ఆంక్షల మధ్య ప్రచారం

ABN , First Publish Date - 2022-01-18T08:07:50+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలలో ప్రచార పద్ధతుల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని నియంత్రణలను విధించింది. కొవిడ్ తీవ్రవ్యాప్తి రీత్యా, బహిరంగసభలు...

ఆంక్షల మధ్య ప్రచారం

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలలో ప్రచార పద్ధతుల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని నియంత్రణలను విధించింది. కొవిడ్ తీవ్రవ్యాప్తి రీత్యా, బహిరంగసభలు, ర్యాలీలు జరపరాదని కమిషన్ ఆదేశించింది. జనవరి 22 దాకా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, సమీక్ష తరువాత ఆంక్షల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని కమిషన్ చెప్పింది.  కొవిడ్ పరిస్థితుల కారణంగా ఆంక్షలు విధించినప్పుడు మరో వారం రోజులలో సడలింపు ఇచ్చేంత మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ నెలాఖరు దాకా ఇవే నియంత్రణలు అమలులో ఉంటే, ఎన్నికల ప్రచారం పెద్ద సందడి లేకుండా ఉండే అవకాశం ఉన్నది. అందువల్ల  రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ చేయనక్కరలేదు కానీ,  ఒమైక్రాన్ విజృంభణ నేపథ్యంలో, ఎన్నికలను ప్రస్తుతం ప్రకటించిన తేదీలలో జరపవలసిన అవసరం ఉన్నదా, మరి కొంత ముందుకు జరిపే   అవకాశం లేదా,   ఒకే షెడ్యూలులో కాకుండా,  పదవీకాలం ముగిసిపోయే రాష్ట్ట్రాలకు ముందు జరిపి, వ్యవధి ఉన్నవాటికి కొంత సమయం తరువాత నిర్వహిస్తే కుదిరేది కాదా- వంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకపోలేదు. కానీ, ఎన్నికలు ఇట్లాగే జరపడంలో ఇబ్బందేమీ లేదని కమిషన్ గట్టిగా సమర్థించుకున్నది. ఎన్నికల ప్రకటనతో పాటే ఆంక్షలను, నియమాలను కూడా ప్రకటించింది. నామినేషన్ పత్రాలు వేయడానికి అభ్యర్థితో పాటు ఎందరు ఉండవచ్చునో చెప్పింది. ఫలితాల అనంతరం విజేతల ఊరేగింపులను కూడా ముందుగానే నిషేధించింది.   ఆ సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రను విలేఖరులు అనేక ప్రశ్నలు అడిగారు. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంటుకు సమర్పిస్తున్నప్పుడు, అయిదు రాష్ట్రాల ఎన్నికల రీత్యా సమస్య వచ్చే అవకాశం లేదా అన్న ప్రశ్నను సుశీల్ చంద్ర తోసిపుచ్చారు. ఎన్నికలు జరుగుతున్నది ఐదు రాష్ట్రాలలో మాత్రమేనని, బడ్జెట్ యావత్ దేశానికి  సంబంధించినదని ఆయన వివరణ ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమే కానీ, ఎన్నికల రీత్యా కేంద్రబడ్జెట్‌లో ప్రత్యక్షం కాబోయే జనాకర్షక పథకాలు, నిర్ణయాల గురించి మీడియా వరుస కథనాలను ఇస్తూనే ఉన్నది. ఎన్నికల సంఘానికి పక్షపాతాలను అంటగట్టడం ఏమంత ఆరోగ్యకరం కాదు కానీ,  ఎటువంటి విమర్శ లకు ఆస్కారం ఇవ్వకుండా కమిషన్ వ్యవహరించవలసి ఉన్నది.


కొవిడ్ నిబంధనల విషయంలో కూడా ఎన్నికల కమిషన్  ఆలోచనలు హేతుబద్ధంగా లేవు. ర్యాలీలు, ఊరేగింపులు వద్దన్నప్పుడు, సమావేశ మందిరాల్లో 300 మందికి మించకుండా సభలు జరుపకోవచ్చుననడంలో ఔచిత్యమేమిటి? జనసందోహాన్ని నియంత్రించగలిగితే, ఆరుబయట జరిగే కార్యక్రమాలే నిజానికి సురక్షితం. వాహనాలతో జరిపే ర్యాలీలు అయితే, ఎడం కూడా పాటించడానికి వీలయినవి. చిన్న హాలులో 300 మందితో సభ పెడితే, అది ఎంతటి ప్రమాదకరం? అది ఏసీ హాలు అయితే, ఇక చెప్పనక్కరలేదు. అన్ని రకాల సమావేశాలను నిషేధించి, కేవలం డిజిటల్ ప్రసంగాలను మాత్రమే అనుమతిస్తే, అదొక పద్ధతి. పదవులలో, అధికారంలో ఉన్న నాయకులు చేసే డిజిటల్ ప్రసంగాలకు ఎక్కువ వ్యాప్తి, మీడియాలో ఎక్కువ చోటు దొరికి ఇతరులకు అన్యాయం జరుగుతుంది. స్థానిక అభ్యర్థుల ప్రచారానికి, భౌతికంగా జరిపే సమావేశాలే కీలకం. క్షేత్రస్థాయిలో ప్రచార సరళులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్   నియంత్రణలను విధించి ఉండవలసింది. బహిరంగంగా జరిపే సభలయినా, పరిమిత సమీకరణతో, భౌతికమయిన దూరంతో జరిగేట్టు నిబంధనలు విధించి, వాటి పర్యవేక్షణకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం మెరుగైన పద్ధతి. 


ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లలో రాజకీయ పోటీ తీవ్రంగా ఉన్నది. అయితే అందరి దృష్టీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్ మీద కేంద్రీకృతమై ఉన్నది. ఇంకా రెండేళ్లలో జరిగే సాధారణ ఎన్నికలకు ఇది సన్నాహక పోరాటంగా పరిశీలకులు భావిస్తున్నారు.  యుపి రంగస్థలంలో మతం, కులం రెండూ కీలక అస్త్రాలుగా మారనున్నాయి. ప్రజలు వివేచనతో ఓటు వేయాలంటే, ప్రచారపర్వంలో రాజకీయ సంభాషణ బలంగా జరగాలి. పోటాపోటీగా పార్టీలు, అభ్యర్థులు చేసే వాదనల నుంచి  ఓటర్లు తమ ఎంపికను తీర్చిదిద్దుకుంటారు. ప్రచారం నీరసంగా జరిగితే, అది యథాతథ పరిస్థితికే మేలు చేస్తుంది. కొవిడ్ కష్టకాలంలో, అనేక పరిమితుల మధ్యవివిధ రాజకీయ పక్షాలు తమ గొంతును బలంగా ఎట్లా వినిపిస్తాయన్నది ఆసక్తికరం కానున్నది.


Updated Date - 2022-01-18T08:07:50+05:30 IST