్చుకున్న ఎస్‌–400 క్షిపణుల్లో కొన్నింటిని రాజ్‌నాథ్‌ సింగ్‌ విజ్ఞప్తి మేరకు మూడునెలల్లో అందచేస్తానని హామీ ఇచ్చింది. చైనాతో ఘర్షణల నేపథ్యంలో, మనకు విశ్వసనీయమైన, శాశ్వత మిత్రుడని చెప్పుకోగలిగే రష్యా నుంచి పొందగలిగే ప్రయోజనమే ఎక్కువ. అంతర్జాతీయంగా మిత్రులను కోల్పోతున్న చైనాకు రష్యా ఎంతో అవసరం. చైనాకు ముకుతాడు వేయడానికి రష్యా మనకు ముఖ్యం.

Updated Date - 2020-06-27T06:17:48+05:30 IST