టాక్స్‌ ఎటాక్‌!

ABN , First Publish Date - 2021-02-27T05:58:28+05:30 IST

నగర ప్రజలపై ఇక ఆస్తి పన్ను రూపంలో భారాలు మోపేందుకు పాలకులు సిద్ధమయ్యారు.

టాక్స్‌ ఎటాక్‌!

ఇక ఇంటి పన్ను పిడుగు! 

ఏప్రిల్‌ నుంచి ప్రజలపై రూ.334 కోట్ల వడ్డన 

రూ.500 కోట్ల ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం 

ప్రస్తుత వసూళ్ల విలువ రూ. 166 కోట్లు 

అద్దె విలువకు స్వస్థి.. ఆస్తి విలువే లెక్క

రిజిస్ర్టేషన్‌ ధరలతో పాటే ఇంటి పన్ను పెంపు 

ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుకు పది రెట్లు అధికం 

డ్రెయినేజీ, నీరు, చెత్తపై ‘యూజర్‌’ చార్జ్‌ 

అప్పుల కోసం కేంద్రానికి దాసోహం! 

కేంద్రం షరతుల మేరకే ‘సంస్కరణలు’


నగర ప్రజలపై ఇక ఆస్తి పన్ను రూపంలో భారాలు మోపేందుకు పాలకులు సిద్ధమయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి నగరంలో ఇంటి పన్నుల మోత మోగబోతోంది! విజయవాడ నగర ప్రజలపై ఏడాదికి రూ. 334 కోట్ల భారం పన్నుల రూపంలో పడనుంది. అద్దె విలువకు స్వస్తి చెప్పి, ఆస్తి విలువను లెక్కగట్టి మరీ పన్నుల మోత మోగించనున్నారు. ఈ లెక్కన ప్రతి ఏటా రిజిస్ర్టేషన్‌ విలువతో పాటే ఇంటి పన్ను కూడా పెరుగుతుంది. దానికి యూజర్‌ చార్జీల దరువు తోడవుతుంది. అప్పుల కోసం కేంద్రం వద్ద చేతులు చాచిన ఫలితమే ప్రజలపై ఈ భారాలు. రాష్ట్రాలకు అప్పులిచ్చి, ‘సంస్కరణల’ను ప్రజల నెత్తిన రుద్దాలని కేంద్రం షరతులు విధించగా, అందినంత అప్పులు తెచ్చి, ఆ భారాలను ప్రజల నెత్తిన రుద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

నగర ప్రజలపై నూతన ఆర్థిక సంవత్సరం నుంచి భారాల బండ పడబోతోంది. ఆస్తిపన్ను ఇప్పుడు చెల్లిస్తున్నదానికి పదిరెట్లు అదనం.. ఎడాపెడా యూజర్‌ చార్జీల బాదుడు.. ఏమున్నా లేకున్నా సొంత గూడు ఉంది చాలు.. అనుకుని సంతృప్తి చెందే సామాన్య, మధ్య తరగతి వర్గాలవారు నగరంలో నివసించాలంటేనే భయపడే రోజులొచ్చేస్తున్నాయి. ఆస్తి పన్ను పెంపు, యూజర్‌ చార్జీల విధింపునకు సంబంధించి చాలా కాలం నుంచే ప్రభుత్వం ప్రిపరేషన్‌లో ఉంది. విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇంకా నోటిఫికేషన్‌ వెలువరించకపోయినా.... ఎన్నికల తర్వాత నోటిఫికేషన్‌ను వెలువరించనుంది.  మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటానికి ఇప్పుడున్న పన్ను విలువపై 15 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం జీవో ఇచ్చినా.. దీనికి సంబంధించిన చట్టంలో మాత్రం ఆస్తి విలువ ప్రాతిపదికన పన్ను విధించాలని స్పష్టంగా ఉంది. ఆస్తి విలువ అంటే స్థలం, ఇల్లు.. రెండింటి విలువ. దీని ప్రకారం పాత విధానంతో పోల్చుకుంటే ఆస్తిపన్ను పది రెట్లు పెరుగుతుంది. ఈ రెండింటి ప్రాతిపదికన ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ప్రస్తుతం అసెస్‌మెంట్‌దారునికి ఎంత పన్ను వస్తుందో అంతకు పది రెట్లు పన్ను పెరుగుతుంది. ఉదాహరణకు నగర శివార్లలోని సింగ్‌నగర్‌, పాయకాపురం వంటి ప్రాంతాల్లో ఇప్పటి వరకూ రూ.500 చెల్లిస్తే, ఇప్పుడా పన్ను రూ.5 వేలకు చేరుతుంది. అదే ఖరీదైన నివాస ప్రాంతాలు, కమర్షియల్‌ ఏరియాలు, కాలనీలు, అపార్ట్‌మెంట్స్‌, ప్రధాన రోడ్ల వెంబడి అంచనా వేయడమే కష్టంగా ఉంది. 


కేంద్ర సంస్కరణలకు దాసోహం  

కేంద్ర ప్రభుత్వం అత్మనిర్భర్‌ పేరుతో రాష్ట్రాలకు రుణ పరిమితిని పెంచనున్నట్టు పేర్కొంది. అయితే ఇందుకు నాలుగు సంస్కరణలను అమలు చేయాలని షరతు విధించింది. ఇందులో మొదటిది విద్యుత్‌ సంస్కరణలు. రెండోది వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌, మూడోది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌. నాల్గవది పట్టణ సంస్కరణలు. అప్పు ఇస్తామంటే ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే అప్పుల కోసం ఈ సంస్కరణలన్నింటినీ అమలు చేయటానికి ముందుకొచ్చింది. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే విద్యుత్‌ మీటర్లకు శ్రీకారం చుట్టింది. పట్టణ సంస్కరణల్లో భాగంగా ఆస్తి పన్నును పది రెట్లు పెంచటం, యూజర్‌ చార్జీలను భారీగా విధించడం ద్వారా ప్రజలపై భారాలు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. 


జీవోలు కావవి.. గుదిబండలు 

పట్టణ సంస్కరణల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలు పేద, మధ్య తరగతి వర్గాలకు గుది బండలే. ఆస్తి పన్ను పెంపుదలకు ఉద్దేశించిన జీవో నెంబర్‌ 198, మురుగునీటి పన్నులకు సంబంధించి జీవో 196, మంచినీటి చార్జీలు, డొమెస్టిక్‌ మీటర్లకు సంబంధించి జీవో  197ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోలకు అనుగుణంగా పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు నోటిఫికేషన్లు వెలువరించాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఈ సంస్కరణలను అమలు చేయాల్సి ఉంది. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్‌ను వెలువరించనుంది. 


అద్దె విలువకు స్వస్తి  

గతంలో ఇంటి పన్నును అద్దె విలువ ప్రకారం పెంచేవారు. ప్రస్తుత సంస్కరణల్లో భాగంగా ఆస్తి విలువను లెక్కిస్తారు. ఆస్తి విలువలో స్థలం, అందులోని ఇంటి విలువలను లెక్కించి రెసిడెన్షియల్స్‌కు పాయింట్‌ 1 నుంచి పాయింట్‌ 5 శాతం పెంచాలని నిర్దేశించింది. నాన్‌ రెసిడెన్షియల్స్‌కు పాయింట్‌ 2 నుంచి 2 శాతం వరకు పెంచాలని నిర్దేశించింది. ఈ ప్రకారం చూస్తే రెసిడెన్షియల్స్‌పై 10 రెట్ల వరకు ఇంటి పన్ను పెరుగుతుంది. 


కొత్తగా ఇళ్లు కట్టిన వారికి పది రెట్లు  

ప్రభుత్వం మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 15 శాతం మాత్రమే అని చెబుతుంది. కానీ చట్టంలో అలా లేదు. 15 శాతం అయినా భారమే. ఇప్పటికే ఇళ్లు ఉన్న వారికి ఇది వర్తిస్తుందనుకున్నా.. కొత్తగా కట్టిన వారి విషయంలో వర్తించదు. దీంతో కొత్తగా ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించుకున్న వారికి క్యాపిటల్‌ వ్యాల్యూ ప్రకారం పూర్తిగా  లెక్కిస్తారు. దీంతో వారికి ఆస్తి పన్ను మోయలేని భారమే. 


నగర ప్రజలపై రూ.334 కోట్ల భారం 

ఆస్తి పన్ను పెంపుదలకు సంబంధించి నగర ప్రజల నుంచి మొత్తం రూ.500 కోట్లు వసూలు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం నగర వ్యాప్తంగా ఏడాదికి రూ.166 కోట్ల ఆస్తి పన్ను వసూలు అవుతోంది. కార్పొరేషన్‌ పరిధిలో రూ.500 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో మరో రూ. 334 కోట్ల మేర నగర ప్రజలపై భారం వేయాల్సి ఉంటుంది. 


యూజర్‌... చార్జ్‌! 

నగరంలో యూజర్‌ చార్జీల పేరుతోనూ ప్రజలపై అదనపు భారం పడబోతోంది. ప్రజలకు సేవలు అందించే క్రమంలో అవుతున్న వ్యయానికి తగిన విధంగా ఈ యూజర్‌ చార్జీలను నిర్దేశించారు. ఈ ప్రకారం నగరంలో కార్పొరేషన్‌ చేస్తున్న వ్యయం ప్రకారం డ్రెయినేజీకి రూ.50, మంచినీటి సరఫరాకు రూ.100 - రూ.300 వరకు యూజర్‌ చార్జీలను విధించనున్నారు. సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. తడి, పొడిచెత్తలను వేర్వేరుగా ఇచ్చిన వారికి రూ.50, రెండింటినీ కలిపి ఇచ్చే వారికి రూ.100 చొప్పున యూజర్‌ చార్జీ విధిస్తారు. 


ఇది అన్యాయం.. 

ఈ ప్రభుత్వం అప్పుల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశ చూపిన రుణపరిమితి పెంపునకు లొంగి, ప్రభుత్వం పట్టణ సంస్కరణల చట్టం తీసుకు రావటం దుర్మార్గం. అసెంబ్లీలో బిల్లు ఆమోదించినా, శాసనమండలిలో దీన్ని తిప్పికొట్టారు. అయినా ప్రభుత్వం తన పని తాను చేస్తోంది. దీనిపై మేము ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ప్రజలను అభ్యంతరాలు వ్యక్తం చేయమని చెబుతున్నాం. ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తారు కాబట్టి ఎన్నికల తర్వాత ఇచ్చే నోటిఫికేషన్‌ను ప్రజలు వ్యతిరేకించాలి. ఆస్తిపన్ను పెంపుపై ప్రజలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలపాలి. దీనిపై విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తాం. - సీహెచ్‌ బాబూరావు, రాష్ట్ర సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు


పట్టణ ప్రజల జీవితం భారం 

ఆస్తిపన్నును ఏప్రిల్‌ 1 నుంచి భారీగా పెంచటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అన్యాయం. రెంటల్‌ విలువ ప్రకారం కాకుండా, క్యాపిటల్‌ విలువ ప్రకారం పన్ను నిర్ణయించటం దుర్మార్గం. పట్టణవాసుల జీవితం దుర్భరంగా మారబోతోంది. ఒకవైపు ధరలు, కొత్త పన్నులతో విలవిలలాడుతుంటే, ఇప్పుడు ఆస్తిపన్ను పెంపుదల మరింత కుంగదీయబోతోంది. ప్రజల నుంచి తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉంది. - చెన్నుపాటి గాంధీ, మాజీ కార్పొరేటర్‌

Updated Date - 2021-02-27T05:58:28+05:30 IST