Abn logo
Sep 26 2021 @ 01:25AM

కొద్దిగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తి!

  • గత ఏడాదితో పోలిస్తే రూ.22 లక్షలు పెరుగుదల


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ప్రధాని మోదీ ఆస్తి కాస్త పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌ గణాంకాల ప్రకారం గత ఏడాది రూ.2.85 కోట్లుగా ఉన్న మోదీ సంపద రూ.3,07,68,885కి చేరింది. అంటే రూ.22 లక్షలు పెరిగింది. మోదీ సమర్పించిన డిక్లరేషన్‌ ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆయన బ్యాంకు బ్యాలెన్సు రూ.1.5 లక్షలు, నగదు రూ.36 వేలు ఉంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఎస్‌బీఐలో ఆయన చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వల్లే ఆస్తి పెరిగింది. మార్చి 31, 2021 నాటికి మోదీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.1.86 కోట్లు. ఇది గత ఏడాది రూ.1.60 కోట్లు. స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌లో మోదీకి ఎలాంటి పెట్టుబడులు లేవు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లో రూ.8,93,251 పెట్టుబడి పెట్టారు. జీవితబీమా పాలసీలు రూ.1,50,957కి ఉన్నాయి. ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌లో 2012లో రూ.20 వేలు పెట్టుబడి పెట్టారు. రూ.1.48 లక్షల విలువైన 4 బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం చరాస్తి రూ.1.96 కోట్లు. మోదీ పేరిట ఎలాంటి వాహనమూ లేదు. లోన్లు, అప్పులు కూడా లేవు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మోదీ మరో ముగ్గురితో కలిసి 2002లో తాను సీఎం కావడానికి 2 నెలల ముందు ఒక ప్లాట్‌ కొన్నారు. దానిపై రూ.2.47 లక్షల పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు దాని విలువ రూ.1.10 కోట్లకు చేరింది.