ఆస్తి రహస్యాలు

ABN , First Publish Date - 2021-10-06T06:29:44+05:30 IST

సంపన్నులు, రాజకీయనాయకులు, దేశాధినేతలు తాము సంపాదించిన సొమ్మును ఏ విధంగా విదేశాల్లో రహస్యంగా దాచిపెట్టారో ఐదేళ్ళక్రితం పనామా పేపర్స్‌ ప్రపంచానికి తెలియచెప్పింది....

ఆస్తి రహస్యాలు

సంపన్నులు, రాజకీయనాయకులు, దేశాధినేతలు తాము సంపాదించిన సొమ్మును ఏ విధంగా విదేశాల్లో రహస్యంగా దాచిపెట్టారో ఐదేళ్ళక్రితం పనామా పేపర్స్‌ ప్రపంచానికి తెలియచెప్పింది. ఇప్పుడు మరింత లోతైనశోధనతో అత్యంత సంక్లిష్టమైన అంశాలను సైతం ఛేదించి పండోరా పత్రాలు అనేకరెట్ల సమాచారాన్ని బహిర్గతం చేశాయి. జోర్డన్‌రాజు లండన్‌ పెట్టుబడులనుంచి టోనీబ్లెయిర్‌ స్టాంప్‌డ్యూటీ ఎగవేతవరకూ, వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితురాలు మొనాకోలో ఇంద్రభవనాన్ని కొనుగోలు చేసిన వార్త నుంచి, అనేకదేశాల అధినేతలు పన్ను ఎగవేతకు స్వర్గధామాలంటున్న దేశాల్లో ఎన్ని ఆస్తులను కొన్నారో ఈ పత్రాలు బహిర్గతం చేశాయి. నిన్నగాక మొన్న నిరుపేదనంటూ, అప్పుకట్టలేనంటూ న్యాయస్థానం ముందు మొరబెట్టుకున్న అనీల్‌ అంబానీకి సైతం పద్దెనిమిది దేశాల్లో పదివేలకోట్ల రూపాయలమేర రహస్య ఆస్తులున్నట్టు ఈ పత్రాల్లో తేలింది. నీరవ్‌ మోదీ సోదరి వద్ద మన ప్రభుత్వానికి 17కోట్లు మాత్రమే దొరకవచ్చును కానీ, ఆయన విదేశాలకు తరలిపోయేముందు ఆమెకు అంతకు పదింతల మొత్తాన్ని బదలాయించాడని పండోరా పలుకుతోంది. 


ఎప్పటిలాగానే ఇప్పుడూ చాలాదేశాలు దర్యాప్తునకు ఆదేశించాయి. అవినీతిని సహించేది లేదని పాలకులు భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఎవరు ఎంత దోచారు, దాచారు అన్నది అటుంచితే, ఎంత సంపాదించినా దాహం తీరని కుబేరులు తమ దేశానికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని సైతం ఎగవేయడానికి నిస్సిగ్గుగా సిద్ధపడుతున్నారు. అందుకు వీలుగా ఒక అక్రమలావాదేవీల వ్యవస్థ ఒకటి వారు దోచేస్తున్న ప్రతీరూపాయినీ అడ్డదారిలో కాపాడుకొస్తున్నది. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామాలంటున్న దేశాల్లో ఉన్న చట్టాలు, నిబంధనల వల్ల ఎంతటి అక్రమాన్ని అయినా సక్రమం చేయగలిగే ఈ ప్రక్రియ నిజానికి యావత్‌ ప్రపంచానికీ అవమానకరం. కొన్ని దేశాలు అవినీతి అంటున్నదానికి మరికొన్ని దేశాలు తెల్లరంగు వేసి, అపర కుబేరులూ, బడా కంపెనీలకోసం ఒక పన్ను ఎగవేత వ్యవస్థను కొనసాగించడం విషాదం. కరోనా లక్షలాదిమంది ప్రాణాలు తీసింది, అన్ని దేశాల ఆర్థికవ్యవస్థలూ కుదేలై పేదలు నిరుపేదలుగా మారిపోయిన ఈ స్థితిలో కూడా కుబేరులకోసమంటూ మరో ప్రపంచం మనచుట్టూనే ఉన్నదని పండోరా తేల్చిచెప్పింది. కార్పొరేట్‌ టాక్సులు, వ్యక్తిగత పన్ను ఎగవేతల వల్ల అన్నిదేశాల ప్రభుత్వాలు ఏటా దాదాపు 400 బిలియన్‌ డాలర్లమేరకు నష్టపోతున్నాయని ఇటీవలే ఓ సంస్థ లెక్కకట్టింది. మనీలాండరింగ్‌మీద ఉక్కుపాదం మోపుతున్నట్టు బ్రిటన్‌ చెబుతూంటుంది కానీ, అది తలుచుకుంటే ఈ పండోరా వెలుగులోకి తెచ్చిన రహస్యాల్లోనే తన పరిధిలోకి వచ్చే మూడోవంతు లావాదేవీలను నివారించగలదు. 


ఫిన్సెన్‌ ఫైల్స్‌, ప్యారడైజ్‌ పేపర్స్‌, పనామా పేపర్స్‌, లక్స్‌లీక్స్‌ వంటి పేర్లతో గతంలో అనేక రహస్యపత్రాలు వేలకోట్ల రూపాయల కుంభకోణాలను బయటపెట్టాయి. ఇప్పుడు ఐసీఐజే మరింత భారీ సమాచారంతో కూడిన ఈ పండోరా బాక్స్‌ తెరిచి ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుదుపు తాత్కాలికమే. అధికారంలో ఉన్నవారు అగ్రహంతో ఊగిపోతున్నట్టు కనిపించడం, ఆ తరువాత విచారణలు, దర్యాప్తుల పేరిట మరికొంతకాలం గడిచిపోవడంతో అంతా చల్లారిపోవచ్చు. అయినప్పటికీ, ఈ అక్రమలావాదేవీలు, రహస్యస్థావరాలు, పన్ను ఎగవేతలకు సంబంధించి అప్పుడప్పుడైనా ఇలా రచ్చజరుగుతున్నందువల్లనే ఇటీవల 130 దేశాలు కనీస కార్పొరేట్‌ టాక్స్‌ను 15శాతం చేయాలని సంకల్పించాయి. బహుళజాతి కంపెనీలు పన్ను ఎగవేతకు వీలుగా తమ లాభాలను తరలించకుండా అడ్డుకొనే చర్యలకూ పునాది పడింది. అపరకుబేరుల ఆస్తిరహస్యాలు బయటపడినప్పుడల్లా సామాన్యుడిని ఉపశమింపచేయడానికి పాలకులు ఏవో దర్యాప్తులకు ఆదేశిస్తూనే ఉంటారు. అవి అంతిమంగా ఏమీ తేల్చవు, ఎవరినీ నొప్పించవు. ఆఫ్‌షోర్‌ కంపెనీలు, అత్యంత సంక్లిష్టమైన ట్రస్టుల్లో అక్రమ ఆర్జన భద్రంగానే ఉంటుంది. కానీ, ఆయా దేశాల్లోని ప్రజలకు తమ నాయకులు ఎంతగా దోచేస్తున్నది తెలిసొస్తుంది. దేశభక్తి, దేశాభిమానం వంటి మాటలతో, ప్రకటనలతో తమను ఉర్రూతలూగించేస్తున్న అభిమాన నటులు, క్రీడాకారులు వాటిని ఏమాత్రం ఆచరిస్తున్నారో అర్థమవుతుంది.

Updated Date - 2021-10-06T06:29:44+05:30 IST