వెళ్ళిపోవద్దంటూ... లక్షమందికి పదోన్నతులు...

ABN , First Publish Date - 2022-01-13T22:09:12+05:30 IST

'గ్రేట్ రిజిగ్నేషన్' అనేది ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన పదం. 'బిగ్ క్విట్' అని కూడా ఈ పరిస్థితిని వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు... స్వచ్చంధంగా రాజీనామాను సమర్పించడమే ‘గ్రేట్ రిజిగ్నేషన్’. రెండున్నరేళ్ళ క్రితం... 2019 లో మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆంథోని కియోట్జ్ నండి గ్రేట్ రిజిగ్నేషన్

వెళ్ళిపోవద్దంటూ... లక్షమందికి పదోన్నతులు...

బెంగళూరు : 'గ్రేట్ రిజిగ్నేషన్' అనేది ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన పదం. 'బిగ్ క్విట్' అని కూడా ఈ పరిస్థితిని వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులు... స్వచ్చంధంగా రాజీనామాను సమర్పించడమే ‘గ్రేట్ రిజిగ్నేషన్’. రెండున్నరేళ్ళ క్రితం... 2019 లో మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ ఆంథోని కియోట్జ్ నండి గ్రేట్ రిజిగ్నేషన్  ప్రారంభమైందని చెబుతారు. ఇప్పుడు భారత్‌లోనూ... ఐటీ రంగంపై ఈ ప్రభావం కనిపిస్తోంది. పదోన్నతులు, లేదా అధిక వేతనాల కోసం... ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీల్లో రాజీనామాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో కూడా గ్రేట్ రిజిగ్నేషన్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రత్యేకించి... ఐటీ రంగం తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర దిగ్గజ కంపెనీలు కూడా గ్రేట్ రిజిగ్నేషన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో... ఉద్యోగులను కాపాడుకునేందుకు ఆయా కంపెనీలు శతవిధాలా యత్నిస్తున్నాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


టీసీఎస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నాటికి, అంటే... తొమ్మిది నెలల కాలంలో 77 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. అంతకుముందు పూర్తి ఏడాదితో పోల్చినా ప్రస్తుత తొమ్మిది నెలల కాలంలో ఫ్రెషర్ల నియామకం చాలా ఎక్కువగానే ఉందని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో... ఉద్యోగులను కాపాడుకునేందుకు సంస్థ పలు చర్యలను చేపట్టింది. 'పదోన్నతులనివ్వడంతో పాటు విదేశీ అవకాశాలను కల్పించడం, 1.10 లక్షల మందికి పదోన్నతులనివ్వడం వంటి చర్యల ద్వారా... కంపెనీ తన ఉద్యోగులను అట్టిపెట్టుకోగలిగిందని, తద్వారా సమస్యలను అధిగమించిందని' పేర్కొన్నారు. కాగా... ఈ క్రమానికి సైంబంధించి మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ భారీ ఆట్రిషన్‌ను ఎదుర్కొంటున్నాయి. గత కొంతకాలంగా అధిక ఆట్రిషన్, లేదా... ఉద్యోగుల వలసల రేటును ఎదుర్కొంటున్న ఇన్ఫోసిస్ డిసెంబరు  త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితినెదుర్కొంది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఈ కంపెనీ ఆట్రిషన్ రేటు 20.1 శాతంగా ఉండగా,  ఇప్పుడు 25.5 శాతానికి పెరిగింది. ఇక గత మూడు నెలల్లో టీసీఎస్ ఉద్యోగుల వలసల రేటు 15.3 శాతంగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో 11.9 శాతంగా ఉంది. ఇక... విప్రో ఆట్రిషన్ రేటు కూడా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో 20.5 శాతంగా ఉన్న ఆట్రిషన్ రేటు డిసెంబరు త్రైమాసికం నాటికి 22.7 శాతానికి పెరిగింది.


అడ్డుకట్ట వేసేందుకు.. 

వలసలకు అడ్డుకట్ట వేసేందుకు టీసీఎస్ కంపెనీ గడిచిన తొమ్మిది నెలల్లో 1.10 లక్షల మంది ఉద్యోగులకు పదోన్నతులనిచ్చింది. మార్చిలోగా మరో 40 వేల మందికి పదోన్నతులనివ్వనున్నట్లు వెల్లడించింది. విప్రో, ఇన్ఫోసిస్ తదితర సంస్థలు కూడా దాదాపు అదే దారిలో నడిచాయి. మొత్తంమీద గత కొంత కాలంటా ఐటీ కంపెనీ నిపుణుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ముందుచూపుతో ఎక్కువ మంది ఫ్రెషర్స్‌ను తీసుకొన్న కొన్ని సంస్థలు... వారికి శిక్షణనిస్తున్నాయి. 

Updated Date - 2022-01-13T22:09:12+05:30 IST